గులాబీ నేతల మధ్య కోల్డ్ వార్.. కారణం అదేనా?
posted on Dec 20, 2019 @ 1:32PM
తెలంగాణాలో కొందరు టీఆర్ఎస్ నేతల జోరు తగ్గినట్లు కనిపిస్తొంది. చిన్న విషయానికే మీడియా ముందు హల్ చల్ చేసే నాయకులు సైతం కనుమరుగైపోయారు. సీఎం కొదరు నేతలను పక్కన పెట్టారా లేక వారే దూరంగా ఉన్నారా అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువైన వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అడ్డాగా మారింది. టిడిపి, కాంగ్రెస్ కు కంచుకోట అయిన వరంగల్ ను తమ ఖాతాల్లో వేసుకున్నారు టీఆర్ఎస్ లీడర్లు. అయితే ఉద్యమ కాలం నుంచి కొనసాగుతూ కీలకమైన నేతలుగా ఉన్న చాలా మంది నేతలు ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక కనబడకుండా పోతున్నారనే విమర్శలు కూడా తలెత్తాయి. వివిధ పార్టీల నుంచి తమ పార్టీలో చేరిన నేతల కారణంగా పాతతరం వాళ్లు వెనక్కి నెట్టబడుతున్నారన్న భావన టీఆర్ఎస్ నేతల్లో ఉంది.
మొన్నటి సాధారణ ఎన్నికల ముందు కూడా జిల్లా గులాబీ వర్గంలో ఇలాంటి అసంతృప్తులు బయట పడ్డాయి. పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఉమ్మడి జిల్లా నుంచి ఎర్రబెల్లి దయాకరరావు ఒక్కరికే క్యాబినెట్ లో అవకాశం దక్కింది. జిల్లాలో ఆయనే అన్నీ తానై వ్యవహరించారు. ఆరు జిల్లాల పరిధిలో పార్టీ పరంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రెండో దఫా మంత్రి వర్గ విస్తరణలో గిరిజన ప్రాంతమైన మానుకోట నుంచి సత్యవతి రాథోడ్ కు అవకాశం దక్కింది. వరంగల్ సిటీ నుంచి ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కు ప్రభుత్వ చీఫ్ విప్ గా అవకాశం వచ్చింది. వరంగల్ అర్బన్ జిల్లాలకు చెందిన ఈటెల రాజేందర్ కూడా మంత్రిగా కొనసాగుతున్నారు. వీరి మధ్య కూడా ఆధిపత్య పోరు కొనసాగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
2014 తర్వాత పార్టీలోకి వచ్చి కీలకంగా మారిన నేతలు వారితో వచ్చిన వారికే ఎక్కువ అవకాశాలిస్తూ పాత వారిని నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన నేతల్లో ఉంది. ఉద్యమంలో పనిచేసి నష్టపోయామని అసంతృప్తి పాతతరం నేతల్లో కనిపిస్తోంది. మొన్నటి వరకు జిల్లాలో యాక్టివ్ రోల్ పోషించిన తక్కళ్లపల్లి రవీందర్ రావు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. పాలకుర్తి నుంచి ఎమ్మెల్యే టికెట్, రెండుమూడుసార్లు ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నించినా దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న హైదరాబాదుకే పరిమితమయ్యారు తక్కళ్లపల్లి. మరోవైపు మొదటి నుంచి ఉన్న వాళ్లకు సరైన ప్రాధాన్యం కల్పించాలని ఆ పార్టీ సీనియర్ నేత రాజయ్య మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సమక్షంలో చెప్పడం చర్చకు దారి తీసింది. పార్టీ నేతల్లో అసంతృప్తి ఇప్పటికిప్పుడు బయటపడకుండా పాత కొత్త తరం నేతల మధ్య కోల్డ్ వార్ మాత్రం పార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది.ఈ నేతల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ని తెలంగాణా సీఎం ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.