ఆర్జీవీ జగన్ భజనకు పరాభవం?.. బెడిసికొట్టిన వ్యూహం?
posted on Jan 8, 2024 @ 2:35PM
నిత్యం వివాదాలతో సహవాసం చేసే రామగోపాల్ వర్మకు ఇప్పుడు తత్వం బోధపడినట్లుగా కనిపిస్తుంది. ఎవరేమంటే నాకేం.. నా దారి నాది.. నా తీరు నాది అన్నట్లుగా సామాజిక మాధ్యమంలో చెలరేగిపోయే రామ్ గోపాల్ వర్మ తాజాగా తన x ఖాతాలో పెట్టిన పోస్టు నిర్వేదం , నిస్తేజం , తీవ్ర వేదనలో ఆయన ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఎప్పుడూ ఎవరో ఒకరిని విమర్శిస్తూ , సెటైర్లు వేస్తూ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే వర్మ తాజా ట్వీట్ లో మాత్రం తీవ్ర దుఖ సాగరంలో మునిగిపోయి,
ఆ బాధను వెళ్ళగక్కుకుంటూ చేసిన ట్వీట్ ఆయన గురించి తెలిసినన వారందరినీ విస్తుపోయేలా చేసింది. ఒక్కసారి వర్షం ఆగితే గొడుగు భారం అవుతుంది... ప్రయోజనాలు ఆగిపోయినప్పుడు విధేయత ముగుస్తుంది. ఇది అన్ని రాజకీయాల వెనుక ఉన్న వన్ లైన్ స్టోరీ’ అంటూ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు పెద్ద ఎత్తున రామ్ గోపాల్ వర్మను ట్రోల్ చేస్తున్నారు. వ్యూహం సినిమా రిలీజ్ విషయంలో అనుకున్నది అనుకున్నట్లు జరగలేదు. దీంతో ఏపీ సీఎం జగన్ ఆయనకు గట్టిగా క్లాస్ పీకి, పక్కన పెట్టేసి ఉంటారనీ, దాంతో తత్వం బోధపడి రామ్ గోపాల్ వర్మ తీవ్ర నిరాశలో మునిగిపోయి, సానుభూతి కోసం వెంపర్లాడుతున్నారని నెటిజన్లు అంటున్నారు.
నిన్నటి వరకూ జగన్ భజన చేయడంలో తరించిపోయిన ఆర్జీవీ ఇప్పుడు ఆ జగన్ నుంచే తీవ్ర పరాభవం ఎదుర్కొని ఉంటారనీ అదే ఆ ట్వీట్ సారాంశమనీ అంటున్నారు. రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ లో నేరుగా జగన్ పేరు కానీ, వైపీపీ పార్టీ ప్రస్తావన కానీ తీసుకురాకపోయినా.. ఆట్వీట్ ద్వారా ఆయన వ్యక్తం చేసిన ఆవేదన, బాధ చూస్తే మాత్రం జగన్ ను నుంచి గట్టి పరాభవమే ఎదురై ఉంటుందని నెటిజన్లు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్థులు తెలుగుదేశం పార్టీ, వైసీపీ. గత ఎన్నికల నుంచి రామ్‌గోపాల్‌వర్మ వైసీపీని సమర్థిస్తూ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. 2019 ఎలక్షన్స్ ముందు ఎన్టీఆర్‌కి వ్యతిరేకంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తీసి వార్తల్లో నిలిచాడు. తాజాగా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి అనుకూలంగా ‘వ్యూహం’ అనే సినిమాను రూపొందించాడు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ తెలంగాణ హైకోర్టు దాన్ని నిలిపివేసింది. ఈ నెల 11 వరకు ‘వ్యూహం’ సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌ను సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే రామ్‌గోపాల్‌వర్మ తన x ఖాతా ద్వారా వ్యక్తం చేసిన ఆవేదన వెనుక జగన్ దగానే ఉండి ఉంటుందని రాజకీయ పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ ట్వీట్ పై ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ స్పందించలేదు. వ్యూహం విడుదల విషయంలో ఎదురైనా ఆటంకాలో, మరో కారణమో కానీ జగన్ ఆర్జీవీని కూడా పూచికపుల్లలా తీసి అవతల పారేసి ఉంటారనీ, దీంతో తత్వం బోధపడి ఇప్పుడు మెట్ట వేదాంతంలోకి దిగారని, వర్మ ట్వీట్ సారాంశమదేనని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.