ఇది ప్రభుత్వ కుట్ర: అమరావతి జేఏసీ
posted on May 10, 2023 @ 11:03AM
అమరావతి భూములను పేదలకు దక్కకుండా చేయడంలో ప్రభుత్వ కుట్రను
అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి (జే ఏ సీ) నేత పువ్వాడ సుధాకర్ రావు బయట పెట్టారు. రాజకీయ స్వార్థంతో కూడినటువంటి నిర్ణయం వలన ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు రాజధాని అమరావతిలో ఉచితంగా ఇంటిని పొందే అవకాశాన్ని ఈ ప్రభుత్వం భూస్థాపితం చేస్తుందన్నారు. వారికి శాశ్వతంగా రాజధానిలో నివాసాన్ని లేకుండా చేస్తుందని ఆయన ఆరోపించారు.
‘‘అమరావతి రాజధాని లో గత ప్రభుత్వ హయాంలో 44 ఎకరాలలో 5024 అత్యంత మన్నిక గల, గౌరవప్రదమైన టిడ్కో ఇళ్లను నిర్మించడం జరిగినది అనగా ఒక ఎకరమునకు 114 ఇళ్లను నిర్మించడం జరిగింది. ఈ ప్రభుత్వం ప్రస్తుతం 1134 ఎకరాలతో పాటు ఇప్పుడు అదనంగా కోరిన 268 ఎకరాలను కలుపుకొని మొత్తం 1402 ఎకరాలలో సుమారుగా 50వేల మందికి సెంటు భూమిని పంపిణీ చేస్తుంది. అనగా ఒక ఎకరం 35 కుటుంబాలకు కేటాయిస్తుంది, అదే 1402 ఎకరాలలో టిడ్కో ఇళ్ల నిర్మాణం తరహాలో ఎకరానికి పైన పేర్కొన్న విధంగా ఎకరం ఒక్కింటికి 114 ఇళ్ల చొప్పున 160000 కుటుంబాలకు ఇళ్లను నిర్మించవచ్చు.ప్రభుత్వ స్వార్థపూరిత నిర్ణయం వలన, అమరావతి రాజధాని విధ్వంసకర కుట్రకు పాల్పడటం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు నుండి శ్రీకాకుళం జిల్లా వరకు ఉన్న సుమారుగా 110000 ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు అమరావతి రాజధాని లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఉచితంగా ఇంటిని పొందే మహత్భాగ్యాన్ని, అమరావతి రైతుల త్యాగ ఫలితంగా ఏర్పడిన సువర్ణ అవకాశాన్ని ఈ ప్రభుత్వం సమూలంగా నాశనం చేయడం కాదా?
ఇది కాదా మోసం? ఇది కాదా దుర్మార్గం? ఇది కాదా ప్రభుత్వ దుందుడుకు చర్య?ఈ ప్రభుత్వం కాదా పేదల పాలిట శాపం?వాస్తవాలను నిర్భయంగా ప్రకటిద్దాం.పేదల పక్షాన నిలబడదాం.ఈ ప్రభుత్వ కుట్రలను చేదిద్దాం ప్రభుత్వాన్ని నిలదీద్దాం పేదవాడిని గెలిపిద్దాం’’ అని పువ్వాడ సుధాకర్ పిలుపునిచ్చారు.