ఏటీఎం వద్ద మోసాలకు పాల్పడుతున్న అంత రాష్ట్ర ముఠా అరెస్ట్

 

హైదరాబాద్ నగరంలో ఏటీఎంల వద్ద కేవలం చదువురాని, వృద్ధులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని వారి దృష్టి మళ్లించి మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను మెహిదీపట్నం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.52,000 నగదు, వివిధ బ్యాంకులకు చెందిన 89 ఏటీఎం కార్డులు, మూడు సెల్‌ఫోన్లు మరియు ఒక ఆటో రిక్షాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టైన నిందితులు

హర్యానాకు చెందిన అమీర్ సుహెల్ @ అమీర్ సోహైల్ @ సోహెల్ (24), ముబారిక్ (26), ముస్తకీమ్ (25)తో పాటు హైదరాబాద్‌కు చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ అమేర్ (33)ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో అమీర్ సుహెల్, ముబారిక్‌లు ప్రధాన నిందితులుగా గుర్తించారు.

వివరాల్లోకి వెళితే....

డిసెంబర్ 31న ఆసిఫ్‌నగర్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ అలకుంట వెంకటేష్ (38) ఫిర్యాదు మేరకు ఈ కేసు వెలుగులోకి వచ్చింది. అలకుంట వెంకటేష్ తన తల్లి ఏటీఎం కార్డులో ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలుసుకునేందుకు డిసెంబర్ 28న మల్లేపల్లి ఎక్స్‌రోడ్స్‌లోని ఎస్‌బీఐ ఏటీఎ వెళ్లాడు. కానీ ఇతనికి చదువు రాకపోవడంతో అక్కడున్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల సహాయం కోరాడు. వారు అతని తల్లి ఏటీఎం కార్డు తీసుకుని పిన్ నంబర్ తెలుసుకుని, అందులో 1,32,000 ఉన్నట్లుగా చెప్పారు. అనంతరం నిందితులు కార్డు మార్చిఅలకుంట వెంకటేష్ కు ఇచ్చారు. 

కార్డు తీసుకుని వెంకటేష్ వెళ్లిన అనంతరం నిందితులు అసలైన కార్డుతో రూ.40,000 నగదు విత్‌డ్రా చేశారు. అనంతరం వెంకటేష్ తన తల్లి ఫోన్ కు బ్యాంకు నుండి వచ్చిన ఎస్ఎంఎస్ చూసి ఒక్కసారిగా అవాక్క య్యాడు. ఏటీఎం కార్డు తను వద్ద ఉండగా డబ్బులు ఎలా డ్రా అయ్యాయి అని బాగా ఆలోచించిన వెంకటేష్ కు ఏటీఎం కార్డు వద్ద నిందితులే తనను మోసం చేశారని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.

బాధితుడు వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించగా ఈ ముఠా వ్యవహారం కాస్త వెలుగులోకి వచ్చింది...ఈరోజు జనవరి 3 ఉదయం విజయ్‌నగర్ కాలనీలోని ఏటీఎం వద్ద మరో నేరానికి ప్రయత్నిస్తున్న సమయంలో సమాచారం అందుకున్న మెహిదీపట్నం క్రైమ్ సిబ్బంది నిందితులను పట్టుకున్నారు. విచారణలో వారు ఏటీఎం నేరాలకు పాల్పడుతున్నట్లుగా అంగీకరించారు.

ప్రధాన నిందితుడు అమీర్ సుహెల్‌పై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే నాలుగు కేసులు నమోదై ఉండగా, రెండు నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడు ముబారిక్ హర్యానాలో ఆటోమొబైల్ దొంగతనం కేసులో జైలుకు వెళ్లిన చరిత్ర ఉంది.చదువురాని వారు లేదా వృద్ధులు ఏటీఎంల వద్ద డబ్బులు విత్‌డ్రా చేయడం లేదా బ్యాలెన్స్ చెక్ చేసుకునే సమయంలో సహాయం చేస్తామని నమ్మించి, పిన్ నంబర్ తెలుసుకుని, కార్డులను మారుస్తూ ఖాతాల నుంచి డబ్బు కొల్లగొట్టడమే ఈ ముఠా ప్రధాన పద్ధతిగా పోలీసులు వెల్లడించారు. 

నిందితులను అరెస్టు చేసి మెహిదీపట్నం పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం. 365/2025 కింద సెక్షన్లు 318(4), 303(2) r/w 3(5) BNS ప్రకారం కేసు నమోదు చేసి నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ప్రజలకు పోలీసుల సూచన ఏటీఎం కార్డును ఎవరికీ ఇవ్వవద్దని, పిన్ నంబర్‌ను  ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని వ్యక్తులకు చెప్పవద్దని పోలీసులు సూచించారు. అవసరమైతే బ్యాంక్ సిబ్బంది సహాయం మాత్రమే తీసుకోవాలని హెచ్చరించారు.

కోనసీమ కొలిమి.. బ్లో ఔట్.. మంటల నియంత్రణకు మరో వారం!

కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో బ్లో అవుట్ మంటలను ఆర్పే పనులు కొనసాగుతూనే ఉన్నాయి. బ్లో అవుట్ ని అదుపు చేయడానికి మంగళవారం (జనవరి 6) ఉదయం నుంచీ నిరంతరాయంగా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. బ్లో అవుట్ వేడి తగ్గించేందుకు నీరు పిచికారీ చేస్తున్నారు.  మంగళవారం (జనవరి 6) నుంచి అర్ధరాత్రి వరకూ ఈ నీటి పంపింగ్ నిరంతరాయంగా జరిగింది.   బ్లో ఔట్ కారణంగా ఎగజిమ్ముతున్న మంటలను ఒకే సారి నియంత్రిస్తే సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందనీ, అందుకే దశలవారీగా మంటల అదుపునకు ప్రయత్నాలు చేస్తున్నామనీ ఓఎన్జీసీ అధికారులు తెలిపారు.   ఒక బ్లో ఔట్ ప్రదేశానికి  భారీ వాహనాలు, మడ్ ఫిల్లింగ్ యంత్రాలను తీసుకువచ్చేందుకు పొలాల మీదుగా తాత్కాలిక రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ తాత్కాలిక రోడ్ల ద్వారా.. భారీ వాహనాలతో మడ్ ఫిల్లింగ్ యంత్రాన్ని తీసుకు వస్తామని చెప్పారు.  మొత్తంగా వారం రోజుల్లో  పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని అధికారులు తెలిపారు.  పరిస్థితి అదుపులోనికి వచ్చిన తరువాత పునరావాస కేంద్రంలో ఉంటున్న వారిని వారివారి ఇళ్లకు పంపేస్తామని కలెక్టర్ తెలిపారు.    ఇలా ఉండగా ఢిల్లీ, ముంబై నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం చేరుకున్నాయి. ఈ బృందాలు బ్లో అవుట్ సైట్ ని పరిశీలించాయి. మంటల అదుపునకు  పలు సూచనలు చేశాయి.  ఓన్జీసీ టెక్నాలజీ ఫీల్డ్ సర్వీసెస్ డైరెక్టర్ సక్సేనా, ప్రాంతీయ విపత్తు నిర్వహణ ఇంఛార్జ్ శ్రీహరి సైతం సైట్ విజిట్ చేసిన వారిలో ఉన్నారు.

పేకాటకు అనుమతి కోరుతూ హైకోర్టుకు.. కోర్టు తీర్పు ఏంటంటే?

జూదం ఆడతాం, ఆడిస్తాం అనుమతివ్వండంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రంలో  పేకాట  జూదం మూడు ముక్కలు- ఆరు ఆటలు అన్నట్టుగా సాగుతుంటుంది.  ఈ జూదానికి స్థానిక నేతల అండదండలు భారీగా ఉండటంతో పోలీసులు కూడా చూసీ చూడనట్టుగా వదిలేస్తుండటం కద్దు.  కానీ ఇటీవలి కాలంలో పేకాట క్లబ్బులపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు పలు క్లబ్లులు, పేకాట రాయుళ్లపై కేసులు నమోదు చేశారు.  ఈ నేపథ్యంలోనే  13 ముక్కల పేకాటకు అనుమతి ఇవ్వాలంటూ భీమవరం పట్టణంలోని కొన్ని క్లబ్బులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. అలా పిటిషన్ దాఖలు చేసిన వాటిలో భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్, లార్డ్ హఓర్డింగ్ హాల్ టౌన్ క్లబ్, నరసాపురం యూత్ క్లబ్ వంటివి ఉన్నాయి. ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా  డబ్బు పందెంగా పెట్టి పేకాట ఆడ్డం చట్ట విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేస్తూ క్లబ్బుల పిటిషన్ లను తోసిపుచ్చింది.  క్లబ్స్ తరఫు న్యాయవాది సుప్రీం తీర్పు ఆధారంగా.. రమ్మీ ఆడేందుకు అనుమతివ్వాల్సిందిగా తన వాదనలు వినిపించారు. అయితే హైకోర్టు ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. డబ్బులకు పేకాట ఆడ్డానికి   వీల్లేదని.. అలా అడితే అది గ్యాంబ్లింగ్ యాక్ట్ సెక్షన్ 3, 4 కింద చట్ట వ్యతిరేక చర్యగా పరిగణించి కేసులు నమోదు చేయాల్సి వస్తుందని తేల్చి చెప్పింది. ఇటీవల ఇలాంటి కేసుల్లో ఇదే తరహా ఆదేశాలిచ్చినట్టు స్పష్టం చేసింది   ఇప్పటికే నూజివీడు మ్యాంగో బే క్లబ్ దాఖలు చేసిన మరో పిటిషన్ పై కూడా హైకోర్టు సరిగ్గా ఇలాంటి క్లారిటీయే ఇచ్చింది. రమ్మీని ఎట్టి పరిస్థితుల్లో డబ్బులకు ఆడితే ఒప్పుకునేది లేదనీ.. అలా ఆడితే.. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలనీ జిల్లా పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. అదే తీర్పు భీమవరం వ్యవహారంలోనూ అమలు చేస్తామని స్పష్టం చేసింది ఉన్నత న్యాయస్థానం. 

హస్తినలో కూల్చివేతలు.. ఉద్రిక్తత

దేశ రాజధాని నగరంలో కూల్చివేతలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. పాత ఢిల్లీలోని టర్క్ మాన్ గేట్  సమీపంలోని ఫైజ్-ఏ-ఇలాహీ మసీదు సమీపంలోని ఆక్రమణలను తొలగించేందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్  చేపట్టిన కూల్చివేతల పట్ల స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆక్రమణల తొలగింపు కోసం ఢిల్లీ మునిసిపల్ కార్పొరేష్ బుధవారం (జనవరి 7) తెల్లవారు జామున కూల్చివేతల డ్రైవ్ చేపట్టింది. ఈ కూల్చివేతలను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. కూల్చివేతల ప్రాంతంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకుని వచ్చి మరీ పోలీసులపై రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అయినా పరిస్థితి అదుపులోనికి రాకపోవడంతో బాష్ఫవాయువు ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు.   ఫైజ్-ఏ-ఇలాహీ మసీదు, శ్మశాన వాటికకు ఆనుకుని ఉన్న   38 వేల 940 చదరపు అడుగుల భూమిలో అక్రమ కట్టడాలను తొలగించాలని ఢిల్లీ హైకోర్టు గత ఏడాది  నవంబర్‌లో  ఆదేశాలు జారీ చేసింది.  దీనిపై మసీదు కమిటీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కోర్టు స్టే ఇవ్వకపోవడంతో  అధికారులు భారీగా పోలీసులు మోహరించి  17 బుల్డోజర్లతో కూల్చివేతల చేపట్టారు.  

కొవ్వూరు ఫ్లై ఓవర్ పై బస్సు దగ్ధం

ఆంధ్రప్రదేశ్ లో బుధవారం (జనవరి 7) తెల్లవారు జామున ఓ ప్రైవేటు బస్సు దగ్ధమైంది. ఈ  ఘటన తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు ఫ్లైఓవర్‌ బ్రిడ్జిపై జరిగింది.  ఖమ్మం నుండి విశాఖపట్నం వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో  షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.   బస్సు కొవ్వూరు ఫ్లైఓవర్‌పైకి చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలను గుర్తించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేసి ప్రయాణీకులను కిందకు దింపివేయడంతో  పెను ప్రమాదం తప్పింది. సంఘటన జరిగిన సమయంలో బస్సులో   ఆరుగురు ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. వీరంతా సురక్షితంగా బయటపడ్డారు.   సమాచారం అందుకున్న   స్థానిక అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానాలకు తరలించారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది.  

రేపు పోలవరం ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు

  రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు  రేపు సందర్శించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణం పనుల పురోగతిని సీఎం స్వయంగా పరిశీలించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి సీఎం నేరుగా హెలికాప్టర్‌లో పోలవరం వెళ్లనున్నారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్‌తో పాటు... కాఫర్ డ్యామ్, బట్రస్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులను పర్యవేక్షిస్తారు. నిర్మాణం చివరి దశకు చేరుకున్న డయాఫ్రమ్ వాల్‌ను కూడా సీఎం పరిశీలించనున్నారు. అనంతరం ప్రాజెక్ట్ సైట్ వద్దనే అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అలాగే మీడియా సమావేశాన్ని నిర్వహిస్తారు.  88 శాతం పూర్తయిన ప్రాజెక్టు నిర్మాణం  గత ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరుగులు పెడుతున్నాయి. ఈ 18 నెలల కాలంలో 13 శాతం మేర ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 87.8 శాతం మేర జరిగింది. 2014-19 మధ్య కాలంలోనే ప్రాజెక్టులో సివిల్ పనులు 72 శాతం జరిగాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2025 వరకు 5 ఏళ్లలో కనీసం 2 శాతం పనులు కూడా చేపట్టలేదు. ఐదేళ్ల కాలంలో జరిగిన నష్టాన్ని పూరించేలా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు.  

జ‌న‌వ‌రి 9 నుండి ఆన్ లైన్‌లో శ్రీ‌వాణి ద‌ర్శన టికెట్లు

  భక్తుల సౌకర్యార్థం, పరిపాలనా అవసరాల దృష్ట్యా టీటీడీ శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తిరుమలలో ఆఫ్‌లైన్ కౌంటర్ల ద్వారా జారీ చేస్తున్న టికెట్లను జనవరి 9 నుండి రోజువారి ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో కేటాయించ‌నున్నారు. ఈ మేరకు తిరుమలలో రోజువారి విధానంలో ఆఫ్‌లైన్ ద్వారా జారీ చేస్తున్న 800 శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల‌ను ఆన్‌లైన్ ద్వారా రోజూవారి కరెంట్ బుకింగ్‌లోకి మార్చనున్నారు. ఈ టికెట్లను ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసి, మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంచుతారు. టికెట్ పొందిన భ‌క్తులు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనానికి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఒక్క కుటుంబానికి 1+3 సభ్యులు (మొత్తం న‌లుగురు) మాత్రమే టికెట్ బుకింగ్‌కు అనుమతి ఉంటుంది. టికెట్ల బుకింగ్ లో దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆధార్ ధృవీకరణ, మొబైల్ నంబర్ వంటి వివరాలు తప్పనిసరి. ఫ‌స్ట్ క‌మ్ ఫ‌స్ట్ స‌ర్వ‌డ్ విధానంలో భ‌క్తులు టికెట్లు బుక్ చేసుకోవ‌చ్చు. త‌ద్వారా ఆఫ్ లైన్ లో శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల కోసం భ‌క్తులు క్యూలైన్ లో నిరీక్షించే స‌మ‌స్య తొల‌గిపోతుంది. ఈ నూతన విధానాన్ని నెల రోజుల‌పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.  అదేవిధంగా రోజుకు 500 శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల‌ను ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్ విధానంలో ఇప్పటికే విడుద‌ల చేయ‌డం జరిగింది. మూడు నెల‌ల అనంత‌రం ఈ విధానంపై స‌మీక్షించి నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రుగుతుంది. తిరుప‌తి విమానాశ్ర‌యంలో ప్ర‌తిరోజూ భ‌క్తుల‌కు ఆఫ్ లైన్ విధానంలో జారీ చేస్తున్న 200 టికెట్ల జారీ విధానం కూడా య‌థావిధిగా కొన‌సాగ‌నుంది.అన్ని వ‌ర్గాల భ‌క్తుల‌ను దృష్టిలో ఉంచుకుని టీటీడీ తీసుకున్న నిర్ణ‌యాన్ని గ‌మ‌నించి భ‌క్తులు త‌మ ద‌ర్శ‌న ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందిచుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేయ‌డ‌మైన‌ది.

సోషల్ మీడియాలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు : లోకేష్

  సోషల్ మీడియాలో కుట్ర పూరిత విద్వేష పోస్టులు పెట్టేవారిపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా జవాబుదారీతనం, పౌరుల రక్షణను బలోపేతం చేయడం అనే అంశంపై రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మంత్రుల బృందం సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీ యాక్ట్ 2000 – సేఫ్ హార్బర్, బ్లాకింగ్ పవర్స్, ఐటీ రూల్స్ 2021 – కంప్లయన్స్ అండ్ ట్రేసబిలిటీ, డిపీడీపీ యాక్ట్- 2023 డేటా ప్రొటెక్షన్ ఫ్రేమ్ వర్క్, జ్యుడీషియల్ సేఫ్ గార్డ్స్ – ఫ్రెష్ స్పీచ్ & ప్రైవసీ లపై చర్చించారు.  మంత్రి లోకేష్ మాట్లాడుతూ... ప్రభుత్వ నిర్ణయాలపై సద్విమర్శలను స్వాగతిస్తాం, ఉద్దేశపూర్వక విద్వేష వ్యాఖ్యలను సహించం. ఏఐ ఆధారిత డీప్ ఫేక్ అసభ్య కంటెంట్ ను అరికట్టాలి, నిర్ణీత వయసు ఆధారిత సోషల్ మీడియాకు వచ్చేలా నిబంధనలు రూపొందించాలి. మహిళలపై అవమానకర, అసభ్య పోస్టులు పెట్టే వారిపై నిఘా పెట్టాలి. ప్రజాభీష్టాన్ని అడ్డుకోవడం మా ఉద్దేశం కాదు, అదే సమయంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఆర్గనైజ్డ్ గా దురుద్దేశపూర్వక పోస్టులు పెడుతున్నారు.  దీనిని ఎట్టి పరిస్థితుల్లో సహించం. ప్రతిపక్షాలు ధర్నా చౌక్ లాంటి ప్రదేశాల్లో నిరసన తెలియజేయడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. గతంలో జ్యుడీషియరీతో పాటు కొంతమందిని టార్గెట్ చేసి అసభ్య పోస్టులు పెట్టారు. విదేశాల్లో ఉండి అభ్యంతర పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేస్తాం. ఇందుకోసం బలమైన లీగల్ ఫ్రేమ్ వర్క్ ఏర్పాటు చేయాలి. ఉద్దేశపూర్వకంగా తప్పుడు పోస్టుల కట్టడికి కేంద్రప్రభుత్వం సహయోగ్ ఇంటిగ్రేషన్ పోర్టల్ ప్రవేశపెట్టింది.  మాజీ ముఖ్యమంత్రి భార్యపై పోస్టు చేస్తే మా పార్టీ వాడైనా జైలుకు పంపించాం. వ్యక్తిత్వ హననం, వ్యక్తిగతమైన వ్యాఖ్యలు, ముఖ్యంగా మహిళల పట్ల అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కఠినంగా వ్యవహరిస్తాం. సోషల్ మీడియాలో సెకన్ల వ్యవధిలో కంటెంట్ స్ప్రెడ్ అవుతోంది. ఫలితంగా వెనువెంటనే ప్రభావం చూపుతుంది. కాంట్రవర్సీ ఎక్కువగా జనంలోకి వెళుతోంది. ఉద్దేశపూర్వకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారిపై నిఘా పెట్టాలి. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలలో అమలు చేస్తున్న చట్టాలను అధ్యయనం చేయాలి.  ఆస్ట్రేలియా, ఈయూ, యూకేలలో ఇండిపెండెంట్ రెగ్యులేషన్స్ అమలు చేస్తూ హెవీ పెనాలిటీస్ విధిస్తున్నారని చెప్పారు. హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ... సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి కేసు నమోదు, చార్జిషీటుకు సమయం పడుతోంది. సైబర్ క్రైమ్ కెపాసిటీ బిల్డింగ్ చేయాల్సిన  అవసరం ఉంది. నెలరోజుల్లో చార్జిషీటు ఏర్పాటుచేసేలా చర్యలు చేపట్టాలి. అటువంటి వ్యక్తుల సోషల్ మీడియా ఎకౌంట్లను సస్పెండ్ చేయడంపై దృష్టిపెట్టాలి. రిటైర్డ్ జడ్జిలు, న్యాయకోవిదుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని లీగల్ ఫ్రేమ్ వర్క్ ఏర్పాటు చేస్తామని అన్నారు. రాష్ట్రస్థాయి కోఆర్డినేషన్ సెల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో  మంత్రి కొలుసు పార్థసారధి, ఐ & పీఆర్ డైరెక్టర్ కె.ఎస్ విశ్వనాథన్, ఆకే రవికృష్ణ ఐజీ, ఈగల్, ఇన్ చార్జ్, సైబర్ క్రైమ్, కుమార్, సీహెచ్ వెంకటేశ్వర్లుప్రాసిక్యూషన్ డైరెక్టర్ రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.   

అవినాష్ రెడ్డి అంత క్రిమినల్ బుర్ర నాకు లేదు : బీటెక్ రవి

  వివేకా హత్యను గుండెపోటు, బ్లడ్ వాంతులుగా చిత్రీకరించి సాక్ష్యాలను మాయం చేయడంలో ఎంపీ అవినాష్ రెడ్డి చూపించిన తెలివి సామాన్యమైనది కాదని, అంత క్రిమినల్ బుర్ర తనకు లేదని పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి విమర్శించారు. మంగళవారం కడపలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీటెక్ రవి హాట్ కామెంట్స్ చేశారు. తాను ఒక్క రూపాయి కూడా అవినీతి చేశానని నిరూపిస్తే రాజకీయాల నుంచే తప్పుకుంటానని సవాల్ విసిరారు. వైఎస్ వివేకాని మీరే హత్య చేసి మాపై నిందలు వేయాలనుకోవడంలో అవినాష్ రెడ్డికి ఉన్నంత తెలివి తమకు లేదన్నారు. సీబీఐ అధికారులు అరెస్ట్ చేసేందుకు వస్తే తల్లిని అడ్డుపెట్టుకుని ఆస్పత్రిలో నాటకాలు ఆడిన స్థాయి బుద్ధి తమకు లేదని ఎద్దేవా చేశారు.తాను ఏదో మాట్లాడితే సంబంధం లేని విషయాలు అవినాష్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. హౌసింగ్ విషయంలో తనకు బుర్ర ఉందా లేదా అని ప్రశ్నిస్తున్న అవినాష్ రెడ్డి, నిజంగా బుర్ర ఉంటే మాట్లాడుతున్నాడా అని కౌంటర్ ఇచ్చారు. పులివెందుల హౌసింగ్ ప్రాజెక్టుల్లో 10 శాతం అదనంగా డబ్బులు డ్రా చేశామని వాళ్లే ఒప్పుకున్నారని పేర్కొన్నారు. హౌసింగ్ లబ్ధిదారులు కట్టిన డబ్బులు ఎవరు తిరిగి ఇస్తారు? తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఇస్తాడా లేక అవినాష్ రెడ్డే ఇస్తాడా అని ప్రశ్నించారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, మట్కా విషయంలో మీ పాలనలో పులివెందుల రెండో తాడిపత్రిగా మారిందన్నది నిజం కాదా అని నిలదీశారు.వినాష్ రెడ్డి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని బీటెక్ రవి సూచించారు.

జగన్ మానసిక పరిస్థితి బాగోలేదు : మంత్రి సవిత

  గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను ఒక్కొక్కటిగా వెలికి తీసుకున్నామని, అక్రమార్కులెవరినీ వదలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి సవిత స్పష్టంచేశారు. మాజీ సీఎం జగన్ మానసిక పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోతోందని, ఆయనకు లండన్ మందులు పని చేయనట్లుందని అన్నారు. వైయస్సార్ కడప జిల్లా వీరపునాయుని పల్లె ఉల్లి రైతులకు నష్ట పరిహారం పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఏపీని తానే అభివృద్ధి చేసినట్లు జగన్  భ్రమలో బతికేస్తున్నారని ఎద్దేవా చేశారు.  భోగాపురం ఎయిర్ పోర్టు తానే నిర్మించానని, విశాఖకు డెటా సెంటర్ ను కూడా తెచ్చింది ఆయనేనని జగన్  చెప్పుకోవడం ఆయన దిగజారిన మానసిక పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం క్రెడిట్ అంతా సీఎం చంద్రబాబుదేనన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి కారణం జగనేనని మంత్రి సవిత స్పష్టంచేశారు. ఆయన అసమర్థత వల్ల ఆ ప్రాజెక్టు నిలిచిపోయిందన్నారు.   *జగన్ రైతులను భయభ్రాంతులకు గురి చేశారు రైతుల పట్టాదారు పాస్ బుక్ లపైనా, సర్వేరాళ్లపైనా జగన్ తన బొమ్మను ముద్రించుకుని రైతులను, భూ యజమానులు భయబ్రాంతులకు గురిచేశారని మంత్రి సవిత మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాగానే జగన్ తీసుకొచ్చిన చీకటి చట్టం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశామన్నారు.  పట్టాదారు పాస్ బుక్ లపై జగన్ బొమ్మను తొలగించి, రాజముద్ర వేసి రైతుల భూ హక్కులకు రక్షణ కల్పించామన్నారు. రైతులకు తమ భూములపై సంపూర్ణ హక్కులు కల్పించామన్నారు. అయిదేళ్లలో జగన్ అయిదు పర్యాయాలు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై ఆర్థిక భారం మోపారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి యూనిట్ పై 13 పైసల చొప్పున్న ట్రూ అప్ ఛార్జీలు తగ్గించిందన్నారు.

హైకోర్టుకు రకుల్ ప్రీత్‌సింగ్‌ సోదరుడు అమన్

  హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ వినియోగం, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు...ఈ నేపథ్యంలోనే పోలీసులు మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహించగా అందులో హీరోయిన్ సోదరుడు ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పై కేసు నమోదు చేశారు. మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన డ్రగ్స్ కేసులో అమన్‌ను ఏ7 నిందితుడిగా పోలీసులు చేర్చారు. ఈ కేసు నమోదు అయిన నాటి నుంచి  అమన్ ప్రీత్ సింగ్ పరారీలో ఉన్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగదారుడిగా (డ్రగ్స్ కన్స్యూమర్) అమన్‌పై ఆరోపణలు ఉన్నాయి.  ఇదే కాకుండా, ఇది అమన్‌పై నమోదైన రెండో డ్రగ్స్ కేసు కావడం గమనార్హం. ఇదిలా ఉండగా మరోవైపు అమన్ ప్రీతిసింగ్ డ్రగ్స్ కేసులో తనపై నమోదు చేసిన FIRను క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హీరోయిన్ సోదరుడు అమన్ ప్రీతిసింగ్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి. సహా నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగానే తనను నిందితుడిగా చేర్చారని, ప్రత్యక్ష ఆధారాలు లేకుండా కేసులో ఇరికించారని అమన్ తన పిటిషన్ లో పేర్కొన్నాడు.కేవలం ఇతర నిందితుల వాంగ్మూలాల ఆధారంగా తనపై కేసు నమోదు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు.  అంతేకాకుండా,  తాను  డ్రగ్స్ కన్స్యూమర్ అనడానికి స్పష్టమైన ఆధారాలు లేవని అమన్ వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఇదే సమయంలో డ్రగ్స్ కేసులో కీలక అంశాలపై పూర్తి వివరాలతో హాజరు కావాలని పోలీసులను కోర్టు ఆదేశించినట్లు సమాచారం. ఒకవైపు హైదరాబాద్‌లో డ్రగ్స్ నిర్మూలనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుం టున్న నేపథ్యంలో, సెలబ్రిటీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి డ్రగ్స్ కేసులో చిక్కుకు న్నాడని  తెలియడంతో ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది