బాబు భద్రతకు ముప్పు?.. సెక్యూరిటీ పెంచాలని ఎన్ఎస్జీ నిర్ణయం!
posted on Aug 26, 2022 1:17AM
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం అలాగే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ) డీఐసీ భద్రతా ఏర్పాట్లు సమీక్షించం, పర్యవేక్షించడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశంలో జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న అతి కొద్ది మందిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఒకరు. అటువంటి వ్యక్తి భద్రతకు ముప్పు పొంచి ఉందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. తాజాగా గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం, ఆయన నివాసంలో ఎన్ఎస్జీ డీఐజీ సమర్దీప్ సింగ్ స్వయంగా పరిశీలించడం. భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించి తగు సూచనలు చేయడంతో ఏం జరిగిందన్న ఆందోళన తెలుగుదేశం శ్రేణుల్లోనే కాకుండా సామాన్యులలో కూడా నెలకొంది. ఈ హఠాత్ తనిఖీలు, సమీక్షల వెనుక చంద్రబాబుకు ముప్పు ఉందన్న కేంద్ర ఇంటెలిజెన్స్ ఇన్ పుట్ లే కారణమని భావిస్తున్నారు. ఏపీలో ఆయన భద్రతకు సంబంధించిన పలు అనుమానాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వ్యక్తమౌతున్నాయి.
తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి, ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలోకి చొచ్చుకు పోవడానికి ప్రయత్నం వంటి సంఘటనల నేపథ్యంలో ఆయన భద్రతపై ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి కూడా ఇన్ పుట్స్ రావడంతో ఆయన భద్రత విషయంలో ఎన్ఎస్జా అప్రమత్తమైంది. చంద్రబాబు భద్రతపై రివ్యూ చేయాలని నిర్ణయించుకుంది. దేశ వ్యాప్తంగాద ఎన్ఎస్జీ భద్రత ఉన్నది కేవలం నలభై మందికి మాత్రమే. వారిలో చంద్రబాబు కూడా ఒకరు. ఈ మేరకు ఎన్ఎస్జీ డీఐజీ నేతృత్వంలోని ప్రత్యేక బృందం తేలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం పరిశీలించారు. భద్రతా పరంగా కొన్ని లోటుపాట్లను గుర్తించారు. ఆయనకు భద్రతను మరింత పెంచాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు. రాష్ట్రప్రభుత్వం తరఫున చంద్రబాబుకు లభిస్తున్న భద్రతా ఏర్పాట్ల పట్ల ఎన్ఎస్జీ బృందం ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. వాస్తవానికి చంద్రబాబు పర్యటనలలో ఉన్న సమయంలో రాష్ట్ర పోలీసు విభాగం భద్రతా4 ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.
జడ్ ప్లస్ భద్రత ఉన్న వారికి చేయాల్సిన భద్రతా ఏర్పాట్లు, భద్రతా చర్యలు ప్రత్యేకంగా ఉంటాయి. అయితే ఏపీ పోలీసులు అటువంటి ప్రత్యేక ఏర్పాట్ల గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఇటీవలి కాలంలో వెల్లువెత్తుతున్నాయి. ఆయన పర్యటనలలో ఉన్న సమయంలో అధికార పక్ష కార్యకర్తలు ఆయనపై దాడులకు సైతం సిద్ధపడుతున్నా భద్రతా ఏర్పాట్ల విషయంలో రాష్ట్ర పోలీసు శాఖ నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నదని తెలుగుదేశం శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు ఎన్ఎస్జీకి తెలుగుదేశం నాయకులు ఫిర్యాదు కూడా చేశారు.
తాజాగా చంద్రబాబు కుప్పం పర్యటనలో జరిగిన సంఘటనలు ఏపీ పోలీసుల తీరు ఎంత దారుణంగా ఉన్నదో తేటతెల్లం చేశాయి. చంద్రబాబు ప్రారంభోత్సవం చేయాల్సిన అన్న క్యాంటిన్ ను ధ్వంసం చేయడం, ఆయన పర్యటనను అడ్డుకోవడానికి పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు ఆయన సమీపంలోనికి దూసుకు వెళ్లడం వంటి ఘటనలు ఆందోళన రేకెత్తించాయి. ఈ నేపథ్యంలోనే ఎన్ఎస్జీ ప్రత్యేక బృందం చంద్రబాబు సెక్యూరిటీపై సమీక్ష చేసింది. స్వయంగా పరిశీలించి భద్రతను పెంచాలని నిర్ణయించింది.