బిల్కిస్ బానో కేసు.. దోషులకు రెమిషన్ కు నిరసనగా గ్రామం ఖాళీ
posted on Aug 26, 2022 @ 10:19AM
దేశ మంతా బిల్కిస్ బానోపై అత్యాచారానికి పాల్పడిన దోషులను విడుదల చేయడాన్ని నిరసిస్తుంటే.. గుజరాత్ ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్టైనా అనిపించడం లేదు. నిరసనలను, వ్యతిరేకతను ఇసుమంతైనా లెక్క చేయడం లేదు
పైపెచ్చు దోషులకు సన్మానాలు సత్కారాలు జరుగుతున్నా కూడా కిమ్మనడం లేదు. బిల్కిస్ బానో అత్యాచార కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ కింద విడుదల చేయడం పట్ల దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి విదితమే. ఇప్పుడు తాజాగా దోషుల విడుదలకు నిరసనగా రంధిక్ పూర్ గ్రామాన్ని ముస్లింలు ఖాళీ చేసి వెళ్లిపోయారు.
బిల్కిస్ బానోపై అత్యాచారానికి పాల్పడిన దోషులను తిరిగి జైలుకు పంపే వరకూ తిరిగి గ్రామంలోకి అడుగుపెట్టేది లేదని వారు ప్రతిజ్ణ పూనారు. గ్రామాన్ని విడిచిన ముస్లింలంతా దేవగఢ్ బరియాకు వలస వెళ్లారు. దోషులను తిరిగి జైలుకు పంపడం తాము గ్రామంలోకి తిరిగి వచ్చేందుకు పోలీసు రక్షణ కల్పించాలని వారు గుజరాత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో, ఆమె కుటుంబ సభ్యులు ఇప్పుడు దేవగఢ్ బరియా గ్రామంలోనే నివసిస్తున్నారు.
రంధిక్‌పూర్ గ్రామానికి చెందిన వాహన వ్యాపారి సమీర్ గచ్చి కూడా తన 12 మంది కుటుంబ సభ్యులతో గ్రామాన్ని విడిచిపెట్టి దేవగఢ్ బరియాలోని తన బంధువుల ఇంటికి వెళ్లిపోయాడు. సమీర్ మాట్లాడుతూ.. తమకు తొలుత ఆ 11 మంది రేపిస్టులు, హంతకులు జైలు నుంచి విడుదలయ్యారన్న విషయం తెలియదన్నారు. వారు గ్రామానికి చేరుకున్నాక బాణాసంచా కాల్చి, సంగీత్‌తో సంబరాలు చేసుకున్నారనీ అప్పుడే ప్రభుత్వం వారిని విడుదల చేసందన్న సంగతి తెలిసిందన్నారు. ఆ వెంటనే తాము గ్రామం విడిచి పెట్టి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు తాము కలెక్టర్ కు లేఖ కూడా రాసినట్లు తెలిపారు. గ్రామానికి చెందిన 55 మంది సంతకాలతో కూడిన ఆ లేఖలో బిల్కిస్ బానోకు న్యాయం చేయాలని, ఆమెపై అత్యాచారానికి పాల్పడిన 11 మందినీ తిరిగి జైలుకు పంపాలనీ కోరినట్లు తెలిపారు. ఆ 11 మందినీ తిరిగి జైలుకు పంపే వరకూ తాము గ్రామంలో అడుగుపెట్టేది లేదని ఆ లేఖలో పేర్కొన్నారు.