ఇది కదా యూ టర్న్ అంటే?!
posted on Jan 8, 2024 @ 12:34PM
మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పుకునే వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ తన నాలుగున్నరేళ్ల పాలనలో ఎన్నిసార్లు మడమ తిప్పారో, ఎన్ని సార్లు మాట తప్పారో, రాష్ట్రంలో సామాన్య ప్రజలను అడిగినా చెప్పేస్తారు. అయితే పార్టీలో ఇప్పటి వరకూ ఎవరూ కూడా జగన్ కు ఆ విషయాన్ని చెప్పే ధైర్యం చేయలేదనుకోండి అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఎన్నికల ముంగిట.. వేరే ఓవరో చెప్పాల్సిన అవసరం లేకుండానే ఆయనకు విషయం బోధపడినట్లుగా కనిపిస్తోంది. అందుకే ఇక మాట తప్పడం, మడమ తిప్పడం వంటి సంశయాలు ఎందుకని ఏకంగా యూటర్నే తీసుకున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ జగన్ చెబుతూ వస్తున్న మాట ఏదైనా ఉందంటే.. తన ఫొటో ఉంటే చాలు ఎవరైనా గెలిచేస్తారని, ఇంత కాలం ఆ విషయాన్ని తాను స్వయంగా నమ్మడమే కాకుండా, పార్టీ నేతలను, క్యాడర్ ను కూడా నమ్మిస్తూ వచ్చిన జగన్ ఎన్నికల ముంగిట ఆ నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయినట్లు కనిపిస్తోంది. తన ఫొటో ఉంటే చాలు గెలిచేస్తారన్న నమ్మకం పోయి, మీ సీటు మీరే గెలుచుకోవాలి అంటూ చెప్పుకొస్తున్నారు. అలా అని సిట్టింగుల మీద భరోసా పెట్టి నిశ్చింతగా కూడా ఉండలేకపోతున్నారు. నియోజకవర్గంలో మీ పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని కనుక మిమ్మల్ని మార్చేసి మరొకరికి అవకాశం ఇస్తున్నానని చెబుతున్నారు. అయితే మార్పు అనే వేటు పడిన వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం తమ అధినేత పూర్తిగా యూటర్న్ తీసుకున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పరిశీలకులు సైతం ఇంతకు మించి యూటర్న్ ఉండదని అంటున్నారు. ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలలో పని లేకుండా చేసి.. మీరేం చేయక్కర్లేదు గడపడగపకు వెళ్లి నేను చేసింది చెప్పండి చాలు నా ఫొటోయే మిమ్మల్ని గెలిపిస్తుంది అన్నట్లుగా ఇంత కాలం వ్యవహరించిన జగన్ ఇప్పుడు హఠాత్తుగా మీకు మీమీ నియోజకవర్గాలలో గెలుపు అవకాశాలు లేవు, అందుకే గెలుపు గుర్రాలను తీసుకువస్తున్నాననడం ఏమిటని నిలదీస్తున్నారు.
తన ఫేస్ వాల్యూ పడిపోయిందని జగన్ అందరి ఫేస్ వేల్యూ తీసేయడానికే నిర్ణయించుకున్నారని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ముందుండి గెలిపించలేనని చేతులెత్తేసిన నేత వెనుక ఎందుకు ఉండాలని తిరుగుబాటు చేస్తున్నారు. ఇంత కాలం అధినేత మాటే శిరోధార్యం అన్నట్లుగా ఉన్న ఒక్కొక్కరూ ధిక్కరించి మాట్లాడుతున్నారు. ఎందుకు మారుస్తున్నారంటూ నిలదీస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ ముందే ధర్నాలకు దిగుతున్నారు.
టికెట్ దక్కని వారు ఒకందుకు బాధపడుతుంటే.. నియోజకవర్గం కాదని మరో చోట పోటీకి అవకాశం దక్కిన వారు అందుకు రెండింతలు బాధపడుతున్నారు. తమను అవినీతి పరులుగా, ప్రజా ద్రోహులుగా చిత్రీకరించి మరీ నియోజకవర్గం మార్చేస్తున్నారని ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోర్టులో కేసు ఓడిపోయిన వారు కోర్టు ప్రాంగణంలో ఏడిస్తే.. గెలిచిన వారు ఇంటికి వెళ్లి ఏడ్చారన్నట్లు వచ్చే ఎన్నికలలో జగన్ పార్టీ టికెట్ నిరాకరించి పక్కన పెట్టేసిన వారు జగన్ దగా చేశారని బాధపడుతుంటే.. సొంత నియోజకవర్గంలో మీరు గెలిచే చాన్స్ లేదు.. అంటూ మరో నియోజకవర్గానికి జగన్ బదిలీ చేసిన వారు బయటకు చెప్పుకోలేక, అవమాన భారంతో మౌనంగా రోదిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేకత సాకు చూపి మార్చేయడమంటే..తమ మీద అవినీతి ముద్ర వేయడమేనని రగిలిపోతున్నారు. ఇలా మార్చేసిన వారిలో మంత్రులు కూడా ఉండటం కొసమెరుపు. సొంత కేబినెట్ సహచరులే నియోజకవర్గంలో పట్టు సాధించడంలోనూ, ప్రజా మన్నన పొందడంలోనూ విఫలమయ్యారని స్వయంగా జగన్ చెబుతుండటంతో నియోజకవర్గం మారితే మాత్రం అక్కడ పార్టీ కేడర్ సహకరించే అవకాశం ఏముంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సొంత నియోజకవర్గంలోనే పనికిరానివారిగా పార్టీ అధినేత ముద్ర వేసి మరో నియోజకవర్గానికి పంపిస్తే, అక్కడి పార్టీ క్యాడర్, జనం పనికి రాని, పని చేయని వారు మాకెందుకని దూరంపెట్టరా అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాలు మారిన ఎమ్మెల్యేలు తమ ఓటమి ఖరారైందన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఎలాగా ఓడిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఇక ప్రచారానికి సొమ్ములు తగలేసుకోవడం ఎందుకు అన్న నిర్వేదంలో పడుతున్నారు. కొందరైతే మీరు టికెట్ ఇవ్వకపోయినా ఫరవాలేదు.. మేం మొత్తంగా పోటీకే దూరంగా ఉంటాం కానీ నియోజకవర్గం మాత్రం మారమని నిర్మొహమాటంగా జగన్ కే ముఖం మీద చెప్పేస్తున్నారు. దీంతో టికెట్ దక్కి నియోజకవర్గం మారిన వారు, టికెట్ దక్కని వారూ.. ఆశించి భంగపడ్డవారు ఇలా అందరిలోనూ పార్టీ పట్ల, అధినేత జగన్ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఈ పరిస్థితుల్లో జగన్ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగే వారెవరూ కూడా ఆస్త్రశస్త్రాలు (అంటే క్యాడర్, పార్టీ నేతల సహకారం ఉండదని నిర్ణయించుకునే) లేకుండా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యత నాదే అంటూ చెప్పుకున్న జగన్ ఆ బాధ్యత నుంచి చేతులెత్తేసి యూటర్న్ తీసుకుని నమ్ముకున్నవారిని నట్టేట ముంచేశారని సొంత పార్టీ నేతలే అంటున్నారు.