నాగబాబు వాచాలత.. వాతావరణాన్ని చెడగొడుతోందా?
posted on May 10, 2023 @ 11:01AM
మెగా బ్రదర్ నాగబాబు.. ఎప్పుడు ఏం మాట్లాడతారో.. ఆయనకే అర్ధం కానట్లుంటుంది ఆయన తీరు. చాలా సార్లు ఆయన వ్యాఖ్యలు, మాటలు వివాదాలకు తావిచ్చేవిగానే ఉంటాయి. నటుడిగా, టీవీలలో జబర్దస్త వంటి షోలకు జడ్జిగా ఆయన పాత్రను ఆయన బాగానే పోషించారు. అయితే రాజకీయాలలో మాత్రం ఆయన తప్పుటడుగులు వేస్తున్నారు. వాచాలత కారణంగా ఆయన సొంత పార్టీకే నష్టం చేకూరుస్తున్నారు.
ప్రజారాజ్యంలో ఉన్నంత కాలం ఆయన ఏం మాట్లాడారు, ఏం చేశారు అన్నది పక్కన పెడితే.. చాలా కాలం తరువాత యిప్పుడు జనసేన పార్టీలో కీ రోల్ పోషిస్తున్న సమయంలో ఏదైనా మాట్లాడే ముందు ఒకింత వెనకా ముందూ ఆలోచించాల్సి ఉంటుంది. అయితే ఆ పని నాగబాబుకు తెలియదన్న సంగతి ఆయనకు తప్ప అందరికీ తెలుసు. యింతకీ ఈ ఉపోద్ఘాతమెందుకంటే.. ఆయన తాజాగా జనసేన ఓట్ల శాతం గురించి ప్రకటన చేసి వివాదాల తుట్టె కదిపారు. జనసేనకు 35శాతం ఓట్లు ఉన్నాయని ఊరుకుంటే బాగానే ఉండేది. కానీ నాగబాబుకు ఎక్కడ ఆపాలో తెలియదు. అందుకే ఆయన పవన్ కల్యాణ్ సీఎం అవుతారంటూ చేసిన ప్రకటన జనసేన వర్గాలలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడానికి కారణమైంది.
జనసేన ప్రధాన కార్యదర్శిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన జనసేనాని సోదరుడు నాగబాబు వ్యాఖ్యలు జనసేన రాజకీయ లక్ష్యానికీ, ఆదర్శానికీ భిన్నంగా ఉన్నాయి. ఒక వైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీల నివ్వను అంటూ పదే పదే చెబుతూ.. తెలుగుదేశంతో పొత్తు ఉంటుందన్న సంకేతాలు యిస్తున్నారు. అలాగే ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తుందన్న సంకేతాలు యిస్తున్నారు. ఈ సంకేతాల కారణంగానే క్షేత్ర స్థాయిలో జనసైనికులు తెలుగుదేశం శ్రేణులతో కలిసి పని చేస్తున్నాయి. లోకేష్ పాదయాత్రలో కూడా జనసేన జెండాలు రెపరెపలాడుతున్నాయి. అయితే తెలుగుదేశం- జనసేన మధ్య పొత్తు వ్యవహారం అధికారికంగా ఖరారు అయిన దాఖలాలు లేవు.
అందుకు అవసరమైన సానుకూల వాతావరణం అయితే ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఆ సానుకూల వాతావరణాన్ని దెబ్బ కొట్టే విధంగా పవన్ కల్యాణ్ సీఎం అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. పొత్తు లేకుండా జనసేన ఒక వేళ ఒంటరిగా రంగంలోకి దిగితే.. అప్పుడు నాగబాబు ఆ మాటలు అన్నా అర్ధం ఉండేది. కానీ పార్టీ అధినేత, పార్టీలో నంబర్ 2గా గుర్తింపు పొందిన నాయకుడు కూడా పోత్తులకు అనుకూలం అంటూ సంకేతాలు యిస్తుంటే.. నాగ బాబు మాత్రం ఆలూ లేదు చూలు లేదన్నట్లుగా ముఖ్యమంత్రి పవన్ అంటూ ప్రకటన చేయడంపై జనసేన శ్రేణుల్లోనే వ్యతిరేకత వ్యక్తమౌతున్నది.
పవన్ సోదరుడు అన్న గుర్తింపు వినా జనసేనలో కానీ, రాజకీయంగా కానీ నాగబాబుకు ప్రత్యేక గుర్తింపు అన్నది లేదనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మెగా బ్రదర్ కార్డుతో పొందుతున్న గౌరవాన్ని నిలుపుకోవాలంటే యిలాంటి తొందరపాటు ప్రకటనలు కూడదని సూచిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయన్న దానిపై యిప్పటికింకా సందిగ్ధతే నెలకొని ఉంది. అయితే ఒక జనరల్ ఫీలింగ్ మాత్రం బీజేపీ కలిసి వచ్చినా రాకున్నా.. తెలుగుదేశం, జనసేనలు కలిసే సాగుతాయన్న సంకేతాలైతే స్పష్టంగా ఉన్నాయి.
ఈ పరిస్థితుల్లో నాగబాబు చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తెలుగుదేశంతో పొత్తు కుదిరితే.. జనసేన ఆ పార్టీతో సీట్లు పంచుకోవలసి ఉంటుంది. తెలుగుదేశం కచ్చితంగా అధిక స్ధానాలలో పోటీకి దిగుతుంది. అ విషయాన్ని జనసేనాని పలు సందర్భాలలో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. గౌరవానికి భంగం కలగని రీతిలో పొత్తులు ఉంటాయనడం ద్వారా.. కొన్ని స్థానాలకు తమ పార్టీ పరిమితమౌతుందని ఆయన చెప్పకనే చెప్పేశారు. మరి అలాంటప్పుడు ఎక్కువ స్థానాలలో పోటీచేసే తెలుగుదేశం జనసేనకు సీఎం పదవి యివ్వడానికి అంగీకరిస్తుందా? యిప్పటికిప్పుడు అయితే రాజకీయ అవసరాల దృష్ట్యా యిరు పార్టీలూ పరస్పర సహకారం గురించి మాట్లాడుకుంటున్నా.. గత అనుభవం దృష్ట్యా చూస్తే.. పొత్తు తెలుగుదేశం పార్టీకి కంటే జనసేన పార్టీకే ఎక్కు వ అవసరం.
ఆ సంగతిని విస్మరించి పవన్ సీఎం అంటూ నాగబాబు ప్రకటనలు గుప్పించడం జనసేనకు ప్రయోజనం సంగతి పక్కన పెడితే నష్టం చేసే అవకాశాలే ఎక్కువ. ఆయన వ్యాఖ్యలు క్షేత్ర స్థాయిలో జనసేన శ్రేణులను అయోమయానికి గురి చేయడం తప్ప మరో ప్రయోజనం ఉండదని పరిశీలకులు అంటున్నారు. అంతే కాకుండా.. వైసీపీకి తెలుగుదేశం.. జనసేన పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు వైసీపీకి ఆయాచితంగా ఓ అస్త్రం అందించినట్లైందని విశ్లేషిస్తున్నారు.