Read more!

తెలంగాణలో తెలుగుదేశం సైలెంట్ వేవ్!

తెలంగాణ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. రాష్ట్రంలో ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్  ఎలాగైనా రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, బీజేపీలు వేటికవి వాటి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాయి. తెరాస పేరు మార్చి బీఆర్ఎస్ అంటూ జాతీయ పార్టీగా మారిన తరువాత.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలకు విఘ్నాలు ఎదురౌతున్నాయని పరిశీలకులు అంటున్నారు.  ముఖ్యంగా గత ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉండటంతో సహజంగానే అధికార పార్టీగా యాంటీ ఇన్ కంబెన్సీని ఎదుర్కొంటున్నది. రెండు ఉప ఎన్నికలలో విజయం సాధించి బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా దూకుడుగా సాగుతోంది. ఇక టీపీసీసీ చీఫ్ గా రేవంత్ బాధ్యతలు చేపట్టిన తరువాత కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం పెరిగిందని పరిశీలకులు అంటున్నారు. అధికారమే లక్ష్యంగా ఈ మూడు పార్టీలూ దూకుడుగా సాగుతుంటే..  చాపకింద నీరులా తెలుగుదేశం పార్టీ బలం పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రం విడిపోయిన తరువాత తెలుగుదేశం పార్టీ తెలంగాణలో నామమాత్రంగా మారిపోయింది.    2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున తెలంగాణలో గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ తర్వాత   టీఆర్ఎస్( ఇప్పుడు బీఆర్ఎస్) పంచన చేరిపోయారు. దీంతో తెలంగాణ అసెంబ్లీలో  తెలుగుదేశం కు  ప్రాతినిథ్యం లేకుండా పోయింది.   
అలాంటి వేళ.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు పార్టీ అధినేత చంద్రబాబు కంకణం కట్టుకున్నారు.  తెరాస బీఆర్ఎస్ గా మారిన తరువాత ఆ పార్టీ బలహీనపడుతోందన్న అంచనాలున్నారు. ఈ నేపథ్యంలోనే  తెలుగుదేశం తెలంగాణలో తన సత్తా చాటేందుకు పావులు కదపుతోంది.  ఈ నేపథ్యంలోనే ఈ నెల  29న తెలుగుదేశం పార్టీ ఆవిర్బావ దినోత్సవాన్ని హైదరాబాద్ లోని  నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించాలని నిర్ణయించింది.

1982, మార్చి 29న హైదరాబాద్‌లో తెలుగుదేశం పార్టీని విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు స్థాపించిన సంగతి అందరికీ తెలిసిందే. పార్టీని స్థాపించిన జస్ట్ 9 నెలలకే ఆయన అధికారం చేపట్టి తెలుగువాడిలోని వాడి వేడిని రుచి చూపించిన విషయం విదితమే.  అలా ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా.. తనదైన శైలిలో పాలన సాగించడమే కాకుండా.. పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను సైతం తీసుకు వచ్చారు. ఆ తర్వాత పార్టీ పగ్గాలు.. చంద్రబాబు చేతిలోకి వెళ్లడం.. ఆ క్రమంలో హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు దీటుగా సైబరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడం జరిగింది.

సరే రాష్ట్ర విభజన తరువాత తెలుగుదేశం తెలంగాణలో ప్రాభవం కోల్పోయింది. నాయకులు లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది తప్ప కార్యకర్తలంతా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారని పరిశీలకలు చెబుతూ వస్తున్నారు. ఇది వాస్తవమేనని   గతేడాది డిసెంబర్ మొదటి వారంలో ఖమ్మం వేదికగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సారథ్యంలో నిర్వహించిన శంఖారావ సభ.. సూపర్ డూపర్ సక్సెస్ నిరూపించింది. దీంతో తెలంగాణ ప్రజల గుండెల్లో తెలుగు దేశం పార్టీ చిరస్థాయిగా భద్రంగా ఉందని స్పష్టం కావడం అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎక్కడ ఉందంటూ ప్రశ్నించిన వారి నోళ్లు మూయించినట్లు అయింది.  

మరోవైపు ఈ ఏడాది జరగనున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభ.. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో జరగనుందంటూ .. ఓ చర్చ అయితే గట్టిగానే ఊపందుకొంది. కానీ చివరకు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సభకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలి రానున్నాయని సమాచారం. 

ఇక టీఆర్ఎస్ పార్టీ కాస్తా ఇటీవల బీఆర్ఎస్‌గా రూపాంతరం చెందింది. అలాగే కేంద్రంలోని బీజేపీ పాలనపై కూడా రాష్ట్రంలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. సరిగ్గా ఈ సమయంలో  ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ తీసుకు వచ్చిన పలు సంక్షేమ పథకాలు, రాష్ట్రాభివృద్ధి, శాంతి భద్రతలు, రాష్ట్ర ఆర్ధికాభివృద్ధి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో చోటు చేసుకోన్న అభివృద్ధి పరిణామాలను ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ద్వారా ఇప్పటికే ప్రజల్లోకి టీడీపీ శ్రేణులు చాలా బలంగా తీసుకు వెళ్తున్నాయి. అలాగే   పార్టీ ఆవిర్భావ సభ ద్వారా.. ప్రజలను మరింత చైతన్యం చేయగలిగితే.. ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని ఘనంగా చాటడం తథ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఏది ఏమైనా తెలంగాణలో తెలుగుదేశం సైలెంట్ వేవ్ ఉందన్న అభిప్రాయమే పొలిటికల్ సర్కిల్స్ లో సర్క్యులేట్ అవుతోంది.