ఉలిపికట్టెలా తెలంగాణ సర్కార్.. రిపబ్లిక్ డే ఉత్సవాల నిర్వహణకు దూరం
posted on Jan 25, 2023 6:36AM
ఊరంతా ఒక దారి అయితే ఉలిపికట్టెది మరో దారి అన్నట్లుగా ఉంది తెలంగాణ ప్రభుత్వ వైఖరి. దేశమంతా ఘనంగా గణతంత్ర దినోత్సవాలు నిర్వహించుకోవడానికి అన్ని ఏర్పాట్లూ చేసేశాయి. అయితే తెలంగాణ ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి కదలికా లేదు. సంప్రదాయం ప్రకారం ఈసారి పబ్లిక్ గార్డెన్‌లో ఉత్సవాన్ని నిర్వహించాల్సి ఉన్నా ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు.
భారత రాజ్యాంగం ఆమోదం పొందిన రోజును దేశ వ్యాప్తంగా గణతంత్రదినోత్సవాన్ని వేడుకగా జరుపుకుంటాం. ఆగస్టు 15 వేడుకల్లో ఢిల్లీలో ప్రధాని, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. గణతంత్ర దినోత్సవం రోజు మాత్రం ఢిల్లీలో రాష్ట్రపతి, రాష్ట్రాల్లో గవర్నర్లు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. స్వాతంత్ర్య దినోత్సవాన్నీ, గణతంత్ర దినోత్సవాన్నీ ప్రభుత్వాలు ఘనంగా నిర్వహిస్తాయి. జాతి పండుగలుగా జనం భావిస్తారు.
ఒక్క తెలంగాణలో మాత్రం గణతంత్రి దినోత్సవం సందడి కనిపించడం లేదు. గత రెండేళ్లుగా ఇదే పరిస్థితి. దీనికి కారణం గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ జెండా ఎగరేసి.. ప్రసంగించాల్సి ఉండటమే. తమిళిసై గవర్నర్ గా వచ్చిన తొలి రెండేళ్లు పబ్లిక్ గార్డెన్స్ లో ఘనంగా రిపబ్లిక్ డే నిర్వహించారు. కేసీఆర్ హాజరయ్యారు. కానీ తర్వాత విభేదాలు వచ్చాయి. గత ఏడాది ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో రాజ్ భవన్ లోనే గవర్నర్ పతాకావిష్కణ చేశారు. ఈ ఏడాది కూడా ఇప్పటి వరకూ అంటే గణతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు వరకూ కూడా ఈ వేడుకలకు సంబంధించి రాజ్‌భవన్‌కు ప్రభుత్వం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
దీంతో రాజ్‌భవన్‌లోనే రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించనున్నట్లు గవర్నర్ ప్రకటించారు. రిబప్లిక్ డే సందర్భంగా గవర్నర్ ఉదయం జెండా ఆవిష్కరణ, సాయంత్రం ఎట్ హోమ్ నిర్వహిస్తారు. ఎట్ హోం కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి హాజరుపై ఎటువంటి సమాచారం లేదు. ప్రభుత్వ వైఖరిపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తన ఇష్టాయిష్టాలు, పంతాలు పట్టింపులకే ప్రాధాన్యత ఇస్తూ కేసీఆర్ ఒఖ నియంతలా వ్యవహరిస్తున్నారనీ, మళ్లీ హైదరాబద్ స్టేట్ చేద్దామనుకుంటున్నారని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
అయితే గవర్నర్ తో విభేదాల కారణంగా గణతంత్ర వేడుకలను పట్టించుకోకపోవడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదని అని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్వతంత్ర భారత సంప్రదాయాలకు తిలోదకాలిచ్చి.. హైదరాబాద్ స్టేట్ రోజులకు తిరోగమిస్తున్నట్లుగా కేసీఆర్ వైఖరి ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలలో కూడా అక్కడి ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు గవర్నర్ తో విభేదాలున్నా.. సంప్రదాయం ప్రకారం గణతంత్ర దినోత్సవాల ఏర్పాట్లు ఘనంగా చేశారనీ, ఆనవాయితీ ప్రకారం ఆయా రాష్ట్రాలలో గవర్నర్లే జెండా ఆవిష్కరించి ప్రసంగించనున్నారనీ గుర్తు చేస్తున్నారు.