Read more!

ముక్తి మార్గానికి తొలిమెట్టు!!

యుక్తః కర్మఫలం త్యక్త్వా శాన్తిమాప్నోతి నైష్టికీమ్|

అయుక్తః కామకారేణ ఫలే సక్తి నిబధ్యతే ॥

యుక్తుడు అయిన వాడు కర్మఫలములను వదిలిపెట్టి, పరమ శాంతిని పొందుతాడు. యుక్తుడు కాని వాడు కోరికలు తీరడం కోసం కర్మలు చేస్తూ, ఆ కర్మఫలముల ఆసక్తితో బంధనములకు లోనవుతున్నాడు.

కర్మఫలాన్ని వదిలిపెడితే ఏం జరుగుతుంది. కర్మఫలాన్ని ఆశిస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పాడు పరమాత్మ, బంధనములకు కారణం ఆశ. మోక్షమునకు కారణం ఆశ లేకుండా ఉండటం. ఆశను వదిలిపెడితే బంధనములు ఉండవు. జ్ఞానం, ఆత్మ శాంతి కలుగుతుంది, ఆశతో కర్మలు చేస్తే బంధనాలు, దుఃఖము, పతనము కలుగుతుంది. ఆశగానీ ప్రతిఫలాపేక్ష గానీ లేకుండా కర్మలు చేస్తే చిత్తము నిర్మలంగా ఉంటుంది. అప్పుడు ఆత్మ గురించి ఆలోచిస్తాడు. శాంతిని పొందుతారు. కాబట్టి కర్మయోగమైనా జ్ఞాన యోగమైనా పొందేది శాంతి. కాని కర్మయోగంతో కలిగే శాంతి తాత్కాలికము. జ్ఞాన యోగంతో కలిగే శాంతి శాశ్వతము. అందుకే దానిని ప్రశాంతి అంటే ప్రకృష్టమైన శాంతి అని అన్నారు.

కాబట్టి యుక్తుడు అంటే నిశ్చయాత్మక బుద్ధి కలిగిన వాడు. ఏ కర్మచేసిన ఈ పని నేను చేస్తున్నాను అనే కరత్వభావనతో కాకుండా, ఈ పని నా స్వలాభం కోసం చేస్తున్నాను అని కాకుండా, ఈ పని భగవంతుని పరంగా చేస్తున్నాను. దీని ఫలితం భగవంతునికే అర్పిస్తున్నాను అనే భావనతో చేయాలి. అలా చేస్తే ముందు మనసు నిర్మలం అవుతుంది. తరువాత ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆఖరున ఆత్మసాక్షాత్కారం పొందుతాడు. అయుక్తుడు అంటే నిశ్చయాత్మక బుద్ధి లేని వాడు ఏ పని చేసినా తన స్వలాభం కొరకే చేస్తాడు. కర్మబంధనములలో చిక్కుకుంటాడు. తీవ్రమైన అశాంతికి గురి అవుతాడు. కాబట్టి ఆర్జించే ధనము, సిరిసంపదలు, పదవులు శాంతిని ఇవ్వలేవు. పైగా అవి పోతాయేమో అనే నిరంతర భయంతో అశాంతికి గురి అవుతాడు.

ఈ శ్లోకంలో "నిభధ్యతే" అని వాడారు. అంటే ఆశతో, ప్రతిఫలాపేక్షతో కర్మలు చేస్తే బంధనములు తప్పవు అని నిర్ద్వంద్వంగా చెప్పాడు. కాబట్టి ముందు ఆశ, ప్రతిఫలాపేక్ష వదిలిపెట్టాలి అని తెలుస్తూ ఉంది. ఈ శ్లోకంలో పరమాత్మ పరమ శాంతి కలగడానికి మార్గం ఏమిటి అనేది. స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి మానవుడూ మనశ్శాంతిని వెదుకుతున్నాడు. మనశ్శాంతి కొరకు బాబాలను, దేవుళ్లను, తీర్థయాత్రలను ఆశ్రయిస్తున్నాడు. కాని మనశ్శాంతి తన చేతిలోనే ఉందని తెలుసుకోలేకపోతున్నాడు. అదే అజ్ఞానము, అవిద్య, కేవలం, మనసులో నుండి ఆశను దూరం చేసి, ఫలితం ఆశించకుండా కర్మలు చేస్తే ఆత్మశాంతి దానంతట అదే వస్తుండ్హి. ఇదే ఇందులో రహస్యం కాకుండా ఆశతో ఫలితం ఆశించి పనులు చేస్తే దుఃఖం వస్తుంది. ఆ దుఃఖాలను తాత్కాలికంగా మరిచిపోవడానికి సాయంత్రం బార్లను, డ్రగ్సును ఆశ్రయిస్తున్నారు. చేయవలసిన పని చేయడం లేదు. చేయకూడని పని చేస్తున్నారు. అదే నాకంతా తెలుసు అని అహంకారము, ఏమీ తెలియని తనం అంటే అవిద్య, కేవలము మనస్సును ఇటు నుండి అటు మళ్లిస్తే సరిపోయేదానికి రోజూ వందలు వేలు తగలేస్తున్నారు. అప్పులపాలై అప్పులు తీర్చలేక, దుఃఖంతో మరలా అదే వ్యసనానికి బానిస అవుతున్నారు.

కాబట్టి ముందు మనలో ఉన్న తెలియనితనాన్ని పోగొట్టుకుంటే, బుద్ధి సక్రమంగా పని చేస్తుంది. విచక్షణా జ్ఞానం వస్తుంది. ఏ పని చేయాలో ఏపని చేయకూడదో, చేసే పని ఎలా చేయాలో అనే విషయం తెలుస్తుంది. మనస్సు ప్రాపంచిక విషయాల నుండి నివృత్తి మార్గంలోకి మళ్లుతుంది. అదే ముక్తిమార్గానికి తొలిమెట్టు.

◆ వెంకటేష్ పువ్వాడ