ఇచ్చిందెవరు? తెచ్చిందెవరు? తెరపై కొచ్చిన పాత పంచాయతీ!
posted on Aug 7, 2023 @ 1:40PM
తెలంగాణ శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ ఇచ్చింది ఎవరు? తెచ్చింది ఎవరు? అనే పాత పంచాయతీ మళ్ళీ మరో మారు తెరపై కొచ్చింది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి జన్మదిన (డిసెంబర్ 9) కానుక ఇచ్చేందుకు. రేపటి న్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మొదలు కాంగ్రెస్ నేతలు చేస్తున్న, ప్రచారానికి కౌంటర్ గా ముఖ్యమంత్రి కేసేఆర్ అసెంబ్లీ వేదిక నుంచి సమాధానం ఇచ్చారు. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ళ పాలనలో సాధించిన విజయాలను వివరించే క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్ర పుటల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిన అన్యాయాన్ని ఏకరవు పెట్టారు. దీంతో మరో మారు, తెలంగాణ ఇచ్చింది ఎవరు? తెచ్చింది ఎవరు అనే చర్చ తెరపైకి వచ్చింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసేఆర్ కాంగ్రెస్ పార్టీ పాత పాపాలను ఏకరవు పెట్టారు. తెలంగాణ ఎవరు ఇచ్చారు, ఎవరు తెచ్చారు అన్నది తర్వాత సంగతి. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? తెలంగాణ ఆకాంక్ష ఉవ్వెత్తున ఎగసిపడిన ప్రతి సందర్భంలో తెలంగాణ ప్రజలను వంచించి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాల ఫలితంగా సుమారు ఆరు దశాబ్దాలపాటు తెలంగాణ సర్వస్వం కోల్పోయింది. ఎన్నో కష్ట నష్టాలు చవిచూసింది. భయంకరమైన పరిస్థితులు ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలు, కరెంటు కోతలు, అనేకమైన బాధలు. తామే తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ.. ప్రజలపై ప్రేమతో రాష్ట్రాన్ని ఇవ్వలేదు. 2014లో అన్నిచోట్లా ఎదుగాలి ఎదుర్కొంటున్న పార్టీని బలోపేతం చేసుకునేందుకు అనివార్య పరిస్థితుల్లో మాత్రమే తెలంగాణ ఇచ్చిందని, కేసీఆర్ తేల్చి చెప్పారు.
ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్ పార్టీ, భారత తొలి ప్రధాని నెహ్రు కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, కొండ వెంకటరంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు ఆంధ్రాలో తెలంగాణ విలీనాన్ని గట్టిగా వ్యతిరేకించినా నెహ్రూ పట్టుపట్టి తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేశారని, అదే జరగకుంటే, తెలంగాణ సాధన కోసం సుదీర్ఘ పోరాటం చేయవలసి వచ్చేదే కాదని అన్నారు సో.. తెలంగాణ ప్రథమ ద్రోహి, కాంగ్రెస్ పార్టీ, భారత తొలి ప్రధాని నెహ్రూ ..అంటూ కాంగ్రెస్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ విరుచుకు పడ్డారు.
అలాగే మంత్రి కేటీఆర్ తెలంగాణ ఇచ్చింది తామే అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ వాదనను తిప్పి కొడుతూ బ్రిటిష్ పాలకులు దేశానికి తామే స్వాతంతం ఇచ్చామని చెప్పుకుంటే ఎట్లా ఉంటుందో, కాంగ్రెస్ వాదన అట్లా ఉందని ఎద్దేవా చేశారు. నిజానికి 1969, 1971 ఉద్యమాలలో వందల వేల మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకున్న కాంగ్రెస్ పార్టీ, 2014లో మరో గత్యంతరం లేకనే తెలంగాణ ఇచ్చిందని అన్నారు.
అంతే కాదు 2004 ఎన్నికల ప్రణాళికలో యూపీఎ ఉమ్మడి కార్యక్రమంలో, రాష్ట్ర పతి ప్రసంగంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరించి పుష్కర కాలం పైగా సాగదీయడం వల్లనే వందల సంఖ్యలో విద్యార్ధులు, నిరుద్యోగ యువకులు ఆత్మ బలిదానం చేసుకున్నారని ఇది కాంగ్రెస్ చేసిన పాపం కాదా అని ప్రశ్నించారు.దీంతో మరో మారు తెలంగాణ ఇచ్చింది ఎవరు? తెచ్చింది ఎవరు? అనే చర్చ తెరపైకి వచ్చింది.