బీజేపీకి ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ గుడ్ బై
posted on Jan 25, 2023 @ 3:16PM
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్, ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ బిజెపికి రాజీనామా చేశారు. ఈ మేరకు వారిరువురూ వేర్వేరుగా బీజేపీ జాతీయ కార్యదర్శి జేపీ నడ్డాకు రాజీనామా లేఖలు పంపారు. వీరిరువురూ త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్)లో చేరే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ను వీడి 2015లో బిజెపిలో చేరిన గిరిధర్ గమాంగ్ కొద్ది రోజుల కిందట బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయిన సంగతి విదితమే. ప్రగతి భవన్ లో జరిగిన ఈ భేటీలో గిరిధర్ కుమారుడు శిశిర్ గమాంగ్, ఇతర నేతలు పాల్గొన్నారు.
అప్పటి నుంచీ గిరిధర్ గమాంగ్ తన కుమారుడితో సహా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారన్న ప్రచారం జరుగోంది. వీరి రాజీనామాతో ఆ ప్రచారం వాస్తవమేనని తేలింది. బీఆర్ఎస్ కార్యకలాపాలను తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరించనున్నట్లు ఇప్పటికే కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు ఆయన బీజేపీకి రాజీనామా చేయడంతో ఒడిశాలో బీఆర్ఎస్ కార్యకలాపాలు ఆరంభం కానున్నాయి. ఇంతకీ ఈ గిరిధర్ గమాంగ ఎవరంటే.. 1999లో అప్పటి వాజ్ పేయి ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన ఒకే ఒక్క ఓటు వేసిన వ్యక్తి. 1999 ఏప్రిల్ 17 న అవిశ్వాస పరీక్షలో 13 నెలల నాటి ప్రధాని వాజ్‌పేయి ప్రభుత్వాన్ని కూల్చిన కాంగ్రెస్ నేత గిరిధర్ గమాంగ్. ఈయన 9 సార్లు పార్లమెంటుకు ఎన్నియ్యారు. కాగా, గమాంగ్ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే ఒడిశా ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.
ఆ సమయంలోనే వాజ్‌పేయి ప్రభుత్వం ఎదుర్కొన్న అవిశ్వాస పరీక్షలో చివరి నిమిషంలో పార్లమెంట్‌కు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఒ ఒక్క వోటు కారణంగానే నాటి బీజేపీ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తరువాత కొద్ది రోజులకే ఆయన కాంగ్రెస్ పార్టీకి క్రమంగా దూరమయ్యారు. తన కుమారుడికి కాంగ్రెస్ తగు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోిస్తూ.. 2015లో బీజేపీ గూటికి చేరారు.
ఇప్పుడు ఆయన బీజేపీకి రాజీనామా చేసి కుమారుడు శిశిర్ గమాంగ్ తో కలిసి బీఆర్ఎస్ గూటికి చేరే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ఆయన బీఆర్ఎస్ ఒడిశా శాఖ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పడు ఆయన రాజకీయాలలో పెద్దగా క్రియాశీలంగా లేరు. ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ రాజకీయ భవిష్యత్ కోసమే బీజేపీని వీడి బీఆర్ఎస్ గూటికి చేరారని పరిశీలకులుఅంటున్నారు.