యాదాద్రిలో 68 మందికి కరోనా! భువనగిరి జిల్లాలో కలవరం
posted on Mar 29, 2021 @ 11:23AM
తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కరోనా కలవరం రేపుతోంది. దేవాలయంలో పనిచేస్తున్న 68 మంది సిబ్బందకి కరోనా పాజిటివ్ అని తేలింది. దేవాలయంలో అర్చకులతో సహా ఆలయ ఉద్యోగులకు కరోనా సోకడంతో యాదగిరిగుట్ట గ్రామంలో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. యాదగిరిగుట్టలో కరోనా వైరస్ పరీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆలయసిబ్బందికి కరోనా సోకిందని తెలియడంతో భక్తులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. కరోనా కలకలంతో దేవాలయంలో నిత్నాన్నదాన విభాగాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఆర్జిత సేవలను రద్దు చేసి లఘు దర్శనాలను మాత్రమే కొనసాగిస్తామని యాదాద్రి ఆలయ అధికారులు చెప్పారు.
శుక్రవారం చేసిన పరీక్షల్లో మొదట ఆరుగురు సిబ్బందిలో కరోనా నిర్దారణ అయింది. దీంతో ఆలయ సిబ్బందికి మొత్తం పరీక్షలు చేశారు. అందులో శనివారం 30 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఆదివారం మరో 32 మందికి కరోనా నిర్దారణ అయింది. కరోనా సోకిన వారిలో ఆలయ సిబ్బందితో పాటు జర్నలిస్టులు కూడా ఉన్నారు. కరోనా కేసుల సంఖ్య మరింతగా పెరగవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. గత వారమే యాదాద్రి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఆలయ సిబ్బందికి వైరస్ సోకింది. దీంతో యాదాద్రి ఆలయంలో ఆర్జిత సేవలను నిలిపేయాలని నిర్ణయం తీసుకున్నారు. యాదాద్రిలో దైవదర్శనాలకు మాత్రమే భక్తులకు అనుమతించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాల్లో అధికారులు కరోనా నిబంధనలు పాటించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహోత్సవాల నిర్వహణ సమయంలో కరోనా నియమాలను ఏమాత్రం పాటించకపోవడం వల్లే ఆలయ సిబ్బందికి కరోనా సోకినట్లు విమర్శలు ఉన్నాయి. అలంకార సేవోత్సవాలు, స్వామి వారి విశేష వేడుకల్లో భౌతిక దూరం, మాస్క్‌లు ధరించకపోడం, శానిటైజేషన్ చేయకపోవడం కారణాలుగా తెలుస్తున్నాయి
తెలంగాణలో ఆదివారం కొత్తగా 403 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 146 మందికి కరోనా సోకింది.శనివారంతో పోల్టితే కేసులు సంఖ్య తగ్గినా... ఆదివారం టెస్టులు తక్కువగా చేయడం వల్లే కేసులు తక్కువగా వచ్చాయని వైద్యాధికారులు చెబుతున్నారు. ఆదివారం కేవలం 32 వేల టెస్టులు మాత్రమే నిర్వహించారు. తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,06,742 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,00,469 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,690గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 4,583 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,815 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు.