పోటీలు పడి మరీ తెలుగుదేశాన్ని ప్రశంసిస్తున్న ఏపీ బీజేపీ నేతలు
posted on Aug 6, 2022 @ 10:32AM
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇంత వరకూ వైసీపీ, బీజేపీల మధ్య ఉన్న రహస్య మైత్రి విచ్ఛిన్నమయ్యిందన్న సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఏపీ సర్కార్ తప్పులను పార్లమెంటు సాక్షిగా కేంద్రం వెల్లడించడంతో వైసీపీ నేతలలో అసహనం వ్యక్తమౌతోంది.
దాంతో గత మూడేళ్లుగా బీజేపీ రాష్ట్రానికి చేసింది శూన్యమంటూ ఎదురు విమర్శలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఇంత కాలం వైసీపీ విధానాలను పన్నెత్తి విమర్శించని రాష్ట్ర బీజేపీ ఇప్పుడు వైసీపీని ఏ మాత్రం స్పేర్ చేయడం లేదు. ఇంత కాలం వైసీపీ తప్పులన్నిటినీ సమర్ధిస్తూ వాటికి కూడా రాష్ట్ర బీజేపీ నేతలకు తెలుగుదేశం పార్టీనే వేలెత్తి చూపేవారు. ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. ముఖ్యంగా ప్రజా రాజధాని అమరావతి విషయంలో బీజేపీ యూ టర్న్ తీసుకుంది. ఏపీకి ఒక్కటే రాజధాని అది అమరావతి అంటూ అమరావతి మద్దతుగా పాదయాత్ర కూడా చేపట్టింది.
ఆ పాదయాత్రలో బీజేపీ నేతలు అనూహ్యంగా తెలుగుదేశంపైనా, ఆ పార్టీ అధినేతపైనా ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో అవకాశం ఉన్నా లేకపోయినా చంద్రబాబును విమర్శించడమే తన విధానం అన్నట్లుగా వ్యవహరించిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా తెలుగుదేశం అధినేతపై ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు దార్శనికుడని కితాబిచ్చారు. చంద్రబాబు దార్శనికుడు కనుకనే కేంద్రం రాజధానికి నిధులు ఇచ్చిందని వీర్రాజు అన్నారు. బీజేపీ రాష్ట్ర నేతలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని చంద్రబాబును, తెలుగుదేశంను పొగడ్తలలో ముంచెత్తడంతో వైసీపీ గత్యంతరం లేని పరిస్థితుల్లో బీజేపీ రాష్ట్ర నేతలపై విమర్శలు గుప్పిస్తోంది.
ఏపీ బీజేపీ కాదనీ ఏపీ బాబు జనతా పార్టీ అని ఎద్దేవా చేయడానికి ప్రయత్నిస్తోంది. మోడీ మాటెత్తడానికే ఇంత కాలం భయపడిన వైసీపీ నేతలు ఇప్పుడు నేరుగా మోడీపైనే విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. కేంద్రంలో మోడీ పాలన కంటే ఏపీలో జగన్ పాలన బేషుగ్గా ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అయితే ఈ మార్పు బీజేపీ, వైసీపీల పరస్పర విమర్శలు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయనడానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం ( ఆగస్టు6) అజాదీ కా అమృత్ మహోత్సవ కమిటీ భేటీలో పాల్గొనేందుకు హస్తిన వెళ్లిన చంద్రబాబునాయుడు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యే అవకాశాలున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
వైసీపీకి ఎంతగా సహకరించినా జగన్ తన పాలనా వైఫల్యంతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారనీ, ఇంకా ఆ పార్టీకీ, ప్రభుత్వానికి అండగా నిలుస్తే తమ ఉనికికే ముప్పు ఏర్పడుతుందని రాష్ట్ర బీజేపీ నాయకులు తమ పార్టీ పెద్దలకు చెప్పడం వల్లనే బీజేపీ వైఖరిలో, అలాగే కేంద్రం వైఖరిలో వైసీపీ పట్ల మార్పు కనిపించిందని పరిశీలకలు అంటున్నారు. అదే సమయంలో తాము ఎంతగా ఒదిగి ఉన్నా, రాష్ట్ర ప్రయోజనాలను కూడా పట్టించుకోకుండా కేంద్రం అడుగులకు మడుగులొత్తినా ఫలితం లేకపోయిందన్న భావన వైసీపీలో ఏర్పడిందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ, తెలుగుదేశం పార్టీల మధ్య అగాధం నెమ్మదిగా పూడుతోందని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు పొత్తులు, మిత్రులూ అంటూ కలగలసిపోకపోయినా.. ఇరు పార్టీల మధ్యా గతానికి భిన్నంగా సత్సంబంధాలు ఉంటాయన్న అభిప్రాయం పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు ఇప్పటికే బీజేపీ, జనసేనలు మిత్రలు. గతంలో ఒక సారి పవన్ కల్యాణ్ రాష్ట్రంలో మరోసారి వైసీపీ గెలవకుండా చూసేందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పిన సంగతిని ఈ సందర్బంగా గుర్తు చేస్తున్న పరిశీలకులు.. ఆయన ఆ దిశగా చేసిన ప్రయత్నాలు కూడా ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్న సంకేతాలు కనిపించడానికి కారణమై ఉండొచ్చునని అంటున్నారు. ఏది ఏమైనా రాష్ట్రంలో అన్ని రాజకీయ శక్తులూ వైసీపీ దుష్ట పాలనకు వ్యతిరేకంగా ఐక్యమౌతున్న సంకేతాలైతే ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయంటున్నారు.