వర్షం తో ఉత్కంఠభరితంగా మారిన మ్యాచ్ లో భారత్ విజయం
posted on Nov 2, 2022 @ 5:58PM
చివరి ఓవర్ వరకూ ఎంతో ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్ చివరి బంతి వరకూ నువ్వా నేనా అన్నంతగా సాగింది. చివరి రెండు ఓవర్లలో బంగ్లాను పరుగులు పెద్దగా చేయకుండా భారత్ బౌలర్లు నిలువరించడంతో భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. బుధవారం మాత్రం మంచి పట్టుగా సాగుతున్న మ్యాచ్ కి వర్షం పెద్ద గండంగా మారింది. బుధవారం మొదటి మ్యాచ్ సమయానికి వర్షం లేకపోవడంతో ఈ రెండో మ్యాచ్ ఎలాంటి అవాంతరం లేకుండా సాగుతుందనే అనుకున్నారు. కానీ బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సమయంలో వర్షం తో కొంత సమయం ఆట నిలిపివేయవలసి వచ్చింది. భారత్ తమ ఇన్నింగ్స్ లో కోహ్లీ, సూర్యకుమార్ ధనాధన్ బ్యాటింగ్ తో 20 ఓవర్లలో 184 పరుగులు చేసి బంగ్లాకు 185 పరుగుల భారీ లక్ష్యాన్ని పెట్టారు. కానీ వర్షం పడిన కారణంగా బంగ్లాదేశ్ లక్స్యం 16 ఓవర్లలో 151 పరుగుల లక్ష్యం విధించారు.
కానీ ఊహించిన దానికంటే బంగ్లా ఓపెనర్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా లింటన్ దాస్ భారత్ పేసర్లను సునాయాసంగా ఎదుర్కొన్నాడు. అతను కేవలం 21 బంతుల్లోనే అర్ధసెంచరీ చేయడంలో అతని బ్యాటింగ్ సత్తాను రుజువుచేశాడు. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిన సమయానికి బంగ్లాదేశ్ డి ఎల్ ఎస్ విధానానికి మౌలిక రన్ రేట్ కి 17 పరుగులు ముందంజలో నిలిచింది. మ్యాచ్ మళ్లీ ఆరంభమయ్యే సమయానికి బంగ్లా 9 ఓవర్లలో 85 పరుగులు చేయలసి వచ్చింది. అంటే రన్ రేట్ 9.44 ఉంది. 8 ఓవర్లో అశ్విన్ బంతిని మిడ్ వికెట్ లోకి అవతలి బ్యాటర్ శాంతన్ ఫోర్ కోసం షాట్ కొట్టాడు. కానీ అక్కడ రాహుల్ బంతిని అందుకుని చక్కటి త్రో చేశాడు. అది నేరుగా స్టంప్ కి తగలడంతో పరుగు కోసం బోర్లా పడిన లిటన్ దాస్ వెనుదిరగాల్సి వచ్చింది. అలా లిట్టన్ దూకుడికి కళ్లెం పడింది. లిట్టన్ దాస్ 27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్ ల సాయంతో 60 పరుగులు చేశాడు. తొలి ఓవర్లలో సరిగా ఆకట్టుకోలేకపోయిన అర్ష్ దీప్ 12 వ ఓవర్లో అద్భుతంగా చేసి కేవలం 2 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అందులో అప్పటికే మంచి ఫామ్ లో ఉండి స్కోర్ చేయగల సత్తా ఉన్న షకీబుల్ ను పెవిలియన్ దారి పట్టించడం ఎంతో హర్షణీయం. అప్పటికి అతను 2 ఓవర్లలో 14 పరుగులిచ్చి 2 వికెట్లు తీసినట్టయింది.
కింగ్ కోహ్లీ మళ్లీ మెరుపులు మెరిపించాడు. బుధవారం గ్రూప్ 2 లో బంగ్లాదేశ్ తో జరిగిన సూపర్ 12 విభాగం నాలుగో మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ కి కోహ్లీ దారులు వేశాడు. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ భారత్ కు ముందుగా బ్యాట్ చేసే అవకాశం ఇచ్చాడు. భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. భారత్ తొలి దశలోనే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. కెప్టెన్ నుంచి ఈమ్యాచ్ లో మంచి స్కోర్ అభిమానులు ఎంతో ఆశించారు. రోహిత్ 2 పరుగులకే ఔట్‌గా వెనుదిరిగాడు. హసన్ మహ్ముద్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి యాసిర్ అలీకి రోహిత్ క్యాచ్‌గా చిక్కడంతో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్లు ఇద్దరూ నిలదొక్కుకుని మిడిలార్డర్‌పై భారం పడకుండా చూడాల్సిన మ్యాచ్‌లో రోహిత్ పేలవ ఆట తీరుతో టీమిండియా అభిమానులను నిరాశపరిచాడు. రోహిత్ పెవిలియన్ చేరగానే రంగంలోకి దిగిన కోహ్లీ అప్పటికే నిలకడగా ఆడుతున్న కె.ఎల్.రాహు ల్ తో కలిసి ఇన్నింగ్స్ ను నిలబెట్టడంతో పాటు స్కోర్ ను పరుగులెత్తించాడు. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో రాణించాడు. 32 బంతుల్లో నాలుగు సిక్స్‌లు, మూడు ఫోర్లతో 50 పరుగులు చేసి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కానీ వెంటనే వెనుదిరిగాడు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లోనూ పర్వాలేదనిపించాడు. 16 బంతుల్లో 30 పరుగులు చేసి ఫోర్ల మీద ఫోర్లు కొడుతూ దూకుడుగా ఆడుతున్న సూర్యను షకీబ్ అల్ హసన్ ఔట్ చేశాడు. అప్పటి వరకూ కోహ్లీ తో కలిసిన యాదవ్ ధాటికి బంగ్లా బౌలర్లు దాసోహం పలికారనే అనాలి. కింగ్ 44 బంతుల్లో 64 పరుగుల చేసి అజేయంగా నిలిచాడు. అడెలైడ్ లో మ్యాచ్ కి వరుణుడి గండం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించినప్పటికీ వరుణుడి కంటే బంగ్లాను కోహ్లీయే భయపెట్టాడు. అతని ధాటికి బౌలర్లు బెంబేలెత్తారు. ఆసీస్ లో మొన్నటి హోటల్ సంఘటన అతని మీద ఎలాంటి ప్రభావం చూపలేదనే అనాలి. ఆట, జట్టును గెలిపించడం మాత్రమే ప్రధానంగా తీసుకోవడాన్ని తన పరుగులవరదతో తెలియ జేశాడు.
ఈ మ్యాచ్ కి రెండు జట్లలోనూ మార్పులు చేర్పులు జరిగాయి. దీపక్ హుడా స్థానంలో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కి అవకాశం కల్పించారు. అయితే ఈ మ్యాచ్ లోనయినా అవకాశం ఇస్తారనుకున్న కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ని మాత్రం మళ్లీ బెంచ్ కే పరిమితం చేశారు. వెన్ను నొప్పితో ఇబ్బందిపడుతున్న కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ కోలుకున్నాడని, అతని అవసరం గుర్తించి పంత్ కు సారీ చెప్పారు. ఈ పర్యాయం ప్రపంచకప్ పోటీల్లో వరుసగా నాలుగో మ్యాచ్ లో పంత్ బెంచ్ కే పరిమితం చేయడం పంత్ వీరాభిమానులు ఎంతో నిరాశచెందారు. కోహ్లీ రాహుల్ కలిసి 25 బంతుల్లో 38 పరుగులు, ఆ తర్వాత కోహ్లీ కార్తిక్ 12 బంతుల్లో 20 పరుగులు, చివర్లో కోహ్లీ అశ్విన్లు 11 బంతుల్లో 27 పరుగులు చేశారు. అదే బంగ్లా ఇన్నింగ్స్ లో లిట్టన్ దాస్, హసన్ లు మొదటి వికెట్ కి 44 బంతుల్లో 66 పరుగులు చేశారు.