కివీస్ పై మూడో వన్డేలోనూ టీమ్ ఇండియా విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్
posted on Jan 25, 2023 5:39AM
టీమ్ ఇండియా విజయాల యాత్ర కొనసాగుతోంది. వరుస సిరీస్ విజయాలతో భారత్ దూసుకుపోతోంది. ఇప్పటికే న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ను కైవసం చేసుకున్న భారత జట్టు.. తాజాగా మూడో వన్డేలోనూ విజయం సాధించి సరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది.
ఇండోర్ వేదికగా మంగళవారం (జనవరి 24) జరిగిన మూడో వన్డేలో టీమ్ ఇండియా 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ ఓపెనర్ కాన్వే (138) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. 386 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్..41.2 ఓవర్లలో 295 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ తలో 3 వికెట్లు పడగొట్టారు. యజువేంద్ర చాహల్ రెండు వికెట్లు తీశాడు. ఉమ్రాన్ మాలిక, హార్ధిక్ పాండ్యా చెరో వికెట్ తీశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 85 బంతుల్లో 101 , శుభ్ మన్ గిల్ 78 బంతుల్లో 112 సెంచరీలతో రెచ్చిపోయారు. రోహిత్ శర్మ ఇన్నింగ్స్ లో 6 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. గిల్ ఇన్నింగ్స్ లో 5 సిక్సులు, 13 ఫోర్లు ఉన్నాయి. ఇరువురూ కలిసి తొలి వికెట్ కు 212 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తరువాత హార్ధిక్ పాండ్యా 38 బంతుల్లో 54 పరుగులు చేశాడు. కోహ్లీ కూడా 36 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. ఈ విజయంతో టీమ్ ఇండియా ఇంగ్లాండ్ ను వెనక్కు నెట్టేసి వన్డేల్లో నంబర్ వన్ ర్యాంక్ కు ఎగబాకింది.