పని తక్కువ.. మాటలెక్కువ! పార్టీలోనే పవర్ లేని సునీల్ దేవదర్
posted on Apr 2, 2021 @ 12:16PM
ఇంట గెలిచి రచ్చ గెలవాలి ఇది పెద్దల సామెత.. ఇంట్లో గెలవలేనప్పుడు బయట ఎంత ఫోజులు కొట్టినా ఫలితం ఉండదు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కో ఇంచార్జ్ సునీల్ దేవదర్ పరిస్థితి అచ్చం ఇలానే ఉంది. సొంత రాష్ట్రంలో కనీసం ఒక అసెంబ్లీ టికెట్ ఇప్పించుకోలేని సునీల్.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం తెగ హడావుడి చేసేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థినే ప్రకటించేస్తున్నారు. సునీల్ దేవదర్ మాటలతో ఏపీ బీజేపీ నేతలే షాకవుతున్నారు.
మహారాష్ట్రకు చెందిన సునీల్ దేవదర్ బీజేపీ జాతీయ సెక్రటరీగా ఉన్నారు. త్రిపుర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బీజేపీ సహా ఇంచార్జ్ గా చాలాకాలంగా కొనసాగుతున్నారు. సునీల్ వచ్చాకా ఏపీ బీజేపీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అందుకే అతన్ని ఏపీ కమలం నేతలెవరు పెద్దగా పట్టించుకోవడం లేదు. బీజేపీ పెద్దలకు ఆయనపై నమ్మకం లేదు. అందుకే కొన్ని ఏండ్లుగా సహా ఇంచార్జ్ గానే కొనసాగిస్తున్నారు. నిజానికి ఏపీ బీజేపీకి చాల కాలం ఇంచార్జ్ లేరు. ఆ సమయంలో కూడా సునీల్ కు ఇంచార్జ్ గా ప్రమోషన్ ఇవ్వలేదు బీజేపీ హైకమాండ్. ప్రస్తుత ఇంచార్జ్ గా ఉన్న మురళీదర్ రావు కూడా ఏపీలో ఎక్కువగా తిరగరు. కాని కో ఇంచార్జ్ దేవదర్ మాత్రం ఇక్కడే మకాం వేసి హంగామా చేస్తున్నారు.
ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. తృణామూల్ కాంగ్రెస్ తో బీజేపీ హోరాహోరీగా పోరాడుతోంది. అయినా బెంగాలీ వచ్చినా సునీల్ దేవదర్ ను బెంగాల్ పిలిపించలేదు హైకమాండ్. బెంగాలీ వచ్చిన కొద్ది బీజేపీ జాతీయ నేతల్లో దేవదర్ ఒక్కరు. అయినా అతన్ని ప్రచారానికి పిలవలేదంటే... అతని పనితీరుపై పార్టీ పెద్దలకు ఎంత నమ్మకం ఉందో ఊహించవచ్చు. అలాంటి సునీల్ దేవదర్ ఏపీలో మాత్రం పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారు. దేశ రాజకీయాల్లోనే ఎంతో పేరున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై కూడా ఆరోపణలు, విమర్శలు చేస్తుంటారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తుంటారు.
ఇటీవల తిరుపతిలో జరిగిన సమావేశంలో పవన్ కల్యాణ్ పొగుడుతూ డ్యాన్స్ చేస్తూ మాట్లాడారు సునీల్ దేవదర్. ఆయన ప్రసంగం విన్న బీజేపీ నేతలే ఖంగుతిన్నారట.
సునీల్ దేవదర్ పై ఆరోపణలు భారీగానే వస్తున్నాయి. ఎక్కడికెళ్లినా స్టార్ హోటళ్లలో బస చేస్తూ లోకల్ లీడర్లపై భారం మోపుతారని చెబుతున్నారు. కేంద్ర పరిధిలో ఉన్న నామినేటెడ్ పోస్టులు ఇప్పిస్తామంటూ వసూళ్లకు పాల్పడుతారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుకు వంత పాడుతూ.. ఆయన చెప్పినట్లే చేస్తున్నారని అంటున్నారు. వైసీపీకి అనుకూలమనే ఆరోపణలు ఉన్న సోము వీర్రాజు డైరెక్షన్ లో జగన్ కు మద్దతుగా.. టీడీపీకి వ్యతిరేకంగా సునీల్ దేవదర్ ప్రకటనలు చేస్తున్నారనే విమర్శలు ఏపీ బీజేపీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయకుండా... ప్రతిపక్ష టీడీపీ పై పడితే పార్టీకి వచ్చే ప్రయోజనం ఏంటనే చర్చ బీజేపీ నేతల్లోనే జరుగుతోంది. వైసీపీ నుంచి సునీల్ కు ప్యాకేజీ వెళుతుందని కొందరు ఆరోపిస్తున్నారు.
మొత్తంగా సునీల్ దేవదర్ తీరుతో ఆంధ్రప్రదేశ్ లో పార్టీకి నష్టమేనని కొందరు బీజేపీ నేతలు ఓపెన్ గానే చెబుతున్నారు. వసూళ్ల కోసమే ఇక్కడ హడావుడి చేస్తుంటారని అంటున్నారు. ఇలాంటి నేతలు ఉన్నంతవరకు బీజేపీ ఎదగడం కష్టమంటున్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూసైనా పద్దతి మార్చుకోకపోతే ఎలా అని నిలదీస్తున్నారు. సునీల్ దేవదర్ తీరుపై హైకమాండ్ కు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది.