తమిళిసై.. ఇది మీకు తగునా..!
posted on Nov 7, 2022 @ 2:37PM
పక్కింటివాళ్లతో గొడవలు పడగూడదు. అందునా, వారితో ఇంకా సంబంధం ఉన్పప్పుడు. మా ఇంటావిడ మహా చిరాకు మనిషి అంటూ అద్దకి ఉన్న ఇల్లాలు గోడ కబుర్లలో పక్కింటావిడకి మాట చేరవేయ కూడదు. ఇక్కడే ఉంటూ ఇక్కడి భాషని, మనుషులను ఇష్టం లేనట్టుగా వ్యాఖ్యానించి తెలంగాణా గవర్నర్ తమిళిసై లేని తలనొప్పిని చుట్టుకున్నారు. తమిళనాడు వెళ్లి తమిళుల పత్రికలో వచ్చిన వ్యాసానికి హెచ్చరికలు చేయడంలో తప్పు లేదు. కానీ తెలుగు రాష్ట్రానికి గవర్న్ గా ఉంటూ తెలుగు వారిని తక్కువచేసి మాట్లాడటమే అసలు గొడవ. తమిళులయినంత మాత్రాన తెలుగువారిని అవ హేళన చేయడమో, అవమానించడమో, కించపరచడాన్నో తెలుగువారు ఎలా భరిస్తారు.
ఎవరికి వారి ప్రాంతాలు, భాష ఇష్టం. రాజకీయపరంగా ఆలోచించినా వేరు రాష్ట్రాల్లో పనిచేసేవారు ఆయా ప్రాంతాల భాష, మనుషులను గౌరవించి ఎంతో కొంత కొత్త అంశాన్ని తెలుసుకుంటారు. కానీ అంటీ అంటనట్టుగా వ్యవహరించే గవర్నర్ గా తమిళిసై నే రాజీకీయ విమర్శకులు పేర్కొన్నారు. కారణం ఆమె పూర్తిగా తమిళనాడు మనిషినని, కేవలం గవర్నర్ గిరీ లో తెలుగు రాష్ట్రంలో ఉండవలసి వస్తోందన్న ధోరణనినే ప్రదర్శిస్తున్నారు. దీనికి తోడు బీజేపీ మనిషి అన్న ముద్ర ఉండనే ఉంది. తెలుగువారు శాంతస్వభావులు గొడవలకు దిగే మనస్తత్వం లేనివారు గనుక పెనుప్రమాదమేమీ ముంచుకురాదు. కానీ అదే తమిళులను ఆమె అవమానించి ఉంటే పరిస్థితులు వేరేగా ఉండే వేమో. అయినా అందరినీ సమానంగా చూడాల్సిన ఉన్నత పదవిలో ఉన్నవారు తక్కవు స్థాయిలో వ్యవహరించడం, ఇతర భాషను కించపరచడమేమిటి? కేవలం తెలుగు మీద అయిష్టతనే తమిళిసై తీరు ప్రదర్శిస్తుంది. తమిళనాడు లో ఉంటున్న,అనాదిగా అక్కడ ఉంటున్న తెలుగు వారెవరూ తమిళులను, తమిళ భాషను అగౌరవంగా చూసిన దాఖలాలు లేవు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉండే తమిళులు తెలుగు పట్ల తెలుగువారి పట్ల అంటీఅంటనట్టుగా నే ఉంటున్నారు. తమిళనాడు ఒక గ్రామంలో ఒక తెలుగు బడిని మూసివేయాలని అక్కడి తమిళులు పట్టబట్టడం గమనార్హం. ఈ ధోరణిని ఉన్నతపదవుల్లో ఉన్నవారు కూడా ప్రదర్శిం చడమే ఊహించని అంశం.
తమిళనాడులు తమిళులుగా నటించేవారున్నారని, వారు వాస్తవానికి తమిళులు కాకున్నా బయట ఎక్కువగా తమిళం మాట్లాడుతూ, ఇంట్లో తెలుగు మాట్లాడుతూ కాలం గడిపేస్తుంటారన్న అభిప్రాయం తమిళిసై వ్యక్తం చేయడంలో ఆంతర్యమేమిటి అన్నది విశ్లేషకులు అడుగుతున్నారు. ఆమె తమిళురాలే కావచ్చు, కానీ ఒక ఉన్నత హోదాలో ఉన్నపుడు పనిచేస్తున్న ప్రాంతీయ భాషను, ప్రాంతీయులను కూడా అంతే స్థాయిలో చూడాలి, గౌరవిం చాలి. కానీ తెలంగాణ గవర్నర్ గా వచ్చినప్పటి నుంచి ప్రభుత్వంతో విభేదాలతోనే కాలం గడుస్తోంది. ముఖ్యమంత్రి చేసే అన్ని సిఫార్సులను గవర్నర్ ఆమో దించాలని లేదని ఆమె గతంలో అన్నారు. రాజ్యాంగ పరిధి కి లోబడే గవర్నర్ విధులు ఉంటాయని, దేన్నయినా విభేదిస్తే ప్రభుత్వం వివాదం చేయడం సరికాదన్నారు. పైగా అన్నింటినీ వ్యక్తి గత వ్యవహారాలకు ఆపాదించరాదనీ తమిళిసై అన్నారు. గవర్నర్ ను ఒక పార్టీకి కట్టుబడి ఉన్నారంటూ ఆఫాదించడం సమంజసం కాదని, ప్రత్యేక ఆహ్వానాలు తిరస్కరించడం అవమానించడమే అవుతుం దని తమిళిసై తెలం గాణా సర్కార్ తీరుపై వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, ఆమెకు అసలు తెలుగువారి మీదనే పెద్దగా గౌరవం లేదన్న అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి.
డీఎంకే నేతలంతా వారి పూర్వీకులు తెలుగువారన్న విషయాన్ని మరుగునపరచి తమిళ భాషాభిమానుల వేషంతో ప్రజలను మోసం చేస్తున్నారని, తాను తెలంగాణా గవర్నర్‌గా అక్కడి శాసనసభలో తిరుక్కురళ్‌ను తమిళంలో పఠించి అసలు సిసలైన తమిళ ఆడపడుచుగా వ్యవహరిస్తున్నానని అన్నారు. ఎక్కడుంటే అక్కడి సంప్రదాయా లను, ఎంతో కొంత ఆ భాషాభిమానాన్ని ప్రదర్శించడంలో తప్పు లేదు. కానీ అది తమిళిసై దృష్టిలో నటన అయి పోయింది. అనాదిగా తమిళనాడులో ఉంటున్న తెలుగు వారు తాము క్రమేపీ తమిళులమే అంటున్నారు. పైగా ఇప్పటి తరం వారు తమిళులమనే అంటున్నారు. వారితో కలిసిపోయారు. తాము తెలుగు వారమన్న ఆలోచనే మర్చిపోయారు. అలాంటి వారి మధ్య విభేదాలు సృష్టించేలా గవర్నర్ కామెంట్ చేయడం దారుణం. తెలుగువారిని తక్కువ చేయడమే అవుతుందని విశ్లేషకుల మాట.
మనసులో తెలుగు పట్ల, తెలుగువారి పట్ల ఏమాత్రం గౌరవం లేనివిధంగా వ్యవహరిస్తున్నవారే తెలుగు పట్ల వీరాభిమానం ఉన్నట్టు నటించడం జరుగుతోంది. తనకు తెలుగు పట్ల, సంప్రదాయాలు, పండుగల పట్ల ఎంతో గౌరవం ఉందని, తనకూ ఎంతో తెలుసునని తెలంగాణా గవర్నర్ గతంలో అన్నారు. కానీ రాజకీయాల దృష్టితోనే చూడడం తో ఆమె అభిప్రాయాల్లోనూ రాజకీయ కోణమే కనపడుతోంది. ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రం అనగానే తెలుగువారితో కలిసిన తమిళులు జీవిస్తున్న సమైక్య మద్రాసు రాష్ట్రమే. కానీ కాలక్రమంలో భాషాప్రాంతాలుగా విడిపోయిన సమ యంలో ఆంధ్రప్రదేశ్ అవతరించి ప్రత్యేకతలు చాటుతోంది. కానీ గవర్నర్ గిరీలో వచ్చినవారెవ్వరూ సమైక్యఆంధ్రా గాని, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన తెలంగాణా ప్రాంతాన్నిగాని తక్కువగా చూడలేదు. తమిళిసై గవర్నర్ గా వచ్చిన క్షణం నుంచే తెలం గాణా ప్రభుత్వంతో విభేదాలు చోటుచేసుకున్నాయి. ఆమె గవర్నర్గా కంటే బీజేపీ మనిషిలా వ్యవహ రిస్తోందన్న ఆరోపణలే ఎక్కువగా వినపడ్డాయి. కేంద్రం మాట మాత్రమే శిరోధార్యం అంటూనే ఇక్కడి ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా లేకపోవడం పరిస్థితులు మరింత విభేదాలకు దారితీయడం అన్నీ ప్రజలు గమనిస్తున్నారు. భాష కంటే రాజకీయ కోణంలోనే ఆమె వ్యవహార శైలి వ్యాఖ్యానిస్తోందని అంద రూ గుర్తించారు.