మనిషిలో సంఘర్షణలు.. వాటి తీరు..

మనిషి తన జీవితంలో సంఘర్షణలు ఎదుర్కోవడం  సహజం. సంఘర్షణ అంటే ఏమిటి?? అని ప్రశ్న వేసుకుంటే మనసులో ఉన్న అభిప్రాయానికి, బాహ్య పరిస్థితుల వల్ల ఎదురయ్యే అనుభవాలను మధ్య మనిషికి అంతర్గతంగా అంగీకారం కుదరకపోవడం వల్ల కలిగేది సంఘర్షణ. ఏకాభిప్రాయం ఎప్పుడైతే కలగదో.. అప్పుడు మనిషి వ్యతిరేకభావంలోకి వెళతాడు. మనిషిలో ఉన్న వ్యతిరేకభావం కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా అంగీకరించాల్సి వస్తుంది. ఈ తరహా రెండు విరుద్ధ భావాల మధ్య మనిషి ఊగిసలాడటం వల్ల కలిగేది సంఘర్షణ. మనిషిలో ఇలాంటి సంఘర్షణలు చాలానే ఉంటాయి. చాలా సందర్భాలలో సంఘర్షణలు అనుభవిస్తూ ఉంటారు. అయితే ఈ సంఘర్షణలలో కూడా రకాలు ఉన్నాయని… అవి వివిధ వైఖరులు కలిగి ఉంటాయని చాలామందికి తెలియదు. 

కావాలి-వద్దు అనిపించే సంఘర్షణలు:-

కొన్నిటి నుండి దూరంగా వెళ్లిపోవాలని అనిపిస్తుంది. ఉన్నదాన్ని వదిలేసుకోవాలని అనిపిస్తుంది. కానీ అది వదిలేసుకొని వెళ్ళిపోతే ఆ తరువాత జీవితం క్లిష్టం అవుతుందేమో అనే భయం, ఈ సమస్యను చూసి వెళ్ళిపోతే.. ఆ తరువాత కూడా సమస్యలు ఎదురవ్వడం వల్ల ఇబ్బంది తప్పదనే ఆలోచన మనిషిని సంఘర్షణలోకి నెట్టేస్తాయి. 

ఉదాహరణకు..

 భర్త పెట్టే కష్టాల్ని భరించలేని ఓ మహిళ వివాహ బంధం నుంచి విముక్తి పొందాలని ఆలోచించవచ్చు. అయితే వివాహంలో ఉన్న భద్రత, విడిపోతే ఎదురయ్యే సమస్యల గురించి కూడా ఆమె ఆలోచిస్తూ ఉండిపోతుంది. భర్తకు దూరంగా వచ్చేసే  స్త్రీ గురించి ఈ సమాజం ఆలోచనా తీరు, సమాజంలో పౌరుల ప్రవర్తన ఆ మహిళను ఒక నిర్ణయం తీసుకోనీయకపోవచ్చు.  ఇక్కడ ఆ మహిళ ఏ నిర్ణయం తీసుకున్నా దానికుండే మంచీ చెడు, కష్టనష్టాలు దానికుంటాయి. జీవితంలో ఇట్లాంటి పరిస్థితులు ఎన్నో ఎదురౌతూ ఉంటాయి. అవి ఒత్తిడికి దారి తీసి అదే క్రమంగా డిప్రెషన్ అనే సమస్యను క్రియేట్ చేస్తుంది. 

అదే విధంగా  పెద్ద చదువులు చదవాలని అనుకొనే విద్యార్ధి ఏమి చదవాలా అనే ఆలోచనతో సరైన నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. ఆ ఆలోచనలోనే సంఘర్షణకి లోను కావచ్చు. అయిదారు సబ్జెక్టులలో ఒకటి ఎంచుకోవటం అతనికి కష్టం కావచ్చు.

రెండూ కావాలనిపించే సంఘర్షణ:-

దీన్నే చాలామంది అవ్వా కావాలి, బువ్వా కావాలి అని సామెతకు అన్వయిస్తారు. ఒక వ్యక్తి దగ్గర చాలా మొత్తమే డబ్బు ఉంది. ఆ డబ్బు ఆ వ్యక్తికి ఇల్లు కాని, కారు కాని ఏదో ఒకటి  కొనుక్కోవటానికి సరిపోతుందనుకుంటే… ఇక్కడ అతనిలో సంఘర్షణ మోడ్స్లవుతుంది. ఇల్లు కొనుక్కుందామని అనుకుంటే… కారు గుర్తుకు వస్తుంది. పోనీ కారు కొనుక్కుందామని అనుకుంటే… ఇల్లు గుర్తుకువస్తుంది. రెండూ కావాలని అనిపిస్తుంది కానీ ఏదో ఒకటే అతని తాహతుకు సరిపోతుంది. ఇందులో పైన చెప్పుకున్నా సంఘర్షణ కంటే దీని తీవ్రత తక్కువే ఉన్నా ఇది సాధారణంగా పెద్దలలో కంటే.. పిల్లలలో ఇంకా యువతలో ఎక్కువగా ఎదురవుతూ ఉంటుంది. 

రెండూ వద్దనిపించే సంఘర్షణ:-

ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టు ఉంటుంది కొందరి పరిస్థితి. కానీ ముందుకో, వెనక్కో తప్పకుండా అడుగు వెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ  వ్యక్తికి మాత్రం రెండు దారులూ ఇష్టం ఉండవు. ముందు వెళ్లడమూ నచ్చదు, వెనక్కు రావడమూ నచ్చదు. ఇలాంటి సందర్భాలలో సంఘర్షణ ఏర్పడుతుంది. కొందరికి ఒకవైపు పెళ్లి వయసు దాటిపోతూ ఉంటుంది. మరొకవైపు ఉద్యోగం ఉండదు. రెండూ ఉండక మనిషి జీవితం స్తబ్దుగా ఉంటుంది. కానీ ఓ వయసు దాటాక ఉద్యోగం చేయడం మీద ఆసక్తి పోతుంది, అలాగే పెళ్లి అంటే ఆసక్తి పోతుంది. కానీ పెద్దల పోరు వల్ల రెండూ చేయాల్సి వస్తుంది. ఇలాంటి వ్యక్తి సంఘర్షణ మాటల్లో చెప్పలేనిది. కొందరు ఎక్కడికైనా దూరంగా పారిపోవాలి అనే ఆలోచన చేస్తుంటారు కూడా. 

ఇలా మనిషి తన జీవితంలో ఎన్నో సంఘర్షణలకు లోనవుతూ ఉంటాడు. 

                                     ◆నిశ్శబ్ద.

Advertising
Advertising