‘ఉచితం’ ఉచితమేనా?.. ఆన్నీ ఫ్రీ హామీలపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం
posted on Jul 27, 2022 7:32AM
దేశ భవిష్యత్, రాష్ట్రాల భవిష్యత్ ను పణంగా పెట్టి కేవలం అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా కొన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో ‘అన్నీ ఉచితం’ అంటూ గుప్పిస్తున్న హామీలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీలు ఇచ్చే ‘ఉచిత’ హామీలను అరికట్టే మార్గం లేదా అని ఎన్నికల సంఘాన్ని సూటిగా ప్రశ్నించింది. అందుకు ఎన్నికల సంఘం అది మా చేతిలో లేదని సమాధానం ఇవ్వడంతో కేంద్రాన్ని కౌంటర్ అఫిడవిట్ ధాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది.
వాస్తవానికి ‘ఉచిత’ హామీలు ఇవ్వడం ఒక విధంగా క్విడ్ ప్రోకో కిందకే వస్తుందని మేధావులు చాలా కాలంగా చెబుతూనే ఉన్నారు. మాకిది..మీకిది అన్నట్లుగా మాకు ఓటేస్తే.. మీకన్నీ ఉచితమే అనడం ఓటర్లను ప్రలోభ పెట్టడమే ఔతుందన్న మేధావుల మాటలను పార్టీలు పట్టించుకోవడం లేదు. ‘ఉచిత’ హామీలను నెరవేర్చడం కోసం జనంపై పన్నుల వడ్డింపులు, మద్యం విక్రయాల ఆదాయంపైనే ప్రభుత్వాలు ఆధారపడటం వంటి చర్యలతో సామాన్య జనం మనుగడను కష్టాల పాలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. అయినా సరే ఉచిత హామీలు అధికారానికి అడ్డదారిగా భావిస్తున్న పార్టీలు అవే హామీలను గుప్పిస్తూ అధికారానికి నిచ్చెనలు వేస్తున్నారు.
ఈ ఉచిత హామీలకు బ్రేక్ వేయాల్సిన అవసరం ఉందన్న చర్చ చాలా కాలంగా సాగుతూనే ఉంది. అన్నీ ఉచితం అంటూ ఖజనా ఖాళీ చేస్తూ దేశ భవిష్యత్ ను అంధకారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఉచిత హామీలు ఇచ్చే పార్టీల గుర్తింపు రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఉచిత హామీలు ఇచ్చే పార్టీల గుర్తింపు రద్దు వ్యవహారం తమ చేతుల్లో లేదని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చేసింది. ‘ఉచిత’ హామీలను విశ్వసించి ఓటేయడంలోని ఉచితానుచితాలను తెలుసుకోవలసింది ఓటర్లేనని బదులిచ్చింది.
దాంతో కేంద్రం అభిప్రాయాన్ని సుప్రీం కోరింది. ఉచిత పథకాలపై రాష్ట్రాలు వెచ్చించే మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఆయా రాష్ట్రాలకు రెవెన్యూ కేటాయింపులను నియంత్రించే అవకాశం ఉందా అని కూడా సుప్రీం కోర్టు ప్రశించింది. కాగా ఈ విషయంలో ఏం చేయాలన్న దానిపై సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అభిప్రాయాన్ని కోరింది. ఉచిత హామీలతో ఎన్నికలకు వెళ్లే పార్టీల గుర్తింపు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ వచ్చే నెల 3కు వాయిదా పడింది. ఇటీవల ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఉచితాలు అనుచితం వ్యాఖ్యానించిన నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు చెక్ పెట్టేలా ఆర్ధిక సంఘానికి సిఫారసు చేస్తే ఆల్ ఫ్రీ అంటూ అధికారానికి నిచ్చెనలు వేసే పార్టీలకు ఇక కాలం చెల్లినట్లే.