ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ
posted on Apr 2, 2021 @ 12:37PM
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో పరిషత్ ఎన్నికలపై తమ అభిప్రాయాలను నేతలు చంద్రబాబుకు తెలిపారు. ఎన్నికలను బహిష్కరించాలని మెజారిటీ నేతలు సూచించారు. అభ్యర్థులు కూడా పోటీ నుంచి వెనక్కి వచ్చేలా నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఎన్నికల బహిష్కరణపై క్యాడర్‌కు, అభ్యర్థులకు వివరించాలని నేతలు అభిప్రాయం పడ్డారు.
ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు పాల్పడినట్టు భావిస్తున్న టీడీపీ అందుకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎస్ఈసీగా ఉన్నప్పుడే అధికార పార్టీ రెచ్చిపోయిందని, ఇప్పుడు ఆయన లేకుండా జరిగే ఎన్నికలను మరింత దిగజార్చడం ఖాయం అని టీడీపీ అభిప్రాయపడుతోంది. నిన్నటి వరకు ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న నీలం సాహ్నీ తాజాగా ఎస్ఈసీగా రావడంతో టీడీపీ పరిషత్ ఎన్నికల సరళిపై ఓ అంచనాకు వచ్చింది.
మరోవైపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై పార్టీలతో ఎన్నికల సంఘం సమావేశం జరిపింది. ఈ సమావేశానికి వైసీపీ, కాంగ్రెస్, సీపీఎం పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. పరిషత్ ఎన్నికల్లో సహకారంపై ఆయా పార్టీల నేతలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని చర్చించారు.ఎన్నికలపై ముందుగా చర్చించకుండానే ఎస్ఈసీ షెడ్యూల్ ను ప్రకటించడం సరికాదంటూ టీడీపీ, జనసేన, బీజేపీ ఎస్ఈసీ సమావేశానికి దూరంగా ఉన్నాయి. ఇటువంటి నిర్ణయాల వల్ల ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలా జరుగుతాయని ప్రశ్నిస్తున్నాయి.
ఎస్ఈసీ నిర్వహించిన సమావేశానికి హాజరైన కాంగ్రెస్ తమ నిరసనను తెలియజేసింది. సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ఎస్ఈసీకి చెప్పి కాంగ్రెస్ ప్రతినిధి మస్తాన్ వలీ బయటకొచ్చేశారు. తూతూ మంత్రంగా ఎస్ఈసీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిందని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో దౌర్జన్యాలు అరికట్టకుంటే ఎన్నికల ప్రక్రియ ఆషామాషీగా తయారవుతోందన్నారు. భయపెట్టే ఇటీవల ఎన్నికల్లో ఏకపక్షంగా ఫలితాలు వచ్చాయని తెలిపారు.అప్రజాస్వామికంగా నోటిఫికేషన్ విడుదల చేశారని వ్యాఖ్యానించారు. నాలుగు వారాల సమయం తీసుకుని పరిషత్ ఎన్నికల నిర్వహణ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఈసీ ప్రభుత్వ ఏజెంటుగా పని చేయకూడదని సూచించారు. అప్రజాస్వామికంగా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికలను బహిష్కరించాలనేది టీడీపీ నిర్ణయమని...తాము మాత్రం పోటీ చేస్తామని మస్తాన్ వలీ తేల్చిచెప్పారు. అర్థాంతరంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల వెనుక ఎస్ఈసీ ఆంతర్యమేంటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశాక అఖిలపక్ష సమావేశం ఎందుకని ప్రశ్నించారు. ఎస్ఈసీ ఏర్పాటు చేసిన సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని రామకృష్ణ వెల్లడించారు.