విశాఖ రాజధానికి మద్దతుగా తీర్పులు.. న్యాయమూర్తులకు తమ్మినేని వినతి
posted on Nov 2, 2022 @ 4:11PM
ఉత్తరాంధ్ర వెనుకబాటుకు రాజధానితోనే చెక్ పడుతుందని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం అన్నారు. ఏపీకి ఏకైక రాజధాని విశాఖే అని మంత్రి ధర్మాన అన్నమాటలనే ఇప్పుడు తమ్మినేని మరో డిక్షన్ తో చెప్పారు. మూడు రాజధానులంటూ ఇంత కాలం వైసీపీ సర్కార్ ఆడిందంతా డ్రామానే అని మరో సారి చెప్పకనే చెప్పాశారు. అంతే కాకుండా ఒక అడుగు ముందుకు వేసి విశాఖ రాజధానికి అనుకూలంగా న్యాయమూర్తులు తీర్పులు ఇవ్వాలని బహిరంగ విజ్ణప్తి కూడా చేసేశారు.
ఇప్పటికే మూడు రాజధానులు కాదు విశాఖే ఏకైక రాజధాని అని ధర్మాన వరుస ప్రకటనలు చేయగా, అందకు తగ్గట్టుగానే తాను ఎక్కడ నుంచి పాలన చేస్తే అదే రాజధాని అని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఇప్పుడు అదే బాటలో తమ్మినేని సీతారాం కూడా చేరాడు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వసలలో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన విశాఖ రాజధాని సాధన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో బుధవారం (అక్టోబర్2) ఆయన మాట్లాడారు.
విశాఖపట్నం రాజధాని అయితేనే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోయి అభివృద్ధి చెందుతుందని తమ్మినేని చెప్పారు. పాదయాత్ర సమయంలో ఉత్తరాంధ్ర వెనుకబాటు తనాన్ని గమనించినందువల్లే జగన్ అధికార వికేంద్రీకరణ అంటున్నారని పేర్కొన్నారు. ఇంత కాలం మూడు ప్రాంతాలకూ ఒక్కో రాజధాని అంటూ వచ్చిన వైసీపీ ఇక ముసుగు పూర్తిగా తొలగించేసింది.
ఒకే రాజధాని అదీ విశాఖే అంటూ ముఖ్యమంత్రి సహా మంత్రులు ఒకరి తరువాత ఒకరుగా చెబుతున్నారు. అమరావతి రాజధాని కోసం అంటూ 30 వేల ఎకరాల సమీకరణ కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమేనని తమ్మినేని విమర్శలు గుప్పించారు. ఈ విషయాన్ని గుర్తించి ఉత్తరాంధ్ర వాసులు విశాఖ రాజధానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.