Read more!

జాతీయ రాజకీయాలలో మళ్లీ కేసీఆర్ క్రీయాశీలం?

రాహుల్ గాంధీపై అనర్హత వేటును కేసీఆర్ తన జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు ఒక అవకాశంగా భావిస్తున్నారా అంటే ఔననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇప్పటి వరకూ కాంగ్రెస్సేతర , బీజేపీయేతర కూటమి, ఫ్రంట్ అంటూ కాలికి బలపం కట్టుకు తిరిగినా జాతీయ స్థాయిలో కేసీఆర్ మార్క్ రాజకీయాలకు పెద్దగా స్పందన రాలేదు. దీంతో ఆయనే సొంత కుంపటి పెట్టుకుని తన వంతు ప్రయత్నాలు తాను సాగిస్తున్నా.. ఆ ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతున్నాయి.

ఒక్క ఆంధ్రప్రదేశ్ లో తప్ప మరే రాష్ట్రంలోనూ చివరాఖరికి తెలంగాణలో కూడా బీఆర్ఎస్ కమిటీలు ఏర్పాటైన దాఖలాలు లేవు. ఈ లోగానే ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితపై ఆరోపణలు, విచారణలు, టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ వ్యవహారంలో విద్యార్థి, నిరుద్యోగులలో కేసీఆర్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం నిరసనల రూపంలో వ్యక్తం అవుతుండటంతో ఆయన జాతీయ అడుగులకు విరామం తప్పదా అన్న అనుమానాలు రేకెత్తాయి. అందుకు తగ్గట్టుగానే కవితను ఈడీ విచారణ నేపథ్యంలో ఆయన తెలంగాణ సెంటిమెంటును మళ్లీ తెరపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించడంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు  కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషణలు సైతం చేశారు.

సరిగ్గా ఇదే సమయంలో క్రిమినల్ డిఫమేషన్ కేసులో రాహుల్ కు గుజరాత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడం, దాంతో పార్లమెంటు ఆయనపై అనర్హత వేటు వేయడంతో కేసీఆర్ మరోసారి జాతీయ స్థాయిలో తన గళం బలంగా వినిపించేందుకు నడుం బిగించారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు వ్యతిరేకంగా జరిగే ఆందోళనకు మద్దతుగా నిలవడానికి రెడీ అయిపోయారు. అంతే కాదు ఆ ఆందోళనలో క్రీయాశీలంగా వ్యవహరించాలని కూడా నిర్ణయించారు. పలు ప్రాతీయ పార్టీల నాయకులతో ఇప్పటికే మంతనాలు ప్రారంభించారని కూడా చెబుతున్నారు. రాహుల్ గాంధీకి సంఘీభావం ప్రకటించేందుకు ఆయన స్వయంగా ఢిల్లీ వెళ్లాలని కూడా భావిస్తున్నట్లు బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి.

 రాహుల్ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్ సభ గెజిట్ విడుదల చేసిన వెంటనే సీఎం కేసీఆర్ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రకటన విడుదల చేశారు.  రాహుల్ సభ్యత్వం రద్దుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టనున్న దేశ వ్యాప్త ఆందోళనకు కేసీఆర్ మద్దతు ప్రకటించాలని కేసీఆర్ నిర్ణయించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ఈ విషయంలో ఆయన తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్,  జేడీయూ అధినేత నితీష్ కుమార్, తమిళనాడు సీఎంస్టాలిన్ తో సంప్రదింపులు జరుపుతున్నారని కూడా   చెబుతున్నాయి.