రేవంత్ కే కాంగ్రెస్ హై కమాండ్ మద్దతు.. కోమటి రెడ్డి ఎపిసోడ్ తో స్పష్టమైన సంకేతాలు!
posted on Aug 6, 2022 @ 11:17AM
తెలంగాణ కాంగ్రెస్ ఒక అడుగు ముందుకు వేస్తే రెండడుగులు వెనక్కు లాగుతున్న సీనియర్లను వదిలించుకోవాలనుకుంటోందా? తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ఆయన అడుగులన్నీ ఆ దారిలోనే ఉన్నాయా? అందుకు పార్టీ హై కమాండ్ పూర్తిగా మద్దతు ఇస్తోందా? అన్న ప్రశ్నలకు పరిశీలకుల నుంచి ఔననే సమాధానం వస్తోంది. అసలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి నిజమైన త్యాగం చేసినది కాంగ్రెస్ పార్టీయే అని పరిశీలకులు అంటున్నారు. రాష్ట్ర విభజనకు సై అంటే ఏపీలో పార్టీ ఉనికి కూడా ఉండదన్న హెచ్చరికలను పెడచెవిన పెట్టి మరీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఐదేళ్ల ఆకాంక్షను నెరవేర్చారని ఇంత కాలం పార్టీ శ్రేణులు, నేతలూ చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఆ త్యాగానికి ఫలితం మాత్రం కాంగ్రెస్ కు దక్కలేదు. ఇందుకు కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ల వైఖరే కారణమని పార్టీ హై కమాండ్ భావిస్తోంది. పార్టీ శ్రేయస్సు కంటే సొంత ప్రయోజనాల పరిరక్షణే ముఖ్యంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ సీనియర్లు వ్యవహరించిన తీరు కారణంగానే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభోట్లు అన్నట్లుగా తయారైందని అధిష్ఠానం భావిస్తున్నది. క్షేత్ర స్థాయిలో క్యాడర్ బలంగా ఉన్నప్పటికీ వారికి సరైన దిశా నిర్దేశం చేయగలిగే స్థితిలో రాష్ట్ర నాయకత్వం లేదన్న నిర్ధారణకు వచ్చింది. అందుకే తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పంచన చేరినా రేవంత్ లోని ఫైర్ ను గుర్తించి ఆయనకు పీసీసీ చీఫ్ పగ్గాలు అప్పగించింది. అది నచ్చని నేతలు ఎంత యాగీ చేసినా అధిష్థానం పట్టించుకోలేదు. అలిగిన కొందరు సీనియర్లు పార్టీ వీడేందుకు సిద్ధపడినా లెక్క చేయలేదు. అంతే కాకుండా రేవంత్ పీసీసీ పగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్ర కాంగ్రెస్ లో క్షేత్ర స్థాయి నుంచీ ఒక కొత్త జోష్ కనిపిస్తోందని హై కమాండ్ భావిస్తోంది.
అందుకే కొమటి రెడ్డి రాజగోపాల రెడ్డి రాజీనామా ప్రకటన చేసినప్పుడు బుజ్జగింపు ప్రయత్నాలు చేసినట్లు కనిపించినా సీరియస్ గా ఆయనను నిలువరించడానికి పార్టీ హై కమాండ్ ప్రయత్నించలేదని పార్టీ వర్గాలే అంటున్నాయి. గత ఏడాది కాలంగా రాజగోపాల రెడ్డి పార్టీ వీడుతానంటూ సంకేతాలు ఇచ్చినా, ఆయనకు నచ్చ చెప్పడానికి ప్రయత్నాలేవీ జరగలేదు. పార్టీ హై కమాండ్ సూచనల మేరకే కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణికం ఠాకూర్ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బెదరింపులను పట్టించుకోలేదనీ, కనీసం ఆయనను పిలిచి మాట్లాడేందుకు కూడా ప్రయత్నించలేదనీ అంటున్నాయి. ఇప్పుడు ఒక కోమటి రెడ్డి వెంకట రెడ్డి కూడా అదే దారిలో ఉన్నా.. హై కమాండ్ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవని అంటున్నారు. ఆయన వ్యవహారం రాష్ట్రంలోనే తేల్చుకోవాలని రేవంత్ రెడ్డికి హై కమాండ్ స్పష్టమైన సూచనలు ఇచ్చిందని చెబుతున్నారు. రేవంత్ కు పూర్తి స్వేచ్ఛనిచ్చి తద్వారా తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మంచి ఫలితాలు రాబట్టాలన్నదే అధిష్థానం యోచనగా తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకూ పార్టీ సీనియర్లకు ఇచ్చిన అవకాశాలను వారు వృధా చేసుకున్నారన్న భావన కూడా హైకమాండ్ లో ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నమాట. అందుకే రేవంత్ కు పగ్గాలు ఇచ్చిన తరువాత పార్టీలో కనిపిస్తున్న జోష్ పట్ల హై కమాండ్ సంతృప్తిగా ఉందనీ, రేవంత్ కు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఆయన పని ఆయన చేసుకుంటూ పోయే అవకాశం ఇస్తే మంచి ఫలితాలు వస్తాయని హై కమాండ్ భావిస్తున్నదని చెబుతున్నారు. పార్టీ అధిష్ఠానం నుంచి అందిన సూచనల మేరకే రేవంత్ పార్టీ సీనియర్లు తనపై చేస్తున్న విమర్శలను పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. కోమటి రెడ్డి బ్రదర్స్ విషయంలో రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పార్టీకి రాజీనామా చేసే వరకూ ఆయన తనపై చేసిన విమర్శలకు స్పందించకుండా సంయమనం పాటించిన రేవంత్ ఒక సారి రాజగోపాల్ రెడ్డి రాజీమానా చేయగానే ఆయన సొంత నియోజకవర్గంలోనే విమర్శలు గుప్పించారు. రాజగోపాలరెడ్డిని కాంగ్రెస్ ద్రోహిగా అభివర్ణించారు. మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేశానని చెప్పిన రాజగోపాలరెడ్డి మాటలను తీవ్రంగా ఖండించి అదే నీ ఉద్దేశమైతే రాజీనామా చేసి కాంగ్రెస్ తరఫునుంచే పోటీ చేసి ఉండాల్సిందిగా అని నిలదీశారు. రేవంత్ కింద పని చేయాలా అన్న ప్రశ్నకు అమిత్ షా పక్కన నిలబడి ఫొటోలు దిగగలిగినప్పుడు నా పక్కన నిలుచోడానికి ఇబ్బందేమిటని నిలదీశారు? ఆ ప్రశ్న ద్వారా అటు కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డినే కాక ఇటు కోమటి రెడ్డి వెంకట రెడ్డిని కూడా ఇరుకున పెట్టారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇక రేవంత్ ముఖం చూడనని శపథం చేసిన సంగతి తెలిసిందే.
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ తరువాత రేవంత్ స్పీడ్ పెంచారు. వెంకటరెడ్డికి ఏ మాత్రం సరిపడని చెరుకు సుధాకర్ ను పార్టీలో చేర్చుకున్నారు. ఆయన పార్టీనీ కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. ఇక పార్టీ అధికార ప్రతినిథి దాసోజు శ్రవణ్ కుమార్ కాంగ్రెస్ కు రాజీనామా చేస్తే కనీసం పార్టీ నుంచి ఎవరూ స్పందించలేదు. దీనిని బట్టే రాష్ట్ర కాంగ్రెస్ లో రేవంత్ కు ఎదురేలేని పరిస్థితి నెలకొందని అవగతమౌతోందని పరిశీలకులు అంటున్నారు.
ఇదంతా పార్టీ హై కమాండ్ కు తెలిసే జరుగుతోందనీ, మరింత మంది రేవంత్ ను వ్యతిరేకించి పార్టీ వీడినా హై కమాండ్ పట్టించుకునే పరిస్థితి లేదనీ, రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలన పూర్తిగా రేవంత్ కు కట్టబెట్టి హై కమాండ్ రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురమ్మని ఆదేశించిందనీ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కోమటి రెడ్డి ఎపిసోడ్ తో పార్టీలో అందరికీ ఈ మేరకు సంకేతాలు అందినట్టేనని కూడా అంటున్నారు.