Read more!

మతం గురించి వివేకానంద చెప్పిన మాటలు ఏంటంటే..

ఈ ప్రపంచంలో మతానికున్న శక్తి చాలా పెద్దది. కొందరు మతాన్ని ఆయుధంగా మలచుకుంటారు. ప్రపంచాన్ని అయోమయంలోకి తోస్తారు. భారతదేశం భిన్న మతాల సమ్మేళనం. అయితే ఈ మతాల కొట్లాటలు ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ. ఈ మతం గురించి స్వామి వివేకానంద చెప్పిన మాటలు వింటే మతం గురించి అందరికీ అవగాహన వస్తుంది. వివేకానంద ఏమి చెప్పాడంటే…

మతం యొక్క అసలు రహస్యం ఆచరణ రూపంలో నిరూపితమవుతుంది కానీ సిద్ధాంతాల్లో కాదు. మంచిగా నడచుకోవడం, మంచిని ఆచరించడం అదే మత సారాంశం. భగవన్నామాన్ని బిగ్గరగా అరవడం మతం కాదు. భగవానుని నిర్ణయాలను అమలు చేయడమే నిజమైన మతం.

నైతిక పథంలో వ్యక్తి సంచరించాలి. వీరోచితంగా నడచుకోవాలి. హృదయపూర్వకంగా కర్తవ్యాన్ని నిర్వహించాలి. సడలని నైతిక పథంలో, భయమెరుగని సాహసంతో వ్యక్తి జీవించాలి.

వ్యక్తి పవిత్రాత్ముడైతే అతడు అపవిత్రతను దర్శించలేడు. దానికి కారణం అతని అంతరంగ ప్రవృత్తే బాహ్యంలో ప్రతిబింబించడం. మన లోపల మలినం ఉంటే తప్ప బాహ్యప్రపంచంలో మలినాన్ని చూడలేం. ఈ విజ్ఞానాంశాన్ని ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాల్లో అనుసరించడం శ్రేయస్కరం.

సర్వజన సంక్షేమం, నైతిక పథ గమనం సాధించాలంటే ముఖ్యంగా స్వార్థరాహిత్యాన్ని అవలంబించాలి. 'నీ కొరకు నేను, నా కొరకు కాదు' అనే భావాన్ని ప్రతి వ్యక్తీ అలవరచుకోవాలి. స్వర్గం, నరకం అనేవి ఉన్నాయో లేవో ఎవరికీ అవసరం లేదు. ఆత్మ పదార్థమనేది ఉందో, లేదో ఆలోచించాల్సిన పని లేదు. 'చిత్తు, సత్తు' అంటూ వాటిని గురించి వితర్కించుకోవాల్సిన పని లేదు. మన ఎదురుగా కనిపించే ప్రపంచాన్ని గురించి మాత్రమే మనం విచారించాలి. ఈ ప్రపంచం అంతా దుఃఖ భూయిష్ఠంగా ఉంది. బుద్ధుడి లాగే మనం కూడా ప్రపంచంలో సంచరించి, ప్రజల కష్టాల్ని రూపుమాపడానికి శాయశక్తులా కృషి చేయాలి. ఆ ఉద్యమంలో మనం ఆత్మాహుతికి కూడా సిద్ధమవ్వాలి. ఒక వ్యక్తి నాస్తికుడా, ఆస్తికుడా, భౌతికవాదా, వేదాంతా, క్రైస్తవుడా, మహమ్మ దీయుడా అని విచారించాల్సిన పని లేదు.

పరోపకారం పరమోత్కృష్ట ధర్మం. అలాగే పరపీడనం పరమ నికృష్టకార్యం. పరులను ప్రేమించడం ఉత్తమ లక్షణం కాగా, ఇతరులను ద్వేషించడం హైన్యం. దైవశక్తి పట్ల విశ్వాసం, ఆత్మ విశ్వాసం సద్గుణాలు అవుతాయి. సంశయించే ప్రవృత్తి పాపంగా పరిగణిత మవుతుంది. సమైక్యభావం శ్లాఘనీయం. భేదభావం నైచ్యం అవుతుంది.

ఇదీ విలివేకానందుడు చెప్పిన మాటలు..

*నిశ్శబ్ద.