మునుగోడులో బీజేపీ ఓడిందా..? గెలిచిందా..?
posted on Nov 7, 2022 @ 2:38PM
‘నేను చస్తే.. గెలుస్తానా… మరి ఇది చస్తే.. నేను గెలుస్తానా..?’ నేచురల్ స్టార్ నాని నటించిన ఎంసీఏలో నటి భూమిక పాత్రను ఉద్దేశించి విలన్ చెప్పిన డైలాగ్ ఇది. ఈ డైలాగ్ ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిన బీజేపీకి అతికినట్టు సరిపోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మునుగోడులో హోరాహోరీ పోరాడిన బీజేపీ 10 వేల ఓట్ల పైచిలుకు తేడాతో ఓటమి చవిచూసింది. అయినప్పటికీ నైతికంగా తానే గెలిచానని ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించడం గమనార్హం. అంటే.. ఓట్ల సంఖ్యా పరంగా బీజేపీ ఓడిందే కానీ.. నైతికంగా గెలిచామనేది వారి అభిప్రాయం.
మునుగోడులో తాను ఓడినా.. వచ్చే ఎన్నికల నాటికి 130 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిచే ఛాన్స్ లేదని, ఒక వేళ నిలిచినా ఉన్న కాస్త ప్రతిష్ఠ మంటగలవడం తప్ప మరో ఫలితం ఉండదన్న స్పష్టమైన సందేశాన్ని నియోజకవర్గం ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ విజయం సాధించిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఓట్ల పరంగా గెలవకపోయినా.. కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడం ద్వారా బీజేపీ విజయం సాధించినట్లే అంటున్నారు. తనకు- టీఆర్ఎస్ కు మధ్య మాత్రమే ద్విముఖ పోరు ఉంటుందని, కాంగ్రెస్ పార్టీని బీజేపీ తీసికట్టు మిడతంబొట్లు మాదిరిగా చేసిందంటున్నారు. అలా చూస్తే బీజేపీ తన వ్యూహాన్ని అమలు చేయడంలో సక్సెస్ ఫుల్ గా విజయం సాధించిందనే చెప్పాలంటున్నారు.
గతంలో 2014 ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ 65 వేల 496 ఓట్లు తెచ్చుకుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీపై 38 వేల 55 ఓట్ల బంపర్ మెజార్టీతో గెలిచింది. మళ్లీ 2018లో జరిగిన ఎన్నికల్లో తెరాసప కాంగ్రెస్ పార్టీపై 22 వేల 552 ఓట్ల తేడాతో ఓటమి చవి చూసింది. అప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థికి 74 వేల 687 ఓట్లు పోలయ్యాయి. ఆ ఎన్నికల్లో మునుగోడులో బీజేపీకి లభించిన ఓట్లు కేవలం 12 వేలు మాత్రమే. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలో నిలిచారు. రాజగోపాల్ రెడ్డి పది వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి చవి చూశారు. రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ పార్టీకి, శాసనసభ సభ్యత్వానికీ రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి విదితమే.
హుజురాబాద్ షాక్ లో సీఎం కేసీఆర్ మునుగోడుపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తారని బీజేపీ అధినేతలు ముందే పసిగట్టారు. మునుగోడులో గెలిచేందుకు పార్టీ యంత్రాంగాన్ని, మంత్రులు, ఎమ్మెల్యేలు, మద్యం, మనీ ఇలా ఒకటేమిటి అన్ని విధాలుగా కూడా కేసీఆర్ రంగంలోకి దిగుతారని కూడా బీజేపీ పెద్దలు ముందే అంచనా వేశారు. 2018లో కేవలం 12 వేల ఓట్లు తెచ్చుకోడానికి ఆపసోపాలు పడిన బీజేపీ ఈ ఉప ఎన్నికల్లో 38.4 శాతంతో 86 వేల 697 ఓట్లు రాబట్టుకోవడం అంటే మాటలు కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలా చూసుకున్నప్పుడు బీజేపీ ఈ సారి గ్రాండ్ సక్సెస్ అయినట్టే అని చెబుతున్నారు. సంఖ్యాపరంగా ఓడినా మునుగోడు ఉప ఎన్నికల బరిలోకి బీజేపీ పకడ్బందీ వ్యూహంతోనే దిగిందని చెబుతున్నారు.
ప్రణాళికలు ముందుగానే రచించుకుని, ఆ ప్రకారమే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేత రాజీనామా చేయించింది. రెండు హేమాహేమీ పార్టీలైన టీఆర్ఎస్- బీజేపీ తలపడిన ఈ ఉప ఎన్నికల పోరులో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కకుండా చేసింది. తద్వారా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రభావాన్ని తప్పించడంలో కృతకృత్యం అయిందంటున్నారు. ఇక టీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయం అనేది జనంలోకి చొప్పించేలా చేయగలిగిందని చెబుతున్నారు. ఉప ఎన్నిక సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో షరా మామూలుగానే రచ్చ కొనసాగింది. తొలుత అభ్యర్థి విషయంలో పార్టీలో వివాదం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక మారరు. రేవంత్ రెడ్డికి సీనియర్లు సహకారం అందించలేదు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా లాభం లేదనే అభిప్రాయం జనంలోకి బాగా వెళ్లిపోయింది.
కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా భావించే నల్గొండ జిల్లాలో ఆ పార్టీ నేతల మధ్య రచ్చే పార్టీ ఉనికిని ప్రశ్నార్ధకం చేసిందంటున్నారు. ఇలా మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయేలా చేయడంలో బీజేపీ అగ్రనేతల పాచిక పారిందంటున్నారు. తద్వారా కూడా బీజేపీ విజయం సాధించినట్లే అనే మాట వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని చూపించడంలో ఆ పార్టీ నేతలు గెలిచారనే చెప్పాలని చెబుతున్నారు. టీఆర్ఎస్- బీజేపీ- కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ ఉంటే గులాబీ పార్టీకి కలిసి రావచ్చని.. అందుకే అక్కడ ద్విముఖ పోటీకి రంగం సిద్ధం చేయాలనే వ్యూహాన్ని అమలు చేయడంలో బీజేపీ సక్సెస్ అయిందంటున్నారు. టీఆర్ఎస్ తో ముఖాముఖి తలపడితే తిమ్మిని బమ్మిని చేసి అయినా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించవచ్చనేది బీజేపీ వ్యూహం అంటున్నారు. టీఆర్ఎస్ ను మట్టి కరిపించగల సత్తా బీజేపీకి మాత్రమే ఉందనే సంకేతం పంపడంలో కమలనాథులు విజయం సాధించినట్లే అని చెబుతున్నారు.
ఇప్పుడు ఓడిపోతే పోయింది కానీ.. అధికార టీఆర్ఎస్ పార్టీని మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ గడగడలాడించిందనే చెప్పాలంటున్నారు. ఉప ఎన్నికను సవాల్ గా తీసున్న కేసీఆర్ 14 మంది మంత్రుల్ని, సుమారు వంద మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను రంగంలోకి దింపారు. తనతో సహా బీజేపీతో ఒక యుద్ధమే చేశారని చెప్పొచ్చు. అంటే టీఆర్ఎస్ పార్టీ బీజేపీని చూసి ఎంతలా వణికిపోతోందో చెప్పకుండానే చెప్పిందంటున్నారు. ఉప ఎన్నికలో బీజేపీ ఓడినప్పటికీ.. వ్యూహాత్మకంగా గెలిచిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే సీఎం స్వయంగాను, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే కాకుండా మొత్తం పార్టీని ఇంతలా మోహరించినప్పటికీ టీఆర్ఎస్ పార్టీ తక్కువ మెజార్టీ పరిమితం చేయడంలో బీజేపీ గెలిచిందంటున్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఉన్న సీపీఐ, సీపీఎం ఓట్ల వల్లే టీఆర్ఎస్ కు ఆ మాత్రం మెజారిటీ వచ్చిందంటున్నారు. లేదంటే టీఆర్ఎస్ పరిస్థితి ఇరకాటంలో పడేదనే అభిప్రాయాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్లడంలో బీజేపీ సక్సెస్ అయిందని చెబుతున్నారు.