ఏపీ ఆర్ధిక పరిస్థితిని ఆర్ధిక సంఘం దృష్టికి తీసుకొచ్చిన జగన్
posted on Dec 20, 2019 @ 2:56PM
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 15 వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్ కె సింగ్ తో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు తగిన రీతిలో సహాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విభజన వల్ల రాజధానిని కోల్పోయిన రాష్ట్రం ఏపీనే అన్న సీఎం జగన్ అన్ని రంగాల్లో కోలుకోవాలంటే ఉదార రీతిలో సహాయం చేయాలని కోరారు. విభజన హామీల అమలుకు కేంద్రంలో యంత్రాంగం ఉండేలా చూడాలని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిస్థితులపై అధికారులు నివేదికలిచ్చారు. విభజన వల్ల రాజధానిని కోల్పోవడంతో పాటు పారిశ్రామిక సేవా రంగాల వాటా బాగా తగ్గిపోయాయని తలసరి ఆదాయంలో చూస్తే కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ తర్వాత ఏపీనే వెనకబడి ఉంది.
షెడ్యూల్ 9 లో ఉన్న సంస్ధల ఆస్తుల విభజన ఇంకా జరగనేలేదు, షెడ్యూల్ 10 లో 152 ఆస్తులు ఉంటే తెలంగాణకు 107 కాగా ఏపీకి 15 ను మాత్రమే వచ్చాయి. ఇంకా 20 ఆస్తులు తెలంగాణ ఆంధ్రా చేతుల్లో ఉమ్మడిగా ఉన్నాయి. ఏపీ భవన్ విభజన కూడా ఇంకా జరగలేదు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఇక్రిశాట్ లాంటి ప్రఖ్యాత సంస్థలన్నీ హైదరాబాద్ లోనే ఉండి పోయాయి. బీహెచ్ఇఎల్, ఈసీఐఎల్, హెచ్ఏఎల్ లాంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తెలంగాణలో ఉండిపోయాయి. దీని వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గు ముఖం పట్టాయని ఆయన వివరించారు. రాష్ట్రాన్ని పునః నిర్మించాల్సిన అవసరం ఉంది కాబట్టి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం సిఫారసు చేయాలని సీఎం కోరారు. రెవిన్యూలోటు భర్తీ కింద 19,969.26 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 3,979 కోట్లు మాత్రమే వచ్చాయి. వెనకబడిన జిల్లాలకు 24,350 కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 1,050 కోట్లు మాత్రమే వచ్చాయని సీఎం జగన్ ఆర్ధిక సంఘం దృష్టికి తీసుకువెళ్లారు.