ప్రసాదం కౌంటర్ లో దొంగలు పడ్డారు
posted on Jan 25, 2023 @ 2:52PM
తిరుమల వెంకన్న దేవుడు మహిమగల దేవుడు. ఆయన లీలలు ఇన్నీ అన్నీ కాదు. అందుకే ఎక్కడెక్కడి నుంచో భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారు. మొక్కులు తీర్చుకుంటారు. కానుకలు సమర్పించుకుంటారు. వెంకన్న దేవుని ఆదాయమ లక్షల్లో కాదు కోట్లలో ఉంటుంది. ఆ నిధులన్నీ ఎటు పోతున్నాయో ఏమవుతున్నాయో, ఎప్పటికీ ఒక శేష ప్రశ్న గానే ఉండి పోతోంది.
ఇవన్నీ ఒకెత్తు అయితే వెంకన్న దేవుని లీలల కంటే, కొండ మీద జగనన్న దేవుని లీలలే ప్రముఖంగా పతాక శీర్షికలకు ఎక్కుతున్నాయి. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, ఆయన గారి బాబాయ్ గారు, సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ అయినప్పటి నుంచి ఒక దాని వెంట ఒకటిగా ఎన్నో అపశ్రుతులు, అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. భక్తుల హృదయాలను కలతకు గురు చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం కొండపై ఉన్న టీటీడీ వసతి గృహాలలో రూము రెంట్ ను అడ్డగోలుగా పెంచేశారు. భక్తులు గగ్గోలు పెట్టారు. అయినా జరిగింది ఏమీ లేదు. చిన్న గీత పక్కన పెద్ద గీత పెట్టారు. అంతకు మించిన మరో పెద్ద సమస్యను తెరమీదకు తెచ్చారు.
గదుల అద్దె వివాదం పూర్తిగా సమసి పోక ముందే, మరో వివాదం తెరపై కొచ్చింది. నిబంధనలు కాదు, ఆగమ శాస్త్ర విరుద్ధంగా శ్రీవారి ఆలయంపై డ్రోన్ చక్కర్లు కొట్టింది, చిత్రాలు తీసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పటికి గానీ ఘనత వహించిన టీటీడీ ప్రభువులు ఏమి జరిగిందనేడి గుర్తించనే లేదు. ఇంకా చిత్ర విచిత్రం ఏమంటే, టీటీడీ చైర్మన్ సుబ్భారెడ్డి డ్రోన్ మాయను తెలుసుకునేందుకు అర్జెంటుగా ఒక కమిటిని వేశారు. ఆ కమిటీ, హైదరాబాద్ కు చెందిన ఫలానా కంపెనీ డ్రోన్ కొండ మీద చక్కర్లు కొట్టిందని కనిపెట్టేసింది. చైర్మన్ అదంతా తమ ఘనతగా చెప్పుకున్నారు. కానీ, అసలు జరిగింది, ఏమిటంటే, అది ఎవరో చేసిన తప్పుకాదు, స్వయంగా టీటీడీ కార్యనిర్వహణ అధికారి, (ఈఓ) ధర్మారెడ్డి అనుమతి ప్రకారం జరిగిన పుణ్య కార్యమని తెలిసింది.
ఇందుకు సంబంధించి తాజాగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. తిరుమలలో డ్రోన్ సర్వేకు ఐవోసీఎల్ కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది వాస్తమేనని అన్నారు. కారిడార్ ఏర్పాటు చేసుకునేందుకు అన్నదానం దగ్గర నుంచి గార్బెజ్ సెంటర్ వరకు డ్రోన్ సర్వేకు ఐవోసీఎల్ పర్మిషన్ అడిగితే ఇచ్చామని చెప్పారు. ఆ ప్రాంతంలో మాత్రమే సర్వేకు అనుమతి ఉందన్నారు. అయితే వాళ్లు అత్యుత్సాహంతో ఇది చేశారా? ఎవరైనా ఏదైనా టెక్నాలజీ ఉపయోగించి వీడియోను క్రియేట్ చేశారా? అనేది తెలియాల్సి ఉందన్నారు. ఆ వీడియోను ఫోరెన్సిక్ డిపార్టమెంట్‌కు పంపించి ఎలా చేశారనేది గుర్తించడం జరుగుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం జరిగిందన్నారు. వైరల్ అయిన వీడియోలు నిజమైనవా లేక ఫేక్ వీడియోలా అని తేలాల్సి ఉందని చెప్పారు. అత్యుత్సాహంతో చేసినా, ఏ విధంగా చేసినా తప్పు తప్పేనని అన్నారు. కానీ అసలు డ్రోన్ కొండమీదకు రావడం ఏమిటి? అందుకు సంబంధించి కనీసం చైర్మన్ కు ముందస్తు సమాచారం లేక పోవడం ఏమిటి? అంత జరిగినా, ఈఓ ఇంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం ఏమిటి? అంటే ఈ ప్రశ్నలు వేటికీ సమాధానం లేదు.
అదలా ఉంటే ఇప్పుడు తాజాగా మరో వివాదం, మరో విషాదం వెలుగు చూసింది. తిరుమల లడ్డూ కౌంటర్‌లో దొంగతనం జరిగింది. కొద్ది రోజుల క్రితం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కౌంటర్ నెంబర్ 36 వద్ద ఈ ఘటన జరిగింది. కౌంటర్ బాయ్ నిద్ర మత్తులో వుండగా దొంగ లోపలికి చొరబడి రూ.2 లక్షలు చోరి చేసినట్లు టీటీడీ గుర్తించింది. దీనిపై తిరుపతి వన్‌టౌన్ పోలీసులకు టీటీడీ అధికారులు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తిస్తున్నారు. ఇతను గతంలోనూ పలు చోరీలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఇది ఇంటి దొంగల పనే అని అంటున్నారు. దొంగతనానికి పాల్పడింది పాత దొంగే అనే సీసీ కెమెరాలు చెపుతున్నాయంటే, ఇది ఇంటి దొంగల పనే అని అంటున్నారు. నిజానికి, ఇలాంటి సంఘటనలు పై వారి అసీస్సులతోనే జరుగు తున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.