ఓవైసీ! దయచేసి మా ఊర్లో అడుగుపెట్టద్దు
posted on Jan 30, 2013 @ 9:31PM
ఓవైసీ సోదరులిరువురూ కాంగ్రెస్ పార్టీకి తలాక్ ఇచ్చి బయటకి వచ్చిన తరువాత, తమ మజ్లిస్ పార్టీని రాష్ట్రమంతా విస్తరించాలనే తాపత్రయంతో సభలు సమావేశాలు నిర్వహించి నోరు జారారు. దాని పర్యవసానంగా నిత్యం కోర్టులు, పోలీసులు, కేసులు అంటూ ఇప్పుడు తిరుగుతున్నారు. దీనికి తోడూ, పోలీసులు వారిపై ఉన్న పాతకేసులు కూడా తిరగాదోడటంతో, ఇక వారికిప్పుడు తమ పార్టీ గురించి కానీ, సభల గురించి గానీ ఆలోచించే తీరికేలేకుండా పోయింది. అయినప్పటికీ, దెయ్యం వెంటబడినట్లు వారిపై వివిధ రాష్ట్రాలలో నమోదయిన కేసులు ఇప్పటికీ వారి వెంటబడుతూనే ఉన్నాయి.
ఇదే క్రమంలో, బుధవారంనాడు ఔరంగాబాద్ పోలీసులు స్వయంగా వచ్చి అసదుద్దీన్ ఓవైసీకి కోర్టు సమన్లు అందజేయడమే గాకుండా, అయన ఇంటిని కూడా తణికీలు చేశారు. పనిలో పనిగా అయన వచ్చే నెల 1వ తేదీన ఔరంగాబాద్‌లో తలపెట్టిన బహిరంగసభకు అనుమతి నిరాకరిస్తునట్లు కూడా తెలియజేసారు. అసుదుద్దీన్ ఓవైసీ మరో మారు తన ఉపన్యాసం ద్వారా ప్రశాంతంగా ఉన్న తమ నగరంలో చిచ్చుపెట్టే అవకాశం ఉందని భావించిన ఔరంగాబాద్ కమిషనర్. ఫిబ్రవరి 1 నుంచి మార్చి నెలాఖరువరకు తమ నగరంలో ఎటువంటి సభలకు అనుమతినీయమని స్పష్టం చేశారు. అందువల్ల అసుదుద్దీన్ ఓవైసీని తమ నగరంలోకి సభల కోసం అడుగు పెట్టవద్దని ఆయన సూచించారు.