కొత్త ట్విస్టులిస్తున్న టీ.కాంగ్రెస్ ఎంపీలు

 

ఇక అధిష్టానంతో తాడో పేడో అంటూ డిల్లీ వెళ్ళిన తెలంగాణా కాంగ్రెస్ యం.పీలు, వెళ్ళినంత స్పీడుగా వెనక్కి తిరిగివచ్చేసారు. ఏడుగురి రాజీనామాలు చేత బట్టుకొని వెళ్ళిన మధు యాష్కీ, పొన్నం ప్రభాకర్, కే.కేశవ్ రావులు, కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన హామీతో తాము సంతృప్తి చెందామని, అందువల్ల ఇక రాజీనామాలు అవసరం లేదని తాము భావిస్తున్నట్లు తెలియజేసారు. మధుయాష్కీ, కేశవరావులు ఆవిధంగా చెప్పగా, పొన్నం ప్రభాకర్ వారితో ఏకీభవిస్తూనే తమ రాజీనామా పత్రాలు మాత్రం సోనియా గాంధీ చేతికిచ్చివచ్చామని చెప్పారు.

 

కానీ, కధ మళ్ళీ మరో మారు అడ్డం తిరిగింది. హైదరాబాదులోనే ఉండి, తమ రాజీనామా పత్రాలను మధు యాష్కీ చేతికిచ్చిన రాజయ్య, గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్ తదితరులు మధుయాష్కీతో విభేదిస్తూ, తాము ఇప్పటికీ తమ రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని, పార్టీ అధిష్టానం వెంటనే తెలంగాణా ప్రకటించకపోతే మరో మారు తమ రాజీనామాలను పంపిస్తామని అన్నారు. మధుయాష్కీ రాజీనామా ఉపసంహరణ ఆయన వ్యక్తిగతమని దానితో తమకు సంబంధం లేదని వారు ప్రకటించడంతో తెలంగాణా కాంగ్రెస్ యంపీల మద్య విబేధాలు తలెత్తాయి. అయితే, ఈ పరిణామంతో కాంగ్రెస్ నేతలు తమ పరువు తామే మరో మారు తీసుకొని, తెరాస, జేఏసీల ముందు మరింత చులకన అయిపోయారు.