ఆ ఓటమి ఓ పీడకల.. కపిల్ దేవ్
posted on Aug 26, 2022 7:29AM
దేశంలో క్రికెట్ ఒక మతం.. సినిమా స్టార్లు, రాజకీయ నాయకులకు ఉన్న పాపులారిటీ కంటే.. మ్యాచ్ లో ఓ సెంచరీ చేసిన ఆటగాడికి రాత్రికి రాత్రి వచ్చేసే పాపులారిటీ అంత కంటే ఎక్కువ.1983లో ఇంగ్లాండ్ లో జరిగిన ప్రుడెన్షియల్ వరల్డ్ కప్ ఫైనల్ లో అంతకు ముందు వరుసగా రెండు సార్లు వరల్డ్ చాంపియన్ గా నిలిచిన విండీస్ ను మట్టి కరిపించిన కపిల్ డెవిల్స్(భారత జట్టు) దేశంలో క్రికెట్ కు ఆదరణ పెంచేసింది.
ఒక్క సారిగా దేశంలో క్రికెట్ మానియా పెరిగిపోయింది. ఆ తరువాత నుంచి ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ ఇండియానే గెలవాలి అని అభిమానులు ఆశించారు. అందుకు విరుద్ధంగా జరిగితే ఆగ్రహంతో రగిలిపోయేవారు. ఆటగాళ్ల ఇళ్లపై దాడులకు దిగిన సంఘటనలూ ఉన్నాయి. అయితే ఇవ్వన్నీ ఒకెత్తు.. దాయాది దేశం పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ ఒకెత్తులా మారిపోయింది. భారత్ - పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే రెండు జట్ల మధ్య మ్యాచ్ లా కాకుండా రెండు దేశాల మధ్య యుద్ధం అంత టెన్షన్ ఇరు దేశాల్లోనూ నెలకొని ఉంటుంది. ఆటగాళ్లలోనూ ఒక విధమైన తెలియని ఉద్వేగం నిండి ఉంటుంది.
ఇరు దేశాల మధ్యా సంబంధాల కారణంగా గత కొన్నేళ్ల నుంచీ ఇరు దేశాల మధ్యా సిరీస్ లు జరగడంలేదు. కానీ ఆసియాకప్, వరల్డ్ కప్ టోర్నమెంట్లలో మాత్రం ఇరు జట్లూ తలపడే అవకాశం మాత్రం లభిస్తోంది. ఇంగ్లాండ్- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ‘యాషెస్’ సిరీస్ ను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా తిలకిస్తారు. ఆ సిరీస్ ఏదో ఇరు దేశాల ప్రతిష్టకూ సంబంధించిన అంశంగా పరిగణిస్తారు. అలాగే ఇరు జట్లూ కూడా యాషెస్ గెలవడం కోసం సర్వశక్తులూ ఒడ్డి ఆడతాయి. అయితే భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే యాషస్ ను మించిన ఉత్కంఠ ఉంటుంది. యాషస్ సీరీస్ ను మించిన ఆసక్తి ఉంటుంది.
ఇప్పుడు వరల్డ్ కప్ ముంగిట 1986 ఆసియాకప్ ఫైనల్ లో భారత్- పాకిస్థాన్ తలపడిన మ్యాచ్ గురించి గుర్తు చేసుకోవడం అప్రస్తుతం ఎంతమాత్రం కాదు. చివరి బంతి వరకూ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ గురించి అప్పటి భారత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ అదో పీడకల అన్నాడు. అసలింతకీ 1986లో ఆషియా కప్ ఫైనల్ మ్యాచ్ గురించి అప్పటి ఇండియన్ కెప్టెన్ కపిల్ దేవ్ ఏమన్నాడంటే.. గెలిచేశామనుకున్న మ్యాచ్ లో చివరి బంతికి పరాజయం పాలయ్యాం. అది నిజంగా నమ్మలేని సంఘటన. ఆ మ్యాచ్ గురించి తలుచుకుంటే నిద్ర పట్టదు. ఇప్పటి దాకా అలాంటి నిద్ర లేని రాత్రులెన్నో గడిపాను అంటాడు.
ఇంతకీ ఆ మ్యాచ్ లో ఏం జరిగిందంటే.. పాకిస్థాన్ గెలవాలంటే చివరి బంతికి నాలుగు చేయాలి. క్రిజ్ లో మియాందాద్ ఉన్నాడు. బౌలర్ చేతన్ శర్మ. చివరి బంతికి నాలుగు పరుగులు అంటే ఒక్క బౌండరీ చాలు. ఆ బౌండరీ ఇవ్వకూడదన్న పట్లుదలతో భారత జట్టు ఫీల్డింగ్ ను మోహరించింది. అయితే చివరి బంతికి సిక్సర్ కొట్టి మియాందాద్ భారత్ చేతుల్లోంచి మ్యాచ్ ను ఎగరేసుకు వెళ్లిపోయాడు. భారత జట్టులో నిరాశ, బాధ.. పాక్ శిబిరంలో సంబరాలు. చివరి బంతికి ఓటమిని కెప్టెన్ కపిల్ దేవ్, జట్టు సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. కపిల్ అయితే చాలా ఏళ్ల వరకూ ఆ ఓటమి ఓ పీడకలలా వెంటాడిందని చెబుతాడు.