ఏపీలో జగన్ ఓటమి ఖాయమని చెప్పిన రైజ్ సర్వే!
posted on Jan 8, 2024 @ 2:01PM
ఏపీలో ఎన్నికలకు ఇంకా గట్టిగా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో సర్వే సంస్థలు కూడా ప్రజల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో సంస్థలు ఏపీలో సర్వే చేసి ఫలితాలను వెల్లడించాయి. ఒకటీ అరా మినహా దాదాపు అన్ని సంస్థలు ఏపీలో ఈసారి తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమని తేల్చేశాయి. తాజాగా మరో సర్వే కూడా ఇప్పుడు తెలుగుదేశం, జనసేన కూటమి ఏపీలో అధికారం దక్కించుకోవడం ఖాయమని చెప్పింది. ఏపీలో ఇప్పటికిప్పడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయన్న దానిపై రైజ్ (RISE) అనే సంస్థ సర్వే నిర్వహించింది. లోక్‌సభ స్థానాలకు సంబంధించి ఈ సర్వే నిర్వహించారు. ఏపీలో మొత్తం పాతిక లోక్‌సభ స్థానాలుండగా.. తెలుగుదేశం, జనసేన కూటమి 15 స్థానాలు కైవసం చేసుకోవడం గ్యారంటీ అని రైజ్ సర్వే తేల్చేసింది. ఆలాగే వైసీపీ కేవలం 5 పార్లమెంట్ స్థానాలకు మాత్రమే పరిమితమౌతుందని పేర్కొంది. ఇక మిగిలిన ఐదు పార్లమెంట్ స్థానాలలో వైసీపీ, తెలుగుదేశం మధ్య తీవ్ర పోటీ ఉంటుందని.. ఇందులో మూడు స్థానాలలో టీడీపీ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనీ పేర్కొంది.
ఏపీలో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలుండగా అందులో తెలుగుదేశం,జనసేనలు 15 స్థానాలు గెలుచుకుంటామని రైజ్ సర్వే ఫలితాలలో పేర్కొన్నారు. ఇందులో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోస్తాంధ్రలో ఎక్కువ స్థానాలు ఉన్నాయి. నియోజకవర్గాల వారీగా చూసుకుంటే.. ఉభయ గోదావరి జిల్లాలలో రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, ఏలూరు, నరసాపురం స్థానాలలో తెలుగుదేశం, జనసేన కూటమి గెలుస్తుందని సర్వే పేర్కొంది. కోస్తాంధ్రలో గుంటూరు, విజయవాడ, నెల్లూరు స్థానాలను, అలాగే రాయలసీమలో చిత్తూరు, కర్నూలు, అనంతపురం, హిందూపురంలో నూ తెలుగుదేశం,జనసేన కూటమి విజయం తథ్యమని పేర్కొంది. వైసీపీ అత్యంత కీలకంగా భావిస్తున్న ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి స్థానాలలో టీడీపీ-జనసేన స్థానాలను గెలుచుకోనుంది. ఇక వైసీపీ విషయానికి వస్తే.. ఆ పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఉత్తరాంధ్రలో కేవలం ఒక్క అరకు పార్లమెంట్ స్థానంలో మాత్రమే వైసీపీకి గెలిచే అవకాశాలున్నాయని రైజ్ సర్వే ఫలితం పేర్కొంంది. ఇక రాయలసీమ విషయానికి వస్తే.. కడప, రాజంపేట, నంద్యాలలో మాత్రం వైసీపీకి గెలుపు అవకాశాలున్నాయని, ఇక కోస్తాంధ్రలో వైసీపీ కేవలం ఒంగోలు ఒక్కటే గెలిచే ఛాన్స్ ఉందని రైజ్ సర్వే పేర్కొంది.
ఇక అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర పోటీ ఉండే స్థానాల విషయానికి వస్తే.. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, కోస్తాంధ్రలో నరసరావుపేట, మచిలీపట్నం, బాపట్ల, రాయలసీమలో తిరుపతి పార్లమెంట్ స్థానాలలో గట్టిపోటీ అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే వీటిలో అసెంబ్లీ స్థానాల ప్రభావాన్ని బట్టి బాపట్ల, తిరుపతి, విశాఖపట్నం స్థానాలలో టీడీపీ-జనసేన పార్టీలకు ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. టీడీపీ-జనసేన పార్టీల పొత్తు ప్రభావం కూడా ఈ పోటీ లో గెలుపు ఎవరిదన్న సంగతి తెలుతుందని పేర్కొంది. తెలుగుదేశం, జనసేన పొత్తు ప్రభావం బలంగా పనిచేస్తే కనుక మచిలీపట్నం, విశాఖ స్థానాలు కూడా తెలుగుదేశం కూటమి ఖాతాలో పడే అవకాశం ఉన్నట్లు రైజ్ సర్వే వివరించింది. అలాగే కోస్తాంధ్రలో ఒంగోలు వంటి స్థానాలు కూడా అసెంబ్లీ స్థానాలలో ఫలితాల ఆధారంగానే కూటమిఖాతాలోకే వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
మొత్తంగా చూస్తే తెలుగుదేశం, జనసేన కూటమి రాష్ట్రంలో అత్యధిక పార్లమెంట్ స్థానాలలో విజయకేతనం ఎగురవేస్తుందనీ, అధికార వైసీపీకి ఘోరంగా పరాజయం తప్పదనీ తమ సర్వేలో తేలిందని రైజ్ పేర్కొంది. కేవలం పార్లమెంట్ స్థానాలపై జరిగిన ఈసర్వేలో వైసీపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న రాయలసీమ, ఉత్తరాంధ్రలో కూడా వైసీపీకి ఆశించిన ఫలితాలు దక్కే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థులను మార్చేస్తున్న సంగతి తెలిసిందే. అభ్యర్థులను మార్చినా ఫలితం ఉండదని, దాదాపు 60 శాతం పార్లమెంట్ స్థానాలలో తెలుగుదేశం కూటమి ప్రభావం చూపే అవకాశం ఉందని సర్వే కుండబద్దలు కొట్టినట్లు తెలిపింది. మరో ఇరవై శాతం స్థానాలలో గట్టిపోటీ కనిపిస్తున్నప్పటికీ, ఇక్కడ కూడా కూడా తెలుగుదేశం కూటమివైపే మొగ్గు ఉంటుందని తమ సర్వే చెబుతోందని రైజ్ పేర్కొంది. ఇప్పటికే ఎన్నో సంస్థలు ఇదే తరహా ఫలితాలు వెల్లడించగా.. ఇప్పుడు వెల్లడైన ఈ ఫలితాలతో టీడీపీ-జనసేన విజయం ఖాయమని మరోసారి నిర్ధారణ అయ్యింది.