Read more!

వాడు చెప్పేది నేను వినడం ఏంటి? అనే ఆలోచనలో మీరూ ఉన్నారా? అయితే ఇది చదవండి!

ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వినడమనేది ఎప్పుడో పోయింది. పరుగులు పెట్టే జీవితంలో ఎవరికీ పక్కవాళ్లు చెప్పేది ఎంతటి విషయమైనా సరే ఏకాగ్రతతో వినే తీరిక, ఓపిక - రెండూ లేవు. వాళ్ళ దోవన వాళ్ళు చెప్పుకుపోతుంటే మన దోవన మనం ఏదో ఆలోచిస్తుంటాం. కాలక్షేపం బాతాఖానీలు, కబుర్లూ అయితే మనస్సుపెట్టి వినకపోయినా ఫరవాలేదు కానీ ఇతరత్రా ఏ మంచి విషయమైనా శ్రద్ధగా వినాలి. 'శ్రద్ధావాన్ లభతే జ్ఞానమ్' అని భగవద్గీతలో కృష్ణుడు అంటాడు.

అధికారంలో ఉన్నవాళ్ళు, కింద వాళ్ళ పట్ల శ్రద్ధ కనబరిచి వాళ్ళు చెప్పేది సహనంతో వింటే ఉత్తమ పాలకులూ, ఉత్తమ అధికారులూ అవుతారు. నవ విధ భక్తిమార్గాలలో కూడా శ్రవణానికే మొదటి స్థానం కల్పించారు. శ్రవణం సరిగ్గా ఉంటే, మిగిలినవన్నీ తేలిగ్గా సిద్ధిస్తాయి. శ్రవణం అంటే వినడం. ఆ వినడమేదో శ్రద్ధగా వినాలి.

భావప్రసారమంటే వ్రాయడం, మాట్లాడడం, సంభాషించడమే కాదు, వినడం కూడా! ఇతరులు చెప్పింది సరిగ్గా వినక పోవడం వల్ల మనఃస్పర్థలు వస్తాయి. 'శ్రద్ధయా శ్రవణం కుర్యాత్. శ్రద్ధతో వినాలని శాస్త్రం చెబుతోంది. శ్రవణమే జ్ఞానానికి తొలి మెట్టు. అది లేకుంటే జ్ఞానం ఉదయించదు. విషయాన్ని కూలంకషంగా తెలుసు కోవాలంటే ఓపిగ్గా వినాలి.

ప్రహ్లాదుడి కథ మనందరికీ తెలుసు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారాయణ మంత్రాన్ని తల్లి లీలావతికి నారదమహర్షి ఉపదేశిస్తుండగా శ్రద్ధగా విన్నాడు కాబట్టే విష్ణుభక్తుల్లో అగ్రగణ్యుడయ్యాడు.

వినదగు నెవ్వరు చెప్పిన 
వినినంతనె వేగపడక వివరింపదగుస్
కని కల్ల నిజము దెలిసిన 
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!

ఎవరు చెప్పినా వినాలి. వినగానే తొందరపడకుండా ముందు వెనుకలు ఆలోచించి, మంచిచెడ్డలు విచారించి, నిజానిజాలు తెలుసుకొని, తెలివిగా వ్యవహరించాలి. అలాంటి వాడే నిజమైన వివేకవంతుడని సుమతీ శతకకారుడు బద్దెన చెప్పాడు. అందరూ అలవరచు కోవలసిన మంచి గుణమిది.

ఎవరు ఏం చెప్పి ఉద్రేకాలకు, ఉద్వేగాలకు లోను కాకుండా శాంతంగా వినాలి. వాస్తవ దృక్పథంతో వినాలి. ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాలతో ఏదీ వినకూడదు. అలాగే చెప్పేది పూర్తిగా వినకుండా ఏ నిర్ణయానికీ రాకూడదు. ఎవరైనా ఏదైనా చెబుతున్నప్పుడు మధ్యలో అడ్డుపడడం మంచిది కాదు. అలా చేయడం వల్ల ఏకాగ్రత దెబ్బతిని ముఖ్యమైన విషయమేదో వినకుండా పోయే ప్రమాదం ఉంటుంది. మనం ఎదుటివారికి ఏదైనా చెబుతున్నప్పుడు వాళ్ళ నుంచి సానుకూల స్పందన కోరుకుంటాం. అలాగే ఎవరైనా! నచ్చితే మెచ్చుకోలు మాట ఏదైనా అనండి. కనీసం తల ఆడించండి. ఓ చిరునవ్వు నవ్వండి. నచ్చకపోతే మాత్రం మెత్తగా, అన్యాపదేశంగా చెప్పండి. కటువుగా చెప్పకండి. దీనిని పాటించడం వల్ల మనకూ చెప్పేవారికీ మధ్య  సదవగాహన, సద్భావన పెరుగుతాయి. అన్నిటికన్నా ముఖ్యం.. వినేవాడికి చెప్పేవాడు లోకువ కాదని తెలుసుకోండి. పక్కవాడు చెప్పేది శ్రద్ధగా వింటేనే మనకు గ్రహణశక్తీ, సహనమూ పెరిగేది.

*నిశ్శబ్ద.