డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే కుమారుడు అరెస్టు… రాజకీయ వర్గాల్లో కలకలం

 

డ్రగ్స్ వినియోగం కేసులో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి పోలీసులకు చిక్కడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. నార్సింగి పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో డ్రగ్స్ తీసుకుంటూ కనిపించిన సుధీర్ రెడ్డిని పోలీసులు పట్టుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సుధీర్ రెడ్డిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నార్సింగి ప్రాంతంలో అనుమానాస్పద కదలికలపై సమాచారం అందడంతో ప్రత్యేక బృందం తనిఖీలు చేపట్టింది. అదే సమయంలో సుధీర్ రెడ్డి మరో వ్యక్తితో కలిసి తిరుగుతుండగా పోలీసులకు అనుమానం వచ్చి వారిద్దరిని పట్టుకున్నారు. పోలీసులు ఆ ఇద్దరికీ డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన పరీక్షలు నిర్వహించగా ఇద్దరికీ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు. దీంతో సుధీర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

డ్రగ్స్ వినియోగానికి అలవాటు పడిన వ్యక్తులను శిక్షించడమే కాకుండా, పునరావాసం కల్పించాలనే ఉద్దేశంతో సుధీర్ రెడ్డిని డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించారు. సుధీర్ రెడ్డితో పాటు మరో వ్యక్తినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి తెచ్చుకు న్నారు? డ్రగ్స్ కి సంబంధించి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.ఇదిలా ఉండగా, సుధీర్ రెడ్డి గతంలో కూడా రెండుసార్లు డ్రగ్స్ వినియోగం కేసుల్లో దొరికినట్లు సమా చారం. 

సుధీర్ రెడ్డి గతంలో కూడా రెండుసార్లు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డట్టు సమాచారం. అప్పట్లో హెచ్చరికలు, కౌన్సెలింగ్ ఇచ్చినా, మళ్లీ అదే బాటలో కొనసాగడం ఆందోళన కలిగిస్తోందని అధికారులు పేర్కొన్నారు. ఇటీవల కొంతకాలంగా కుటుంబ సమస్యలతో మానసిక ఒత్తిడికి లోనవుతున్నాడని, అదే డ్రగ్స్ వినియోగానికి దారితీసి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.ఎమ్మెల్యే కుమారుడు డ్రగ్స్ కేసులో పట్టుబడటం ఇప్పుడు తాజాగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు పోలీసులు ‘చట్టం ముందు అందరూ సమానమే’ అన్న సందేశాన్ని స్పష్టంగా ఇస్తున్నారు.ఈ ఘటనతో డ్రగ్స్ నియంత్రణపై ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. పూర్తి విచారణ అనంతరం కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.


 

చట్ట విరుద్దమైన పోస్టులపై ‘ఎక్స్’ కీలక నిర్ణయం

   ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ కంటెంట్ గురించి కీలక ప్రకటన చేసింది. 'ఎక్స్‌'లో పోస్ట్ చేసే చట్ట విరుద్ధమైన కంటెంట్‌ను పూర్తిగా తొలగిస్తామని, అలాంటి కంటెంట్‌ను పోస్ట్ చేసిన అకౌంట్లను శాశ్వతంగా సస్పెండ్ చేస్తామని వెల్లడించింది. అందుకోసం అవసరమైతే స్థానిక ప్రభుత్వాలతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. 'ఎక్స్ గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్' ఖాతా ద్వారా ఈ ప్రకటన వెలువడింది.  తమ ఏఐ ప్లాట్‌ఫామ్ 'గ్రోక్‌'ను ఉపయోగించి అశ్లీల కంటెంట్‌ను సృష్టించిన వారిపై, వాటిని నేరుగా అప్‌లోడ్ చేసిన వారిపై ఒకే రకమైన చర్యలు తీసుకుంటామని ఎలన్ మస్క్ హెచ్చరించారు. మస్క్ ప్రకటన అనంతరం 'ఎక్స్ గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్' కూడా అదే తరహా ప్రకటన చేసింది. 'ఎక్స్' నియమాలకు సంబంధించిన ఒక లింక్‌ను కూడా షేర్ చేసింది.  స్థానిక చట్టాలకు, నియమాలకు విరుద్ధంగా అశ్లీల, అసభ్య కంటెంట్ పెరుగుతున్నట్టు భారత ప్రభుత్వం గుర్తించి 'ఎక్స్‌'కు జనవరి రెండో తేదీన నోటీసులు జారీ చేసింది. 'గ్రోక్' ఉపయోగించి మహిళల అసభ్యకర చిత్రాలు సృష్టించి 'ఎక్స్‌'లో పోస్ట్‌లు చేయడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. 'గ్రోక్' ఉపయోగించి రూపొందించిన అశ్లీల కంటెంట్‌ను తొలగించాలని, ఈ మొత్తం ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో 'ఎక్స్' తగిన చర్యలు చేపట్టింది.

ఢిల్లీ ఎయిర్ పోర్టులో రూ. 21 కోట్ల విలువైన కోకైన్ సీజ్

  మాదకద్రవ్యాలను పూర్తిగా రూపుమాపేందుకు అన్ని శాఖల అధికారులు ఉక్కు పాదం మోపుతున్న కూడా కొందరు స్మగ్లర్లు పుష్ప సినిమా తరహాలో కొత్త కొత్త పద్ధతుల్లో డ్రగ్స్ ని రవాణా చేసేందుకు ప్రయత్నం చేస్తూ అధికారుల చేతికి చిక్కు తున్నారు...ఢిల్లీ అంతర్జా తీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల చేతికి ముగ్గురు కేటుగాళ్లు దొరికారు. వారి వద్ద నుండి సుమారు రూ.21 కోట్ల విలువ చేసే 2.1 కిలోల కోకైన్ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడిన ముగ్గురు కేటుగాళ్లు కోకైన్‌ను అత్యంత పకడ్బందీగా సిలర్ కవర్‌లో చుట్టి, దానిపై మరలా పాలితిన్ కవర్లతో ప్యాకింగ్ చేసి ట్రాలీ బ్యాగ్‌లో దాచారు. స్కానింగ్‌కు చిక్కకుండా ఉండేందుకు అత్యాధునిక పద్ధతులు ఉపయోగించారు. ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కకుండా తగు జాగ్రత్తలు తీసుకుని బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి వచ్చిన ముగ్గురు ప్రయాణీకులు గ్రీన్ చానల్ దాటే క్రమంలో అనుమా నాస్పదంగా ప్రవర్తించడంతో కస్టమ్స్ అధికారులు వారిని ఆపి తనిఖీ చేపట్టారు. ట్రాలీ బ్యాగ్‌లను స్కానింగ్ మిషన్‌లో పరీక్షించగా డ్రగ్స్ ఉన్నట్లుగా స్పష్టమైంది. వెంటనే బ్యాగ్‌లను తెరిచి పరిశీలించగా భారీ మొత్తం లో కోకైన్ బయటపడింది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన కస్టమ్స్ అధికారులు, వారి నుంచి మొత్తం 2.1 కిలోల కోకైన్‌ను సీజ్ చేశారు. ఈ డ్రగ్స్ అంతర్జాతీయ మార్కెట్‌లో విలువ సుమారు రూ.21 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితులపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. ఈ డ్రగ్స్ వెనుక ఉన్న అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా, దేశంలో సరఫరా చేయాల్సిన నెట్‌వర్క్‌పై లోతైన విచారణ చేపట్టినట్లు సమాచారం.ఇటీవలి కాలంలో విమానాశ్రయాల ద్వారా డ్రగ్స్ అక్రమ రవాణా పెరుగుతుండటంపై కస్టమ్స్ అధికారులు అప్రమత్తంగా ఉండి, నిఘా మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పాముతో హల్‌చల్

  హైదరాబాద్ పాతబస్తీలోని చంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద శనివారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో వాహనం నడుపుతున్న ఓ ఆటో డ్రైవర్‌ను ట్రాఫిక్ పోలీసులు ఆపగా, అతడి చర్యలు ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారి తీశాయి. నిత్యం ట్రాఫిక్ రద్దీగా ఉండే చంద్రాయణ గుట్ట చౌరస్తా వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానా స్పదంగా ఆటో నడుపు తున్న డ్రైవర్‌ను ఆపి బ్రెత్ అనలైజర్‌తో పరీక్షించగా, అతడికి డ్రంకన్ డ్రైవ్‌లో 150 వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.  దీంతో డ్రైవర్‌పై డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసు నమోదు చేసి, ఆటోను సీజ్ చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అయితే, కేసు నమోదు అనంతరం పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఆటో డ్రైవర్, అకస్మాత్తుగా తన ఆటోలో నుంచి పామును బయటకు తీసి ట్రాఫిక్ పోలీసులను బెదిరించాడు. అంతేకాకుండా పామును పట్టుకొని రోడ్డు మీద వెళ్తూ నానా హల్చల్ సృష్టించాడు. ఈ అనూహ్య ఘటనతో చెక్‌పోస్ట్ వద్ద ఉన్న పోలీసులు, వాహనదారులు, స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పాము కనిపిం చడంతో  వెంటనే పోలీసులు అప్రమత్తమై డ్రైవర్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆలోపే అతడు పాముతో పాటు ఆటోను తీసుకుని సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు. ఈ ఘటన కారణంగా కొద్ది సేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పాటు చెక్‌పోస్ట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై స్పందించిన ట్రాఫిక్ పోలీసులు మాట్లాడుతూ... డ్రంక్ డ్రైవింగ్‌కు తోడు విధి నిర్వహణలో ఉన్న పోలీసులను బెదిరించిన కేసులో ఆటో డ్రైవర్‌పై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.  పరారైన డ్రైవర్‌ను గుర్తించేందుకు ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నామని, అతడిని త్వరలోనే పట్టుకుంటామని అధికారులు వెల్లడించారు. ప్రమాదాలకు దారి తీసే డ్రంక్ డ్రైవింగ్‌పై పోలీసులు ఇప్పటికే కఠినంగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి ఘటనలు ప్రజల భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతాయని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ, మద్యం సేవించి వాహనాలు నడపకుండా బాధ్యతగా వ్యవహరించాలని ట్రాఫిక్ పోలీసులు మరోసారి విజ్ఞప్తి చేశారు.  

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో... సిట్ విచారణకు ఎమ్మెల్సీ నవీన్‌ రావు

  ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ప్రైవేట్ డివైస్‌తో ఫోన్ ట్యాపింగ్‌ చేపించినట్లు నవీన్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు (ఆదివారం) ఉదయం 11 గంటలకు నవీన్ రావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారించనున్నారు.  ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మారిన పొలిటికల్ లీడర్లను సిట్ అధికారులు విచారించనున్నారు. త్వరలోనే బీఆర్ఎస్ కీలక నేతలను సైతం విచారించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట ఉన్న నవీన్‌ రావుకు 2019లో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది.

భోగాపురం ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండింగ్

    భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో తొలి విమానం ల్యాండింగ్ అయింది. ఢిల్లీ నుంచి భోగాపురం విమానాశ్రయానికి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఈ విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ అప్పలనాయుడు ప్రయాణించారు. ఈ ఏడాది జూన్ 26న భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి దశలో ఏటా 60 లక్షల మంది రాకపోకలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ విమానాశ్రయాన్ని అత్యంత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నారు. గతంలో విశాఖను వణికించిన హుద్‌హుద్ తుఫాను సమయంలో గాలులు గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వీచాయి.  దీనిని దృష్టిలో ఉంచుకుని భోగాపురం విమానాశ్రయ టెర్మినల్, ఇతర భవనాలను గంటకు 280 కిలోమీటర్ల వేగంతో వీచే ప్రచండ గాలులను కూడా తట్టుకునేలా అత్యంత పటిష్టంగా నిర్మించినట్లు జీఎంఆర్  సంస్థ తెలిపింది. సుమారు 3.8 కిలోమీటర్ల పొడవైన రన్‌వేతో పెద్ద విమానాలు కూడా ఇక్కడ సులభంగా ల్యాండ్ అయ్యే సౌకర్యం ఉందని పేర్కొంది. ఇది విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు ఉపయోగపడనుంది. భవిష్యత్తులో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని విస్తరణకు కూడా ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి.  

నాచారం‌లో దారుణ హత్య... వివాహేతర సంబంధమే కారణం

  మూడు ముళ్లు, ఏడడు గులు.. వేదమంత్రాలతో వివాహబంధం ముడి పడుతుంది.  అంతటి పవిత్రమైన బంధాన్ని కొందరు ఇల్లాలు ప్రియుడి మోజులో పడి  అవమానిస్తున్నారు. ప్రియుడి కోసం భర్తను చంపి జైలు పాలు అవుతున్నారు. ఇటువంటి ఘటనే హైదరాబాద్‌ నగర శివార్లలోని నాచారం ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డువస్తు న్నాడనే కారణంతో భార్యే భర్తను రాడ్డుతో కొట్టి హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఈ ఘాతుకానికి భార్యతో పాటు ఆమె వివాహేతరుడు సహకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఒడిశాకు చెందిన నారాయణ్‌ బెహరా  తన భార్య బంధిత బెహరాతో కలిసి జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చి నాచారం మల్లాపూర్ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ.. నారాయణ్‌ బెహరా ప్లంబర్‌గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. భార్య బంధిత బెహరా గృహిణిగా ఉండేది. అయితే అదే ఇంట్లో అద్దెకుంటున్న విద్యాసా గర్‌తో బంధితకు గత నాలుగు నెలలుగా వివా హేతర సంబంధం కొనసాగుతున్నది. ఈ విషయం కాస్త భర్త నారాయణ్‌కు తెలియడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అయినా కూడా భార్య బంధిత ప్రవర్తన లో మార్పు రాలేదు సరి కదా ప్రియుడితో ఎంజాయ్ చేస్తుంది.  ఈ క్రమం లో తమ సంబంధానికి నారాయణ్‌ అడ్డుగా మారడాన్ని భావించిన బంధిత, తన ప్రియుడు విద్యాసాగర్‌తో కలిసి భర్తను హత్య చేయాలని కుట్ర పన్నింది. పథకం ప్రకారము భార్య బంధిత తన ప్రియుడితో కలిసి భర్తను నారాయణ్‌పై  రాడ్డుతో దాడి చేసి హత్య చేసింది. హత్య జరిగిన అనంతరం మృతుడి బంధువులు నాచారం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు భార్య బంధిత పై అనుమానం రావడంతో మృతుడి భార్య బంధితను విచారించగా, ఆమె నేరాన్ని ఒప్పుకున్నది. '' ఆమె ఇచ్చిన సమాచారంతో పాటు సాంకేతిక ఆధారాల సహాయంతో ప్రియుడు విద్యాసాగర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన 24 గంటల లోపే నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు నాచారం పోలీసులు తెలిపారు. వివాహేతర సంబంధాల వల్ల కుటుం బాలు విచ్ఛిన్నమవుతు న్నాయని, ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని పోలీసులు సూచించారు. ఈ కేసు నాచారం ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మూగజీవాల రక్తం అక్రమ సేకరణ చేస్తున్న ముఠా గుట్టు రట్టు

  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధి నాగారం సత్యనారాయణ కాలనీలో అర్ధరాత్రి పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ సంచలనంగా మారింది. రహస్యంగా మేకలు, గొర్రెల వంటి మూగజీవాల రక్తాన్ని అక్రమంగా సేకరించి, బయటకు తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఓ మటన్ షాప్‌ను కేంద్రంగా చేసుకుని మూగజీవాల నుంచి అడ్డగోలుగా రక్తం సేకరిస్తూ, దాన్ని అక్రమంగా విక్రయిస్తున్నట్లు పోలీసులకు  విశ్వసనీయమైన సమాచారం రావడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అర్ధరాత్రి దాడులు నిర్వహించి... మటన్ షాప్ యాజమానితో పాటు నకిలీ వెటర్నరీ డాక్టర్‌ను కూడా అరెస్ట్ చేసి... వారి వద్ద నుంచి  180 రక్తం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.  ఈ రక్తాన్ని ప్లేట్‌లెట్స్ తయారీతో పాటు కొన్ని వ్యాధులను నయం చేస్తామని నమ్మబలికి విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది. అయితే సరైన వైద్య ప్రమాణాలు, అనుమ తులు లేకుండా ఇలా రక్తం సేకరించడం తీవ్రమైన నేరమని అధికారులు స్పష్టం చేశారు. అడ్డగోలుగా మేకలు, గొర్రెల నుంచి రక్తం తీసుకోవడం వల్ల అవి ఒక రోజు తర్వాత మృత్యువాత పడుతున్నాయని జంతు హక్కుల కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఇది మూగజీవాలపై అమానుష చర్యగా పేర్కొంటూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎవరిదైనా ప్రమేయం ఉందా? ఈ రక్తం ఎక్కడికి తరలించేవారు? ఎవరికెవరికీ సరఫరా చేసేవారు? అన్న కోణాల్లో పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు. అక్రమ రక్త వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతామని, ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఉపేక్షించబోమని పోలీసులు హెచ్చరించారు.ఈ ఘటనతో నాగారం సత్యనారాయణ కాలనీలో భయాందోళన వాతావరణం నెలకొంది. మూగజీవాల రక్షణకు కఠిన చర్యలు అవసరమన్న డిమాండ్ మరింత బలపడుతోంది.  

నేడే శ్రీవారి ప్రణయ కలహోత్సవం

  శ్రీ వేంకటేశ్వరస్వామి వారు తన దేవేరులతో క‌లిసి పాల్గొనే కలహ శృంగార భరితమైన ప్రణయ కలహోత్సవం జనవరి 4వ తేదీ తిరుమలలో జరుగనుంది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం 4 గంట‌లకు స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీలపై వేరువేరుగా వైభవోత్సవ మండపం నుండి ఊరేగింపుగా బయలుదేరి శ్రీ వరాహస్వామి ఆలయం వ‌ద్ద‌ ఒకరికొకరు ఎదురేగుతారు.  ఇక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల తరఫున వేరువేరుగా ఆళ్వారు దివ్యప్రబంధంలోని పాశురాలను స్తుతిస్తారు. ఆ తరువాత అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు పూల‌ బంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం నుండి తప్పించుకోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ ప్రణయకలహ మహోత్సవం నిర్వహిస్తారు. అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీలపై వేరువేరుగా వైభవోత్సవ మండపం నుండి ఊరేగింపుగా బయలుదేరి శ్రీ వరాహస్వామి ఆలయం వ‌ద్ద‌ ఒకరికొకరు ఎదురేగుతారు. ఇక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల తరఫున వేరువేరుగా ఆళ్వారు దివ్యప్రబంధంలోని పాశురాలను స్తుతిస్తారు. ఆ తరువాత అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు పూల‌ బంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం నుండి తప్పించుకోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ ప్రణయకలహ మహోత్సవం నిర్వహిస్తారు.  

ఏటీఎం వద్ద మోసాలకు పాల్పడుతున్న అంత రాష్ట్ర ముఠా అరెస్ట్

  హైదరాబాద్ నగరంలో ఏటీఎంల వద్ద కేవలం చదువురాని, వృద్ధులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని వారి దృష్టి మళ్లించి మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను మెహిదీపట్నం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.52,000 నగదు, వివిధ బ్యాంకులకు చెందిన 89 ఏటీఎం కార్డులు, మూడు సెల్‌ఫోన్లు మరియు ఒక ఆటో రిక్షాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన నిందితులు హర్యానాకు చెందిన అమీర్ సుహెల్ @ అమీర్ సోహైల్ @ సోహెల్ (24), ముబారిక్ (26), ముస్తకీమ్ (25)తో పాటు హైదరాబాద్‌కు చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ అమేర్ (33)ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో అమీర్ సుహెల్, ముబారిక్‌లు ప్రధాన నిందితులుగా గుర్తించారు. వివరాల్లోకి వెళితే.... డిసెంబర్ 31న ఆసిఫ్‌నగర్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ అలకుంట వెంకటేష్ (38) ఫిర్యాదు మేరకు ఈ కేసు వెలుగులోకి వచ్చింది. అలకుంట వెంకటేష్ తన తల్లి ఏటీఎం కార్డులో ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలుసుకునేందుకు డిసెంబర్ 28న మల్లేపల్లి ఎక్స్‌రోడ్స్‌లోని ఎస్‌బీఐ ఏటీఎ వెళ్లాడు. కానీ ఇతనికి చదువు రాకపోవడంతో అక్కడున్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల సహాయం కోరాడు. వారు అతని తల్లి ఏటీఎం కార్డు తీసుకుని పిన్ నంబర్ తెలుసుకుని, అందులో 1,32,000 ఉన్నట్లుగా చెప్పారు. అనంతరం నిందితులు కార్డు మార్చిఅలకుంట వెంకటేష్ కు ఇచ్చారు.  కార్డు తీసుకుని వెంకటేష్ వెళ్లిన అనంతరం నిందితులు అసలైన కార్డుతో రూ.40,000 నగదు విత్‌డ్రా చేశారు. అనంతరం వెంకటేష్ తన తల్లి ఫోన్ కు బ్యాంకు నుండి వచ్చిన ఎస్ఎంఎస్ చూసి ఒక్కసారిగా అవాక్క య్యాడు. ఏటీఎం కార్డు తను వద్ద ఉండగా డబ్బులు ఎలా డ్రా అయ్యాయి అని బాగా ఆలోచించిన వెంకటేష్ కు ఏటీఎం కార్డు వద్ద నిందితులే తనను మోసం చేశారని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించగా ఈ ముఠా వ్యవహారం కాస్త వెలుగులోకి వచ్చింది...ఈరోజు జనవరి 3 ఉదయం విజయ్‌నగర్ కాలనీలోని ఏటీఎం వద్ద మరో నేరానికి ప్రయత్నిస్తున్న సమయంలో సమాచారం అందుకున్న మెహిదీపట్నం క్రైమ్ సిబ్బంది నిందితులను పట్టుకున్నారు. విచారణలో వారు ఏటీఎం నేరాలకు పాల్పడుతున్నట్లుగా అంగీకరించారు. ప్రధాన నిందితుడు అమీర్ సుహెల్‌పై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే నాలుగు కేసులు నమోదై ఉండగా, రెండు నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడు ముబారిక్ హర్యానాలో ఆటోమొబైల్ దొంగతనం కేసులో జైలుకు వెళ్లిన చరిత్ర ఉంది.చదువురాని వారు లేదా వృద్ధులు ఏటీఎంల వద్ద డబ్బులు విత్‌డ్రా చేయడం లేదా బ్యాలెన్స్ చెక్ చేసుకునే సమయంలో సహాయం చేస్తామని నమ్మించి, పిన్ నంబర్ తెలుసుకుని, కార్డులను మారుస్తూ ఖాతాల నుంచి డబ్బు కొల్లగొట్టడమే ఈ ముఠా ప్రధాన పద్ధతిగా పోలీసులు వెల్లడించారు.  నిందితులను అరెస్టు చేసి మెహిదీపట్నం పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం. 365/2025 కింద సెక్షన్లు 318(4), 303(2) r/w 3(5) BNS ప్రకారం కేసు నమోదు చేసి నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ప్రజలకు పోలీసుల సూచన ఏటీఎం కార్డును ఎవరికీ ఇవ్వవద్దని, పిన్ నంబర్‌ను  ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని వ్యక్తులకు చెప్పవద్దని పోలీసులు సూచించారు. అవసరమైతే బ్యాంక్ సిబ్బంది సహాయం మాత్రమే తీసుకోవాలని హెచ్చరించారు.

కేసీఆర్ సంతకమే తెలంగాణ పాలిట మరణ శాసనమైంది : సీఎం రేవంత్

  కృష్ణా బేసిన్‌లో రాష్ట్ర ప్రాజెక్టులకు 490 టీఎంసీల కేటాయింపు ఉండేదని శాసన సభలో సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ విడిపోయే ముందు  కిరణ్ కుమార్ సర్కార్ 299 టీఎంసీల అని పేర్కొంది. ఆనాడు ఈఎన్‌సీగా ఉన్న మురళీధర్ రావు కూడా 299 టీఎంసీలే అని తప్పడు నివేదిక ఇచ్చారు. 490 టీఎంసీల కోసం పోరాడాల్సిన మాజీ కేసీఆర్ 299 టీఎంసీలకు అంగీకరిస్తూ సంతకం చేశారు. ఇదే తెలంగాణ పాలిట మరణశాసనంగా మారిందని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.  నిజాలన్ని బయటకు వచ్చే సరికి బహిరంగ సభల పేరుతో డ్రామాలకు తెరతీశారని సీఎం రేవంత్ అన్నారు. బండారం బయటపడుతుందని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. నీళ్లను మీరు తాకట్టు పెట్టి మాపై నిందలు వేస్తున్నారని సీఎం అన్నారు. రాష్ట్ర నీటి హక్కులను కాపాడుకునేందుకు ప్రజలు ప్రత్యేక తెలంగాణ పోరాటం చేశారని ముఖ్యమంత్రి అన్నారు. కృష్ణా జిల్లాల్లో బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయించింది. 2004లో బ్రిజేశ్‌కుమార్  ట్రిబ్యునల్ వేస్తే...2010లో తీర్పు వచ్చింది. ఇంకా ఆ తీర్పుపై 2010 నుంచి పంచాయితీ ఇంకా కొనసాగుతుంది. ఇవాళ కర్ణటక ప్రభుత్వం మళ్లీ అల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు సిద్దమైంది అని అన్నారు.  ఉమ్మడి రాష్ట్రంలో ఉన్పప్పుడే అప్పటి ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో వీలైనన్ని సాగునీటి ప్రాజెక్టులు మంజూరు చేసిందని పేర్కొన్నారు. 2005 నుంచి 2014 నాటికే కృష్ణా బేసిన్​లో ఎస్​ఎల్​బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి, మక్తల్ నారాయణపేట కొడంగల్​, కోయిల్ సాగర్ ​ప్రాజెక్టులు చేపట్టిందని తెలిపారు. 2014లో అధికారం చేపట్టిన బీఆర్​ఎస్ ఈ ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయాల్సిందిపోయి అసంపూర్తిగా వదిలేసిందని పేర్కొన్నారు. కృష్ణా జలాలపై బహిరంగ సభలు కాదు.. సభలోనే చర్చించాలని మేం కెసీఆర్, హరీష్ ను ఆహ్వానించామని.. పదేళ్లు కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోయేందుకు సహకరించి తెలంగాణకు తీరని అన్యాయం చేశారు. వివరాలతో సభలో చర్చిద్దామంటే సభకు రాకుండా వెళ్లిపోయారని ముఖ్యమంత్రి మండిపడ్డారు.