Read more!

ఒక్క ఫలితం.. అనేక పరాభవాలు

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీని ఖతం చేయాలనుకున్న వైసీపీ ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. తీవ్ర పరాభవాన్ని మిగిల్చాయి. తెలుగుదేశం పార్టీకి వాస్తవంగా ఉన్న సంఖ్యాబలం ప్రకారం ఒక ఎమ్మెల్సీ స్థానం ఆ పార్టీకే దక్కాని. కానీ టీడీపీకి దూరం జరిగి వైసీపీతో జట్టుకట్టిన నలుగురు ఎమ్మెల్యేల బలం చూసుకుని వైసీపీ తెలుగుదేశం పార్టీకి ఆ స్థానం దక్కకుండా చేయాలని చేసిన ప్రయత్నం వికటించింది. సొంత పార్టీ నుంచే క్రాస్ ఓటింగ్ జరుగుతుందని కనీసం ఊహామాత్రంగానైనా అనుకోలేదు.

చివరికి వచ్చే సరికి సొంత పార్టీ వారే ఎదురు తిరుగుతారన్న అనుమానం ఆ పార్టీని వణికించింది. దీంతో క్యాంపు ఏర్పాటు చేసింది. అనుమానం ఉన్న సొంత పార్టీ ఎమ్మెల్యేలను బుజ్జగించింది. బతిమలాడుకుంది. నిఘా పెట్టింది. ఎన్ని చేసినా చివరకు తమ పార్టీ ఎమ్మెల్యేల మీద తనకు ఏ మాత్రం నియంత్రణ లేదన్న విషయాన్ని జగన్ కు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు తేటతెల్లం చేశాయి. అలా కాకుండా వైసీపీ టీడీపీకి ఉన్న సంఖ్యా బలం ప్రకారం ఒక స్థానం ఆ పార్టీ గెలుచుకుంటుందని వదిలేసి ఉంటే కొద్దో గొప్పో గౌరవం అయినా నిలబడి ఉండేది.  అలా కాకుండా అహంకారానికి పోయి అప్రతిష్ఠ మూటగట్టుకోవడమే కాదు.. సొంత పార్టీలో ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేయడానికి భయపడే పరిస్థితుల్లో లేరని తనకు తాను చాటుకున్నట్లైంది. కుప్పం స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం పరాజయం తరువాత అసెంబ్లీ వేదికగా చంద్రబాబు ముఖం చూడాలని ఉందంటూ సీఎం జగన్ అహంకారంతో చేసిన వ్యాఖ్యల తరువాత తెలుగుదేశం నుంచి అటువంటి వ్యాఖ్యలే వస్తాయనడంలో సందేహం లేదు.

ఇక విషయానికి వస్తే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనూరాథ ఏ విధంగా చూసినా విజయం సాధించే అవకాశాలు లేవమాత్రంగా కూడా లేవన్నది అంకెలు చెబుతున్నాయి. ఎందుకంటే ఆ పార్టీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో నలుగురు వైసీపీ శిబిరంలో ఉన్నారు. దీంతో తెలుగుదేశం బలం 19కి పడిపోయింది. ఎమ్మెల్సీ గెలవాలంటే కనీసం 22 మంది మద్దతు ఉండాలి. పోనీ వైసీపీలో ఇద్దరు పార్టీతో విభేదించి ఆత్మప్రబోధానుసారం ఓటు వేస్తామని ప్రకటించారు కనుక వారిరువురూ తెలుగుదేశం అభ్యర్థికి ఓటు వేసిన తెలుగుదేశంకు వచ్చే ఓట్లు 21 మాత్రమే. అంటే ఎలా చూసినా పంచుమర్తి అనూరాథ పరాజయం పాలవ్వక తప్పదు. ఇదీ వైసీపీ లెక్క. మరి తెలుగుదేశం ఎందుకు గెలచింది. పంచుమర్తి అనూరాధకు 23 ఓట్లు ఎలా వచ్చాయి? అధికార పార్టీ నుంచే క్రాస్ ఓటింగ్ జరిగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా వైసీపీకి పరాభవమే ఎదురైంది. ఎన్నికలు జరిగిన మూడు స్థానాలలోనూ తెలుగుదేశం విజయఢంకా మోగించింది.  అందులోనూ వైసీపీకి పెట్టని కోటగా భావించే రాయలసీమలోనూ పరాజయ పరాభవమే జగన్ కు ఎదురైంది.  

ఇక పులివెందుల విషయానికి వస్తే అక్కడ వైఎస్ ఫ్యామిలీ తప్ప,  ఎవరూ సాధించని అమోఘ ఫలితాన్ని టీడీపీ అభ్యర్ధి రాజగోపాల్‌రెడ్డి సాధించారు. ఆ దెబ్బకు వైసీపీ అధినేత దిమ్మతిరిగి ఉంటుంది. ఆ పరాభవం నుంచి తేరుకోకముందే..   ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మైండ్ బ్లాక్ అయ్యే దెబ్బ తగిలింది. ఈ వరుస ఎదురుదెబ్బల వెనుక ఉన్న అసలు కారణమేమిటన్నది అందరికీ ఇప్పటికే అర్ధమైంది. ఇక అర్ధం కావాల్సిందల్లా అధికార పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ రెడ్డికే.  ఔను  గ్రాడ్యుయేట్ ఎన్నికలు గానీ, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు గానీ అన్నిటిలోనూ జయాపజయాలకు బాధ్యుడు ఒకే ఒక్కడు . ఆ ఒక్కడూ జగన్ రెడ్డే. ఆయన ఎవరి సలహాలు కానీ, సూచనలు కానీ పట్టించుకునే వ్యక్తి కాదు. ఆయన నిర్ణయమే ఫైనల్. ఆయన వద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇలా ఎవరికీ కనీస గౌరవం దక్కదు. మర్యాద ఉండదు.

ఈ విషయాన్ని తనపై సస్పెన్షన్ వేటు పడిన తరువాత ఎమ్మెల్యే మేకపాటి స్వయంగా చెప్పారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా చిన్న విషయమనీ, తనకు అందిన సమాచారం మేరకు కనీసం 50 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారనీ, ఏ క్షణంలోనైనా వారు బయటపడే అవకాశం ఉందని ఆయన చెప్పారు.  ఇందుకు కారణం జగన్ ఎమ్మెల్యేలు, నాయకులతో పనిలేదన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరే కారణమని వివరించారు. పీకే సర్వేలు, వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది,  తాను బటన్ నొక్కడంతో ఖాతాలలో సొమ్ములు పడుతున్న లబ్ధిదారులు చాలన్నది జగన్ భావనగా మేకపాటి అభివర్ణించారు.  

జగన్ తీరు కారణంగానే తమతమ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు పూచికపుల్ల గౌరవం కూడా దక్కడం లేదు. అధికారులు మాట వినడం లేదు.  ఈ కారణంగానే ఆత్మాభిమానం ఉన్న ఎమ్మెల్యేలెవరూ మరో సారి జగన్ వెంట నడవడానికి ఇష్టపడరన్నది మేకపాటి మాటల సారాంశంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసిన వారు సైతం, సీఎంఓలో అధికారుల అపాయింట్‌మెంట్ల కోసం గంటలు ఎదురుచూడాల్సిందే. ఈ విషయాన్ని మేకపాటి తనకు ఎదురైన అనుభవాలను చెప్పడం ద్వారా తేటతెల్లం చేశారు. సీఎంను కలవడం కోసం తనలాంటి సీనియర్లు వెళ్లినా పలకరించే నాథుడు ఉండడని మేకపాటి చెప్పారు.  ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి వంటి సీనియర్లు దూరం కావడానికీ అదే కారణం.  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పరాభవం కంటే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో పరాభవ భారం ప్రభావం పార్టీ భవిష్యత్ లోనూ వెంటాడుతూనే ఉంటుంది. ఇకపై జగన్ నిర్ణయాలను పార్టీ గతంలోలా తలూపేసి ఓకే చెప్పేసే పరిస్థితి ఉండదన్నది పరిశీలకుల విశ్లేషణ.