36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం
posted on Dec 20, 2019 @ 2:03PM
తెలంగాణ ప్రభుత్వం, పోలీసులపై దిశా నిందితుల ఎన్కౌంటర్ ఘటన తరువాత మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దిశ కుటుంబానికి న్యాయం చేసారని అందరూ జై హో పోలీస్, జై హో సీఎం అంటూ జై జైలు కొట్టారు. మహిళల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. హైకోర్టు చొరవతో తెలంగాణ ప్రభుత్వం జెట్ స్పీడుతో దూసుకెళ్తొంది. అత్యాచారాలు, చిన్నారుల పై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసుల సత్వర విచారణ కోసం పెద్ద ఎత్తున ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 1 కాదు 2 కాదు రాష్ట్ర వ్యాప్తంగా 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోవటమేకాక ఉత్తర్వులు సైతం జారీ చేసింది. కరీంనగర్, ఖమ్మం జిల్లాలలో రెండేసి చొప్పున మిగతా జిల్లాల్లో ఒక్కో ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు సర్కారు ప్రకటించింది. జిల్లా అదనపు సెషన్స్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు 365 రోజులు పని చేస్తాయి. కింది కోర్టు పై కోర్టులు అన్న ఆలోచనే లేకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులోనే విచారణ జరిపి అక్కడే శిక్షలు ఖరారు చేయనున్నట్లు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జూలై 25 న సుమోటో విచారణ సందర్భంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలంటూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం ఆదేశాలతో ఆగస్టు 5 న అన్ని రాష్ట్రాల హైకోర్టులకు కేంద్ర న్యాయ శాఖ లేఖలు రాసింది. దాని ఆధారంగా ఈ నెల 5 న తెలంగాణ హై కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ అందులో సుప్రీం కోర్టు ఆదేశాలను వివరించింది. దీంతో తెలంగాణ సర్కార్ పెద్ద ఎత్తున ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తానికి వేగంగా విచారణ జరగాలంటూ ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ లను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని పై మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.