Read more!

కొత్త సంవత్సరపు లాంఛనం??

వచ్చేస్తోంది వచ్చేస్తోంది ఆంగ్ల సంవత్సరం కొత్త సంఖ్యను మోసుకొచ్చేస్తోంది. నిజానికి అన్ని సంఖ్యల లాగే ఇది కూడా, ఈ సంవత్సరం తరువాత మళ్ళీ ఇంకో కొత్త సంఖ్య, ఇంకో కొత్త సంవత్సరం. ఇట్లా మారుతున్న సంఖ్యలు చూసుకుని మురిసిపోతే జీవితం  మారిపోతుందా?? 

కొత్త సంవత్సరం అనగానే ఎక్కడలేని హుషారుతో, సంప్రదాయ పండగలకు కూడా చేయనంత హడావిడి చేస్తూ కేకులు, స్వీట్లు, నైట్ పార్టీలు, విందులు, వినోదాలు ఇలా ఒకటి, రెండు కాదు. ఇక ముఖ్యంగా చెప్పుకుంటే అందరికీ తెలిసిన విషయం ఈ కొత్త సంవత్సర వేడుకలలో ఇంత హంగామా సృష్టించే వాళ్లలో యూత్ ఏ ఎక్కువ. ముందు రోజు రాత్రి  మొత్తం పార్టీలతో, పబ్బులలో గడుపుతూ, వీధులన్నీ బైక్ లలో చక్కర్లు కొడుతూ చేసే గోలలో సంతోషాన్ని చూసుకునే వాళ్ళు కొందరు. 

నిజానికి మన భారతీయులు పంచాంగం పరంగా తెలుగు సంవత్సరాదిని ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఉగాదికి ప్రాధాన్యం  ఇవ్వాలని చెప్పుకున్నా, ఈ ఆంగ్ల సంవత్సరాన్ని వేడుకగా చేసుకోవడంలో తప్పేమీ లేదనే అభిప్రాయం కూడా నిజమే కావచ్చు. అయితే!! ఈ కొత్త సంవత్సర సందర్భంగా చాలామంది కొన్ని కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా సంవత్సరం ప్రారంభమయిన కొన్ని రోజులకు తూ తూ మంత్రంగా సాగుతుంటాయి.

కొత్త నిర్ణయాలు సాధ్యాసాధ్యాలు చూసుకునే తీసుకోవాలి!!

నిర్ణయం తీసుకోవడం సమస్య కాదు. కానీ దాన్ని జీవితంలో అమలుపరచడం కొద్దిగా కష్టం. నిజానికి అది కూడా కష్టం కాదు, ఆ నిర్ణయం పట్ల సీరియస్ గా ఉన్నవాళ్లు అయితే దాన్ని తప్పకుండా పాటిస్తారు కూడా. కానీ ఎటొచ్చి ఆ నిర్ణయాలు తీసుకోవడం అనేది ఒక ఫాషన్ గానూ, స్టేటస్ గానూ భావించి నలుగురిని అట్రాక్ట్ చేయడానికి చేసేవి అవుతున్నాయి చాలామంది విషయంలో.

ఛాలెంజ్ లు ఒత్తిడులు వద్దు!

ఈ ఇయర్ స్టార్టింగ్ నుండి నేను బరువు తగ్గడం మొదలు పెట్టేయాలి. ఈసారి అయినా డ్రింకింగ్, స్మోకింగ్ అలవాటు మానుకోవాలి. ఈసారి ఎదో ఒక విధంగా జాబ్ కొట్టాలి. 

ఇలాంటి మాటలు చాలామంది దగ్గర చూస్తుంటాం. ఇలాంటి ఛాలెంజ్ లు మీరైతే తీసుకోవద్దు. అసలు ఛాలెంజ్ ఎందుకు చేసుకోవాలి. పేరుకు కొత్త సంవత్సరమే అయినా  కాలం ఏమి కొత్తగా ఎవరికోసం ఆగదు, ఎదురుచూడదు. ప్రత్యేకంగా ఎవరికోసం కాస్త మెల్లగా జరగదు. అలాంటప్పుడు ఇలాంటి ఒత్తిడి పెంచే ఛాలెంజ్ లు తీసుకుని తరువాత ఆ ఒత్తిడి వల్ల ఉన్న ప్రశాంతత పోగొట్టుకోకుండా. ఉండటం ఉత్తమం. అలాగని అలాంటివి వ్యర్థం అనడం లేదు. కానీ ఆ చేసేది ఏదో ఛాలెంజ్ లా కాకుండా లైఫ్ స్టైల్ లో ఒక భాగం చేసుకుంటే ఆహా!! రోజులో అదీ ఒక ప్రాముఖ్య విషయంగా మారి సమస్యలను సులువుగా తగ్గిస్తుంది.

నిన్నటి కంటే ఈరోజు!! 

ఈరోజు కంటే రేపు!!

ఉత్తమంగా ఉండాలని చెప్పడం పరిపాటి. అందులో అర్థం మనుషులు మెరుగవాలని. ఎలా అవుతారు అంటే కొన్ని మంచి అలవాట్లు లైఫ్ స్టైల్ లో భాగం చేసుకోవాలి. 

పుస్తక పఠనం!!

ప్రపంచ జ్ఞానాన్ని అందించేవి పుస్తకాలు. అలాంటి పుస్తక పఠనాన్ని లైఫ్ స్టైల్ లో భాగం చేసుకోవాలి. మొబైల్ లో గంటల తరబడి బ్రౌజింగ్ చేసెబదులు కనీసం రోజులో గంట సేపు అయినా పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి. ఇదొక గొప్ప అలవాటుగా మారితే జీవితంలో ఎంతో గొప్ప మార్పు వస్తుంది. ఆలోచన నుండి, జీవితంలో ఆచరించే ఎన్నో విషయాల్లో స్పష్టత తెలుసుకుంటారు.

ఆరోగ్యం!!

ప్రస్తుతం భారతదేశం యావత్తు బాధపడుతున్న సమస్యలు ఆరోగ్యపరమైనవే. అన్నీ జబ్బులు, విపత్తులు. వీటి ద్వారాయా మనిషి శారీరకంగా నష్టపోతున్నాడు.. అలాంటి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఆహారం, అలవాట్లు, దినచర్య వంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. పర్యావరణాన్ని కాపాడుకుంటూ తమను తాము రక్షించుకోవాలి.

వ్యసనాలకు దూరంగా!!

ఏ అలవాటు అయినా మరీ అతి అయితే అది వ్యసనమే అవుతుంది. మంచి విషయాలు అయినా సరే వ్యసనం అవ్వడం మంచిది కాదు. ఏది ఎంతలో ఉండాలో అంత ఉంటే మంచిది. ఎందుకంటే వ్యసనంగా మారే ప్రతిదీ జీవితంలో మిగతా విషయాల మీద ప్రభావం చూపిస్తుంది.

అందుకే మంచి విషయలు కూడా వ్యసనం కాకూడదు.

ఎవరి సంతోషం వాళ్ళ చేతుల్లో!!

నిజమే. ఎవరి సంతోషం వాళ్ళ చేతుల్లో ఉండాలి. కొన్ని నిర్ణయాలు, కొన్ని ఇష్టాలు, కొంత స్వేచ్ఛ ఇవన్నీ అంతో ఇంతో ప్రతి మనిషికి ఉండాలి. అలా ఉంటే సంతోషం కోసం ఎక్కడో వెతనక్కర్లేదు. అది మనసులోనే ఉంటుంది అప్పుడు.

కాబట్టి కొత్త సంవత్సరాన్ని ఛాలెంజ్ ల పరంపరలో కాకుండా లైఫ్ స్టైల్ తో లాంఛనంగా ప్రారంభించండి.

◆ వెంకటేష్ పువ్వాడ