ప్రశ్నిస్తే .. మండిపాటు!
posted on Jul 27, 2022 @ 10:15AM
పాలన బాగుంటే ప్రజలు ప్రశ్నించరు. పాలనలో లోపాల్ని, ప్రజాసంక్షేమ పథకాల అమలులో లోపాల్ని ప్రజలు ప్రశ్నిస్తారు. దానికి సరయిన వివరణా బాధ్యతా ప్రభుత్వానిదే. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అందుకు చాలా భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఆయన్ను ఎవరు విద్యావిధానాన్ని ప్రశ్నించినా అది మీకు సంబంధించినది కాదంటున్నారు. పైగా టీచర్లు, ట్రాన్సఫర్ల విషయం ప్రభుత్వానికి సంబంధించినది కానీ చీటికీ మాటీకీ దాన్ని గురించి అడగవద్దని చిరాకుపడటం చూస్తున్నాం. టీచర్లకు సంబంధించింది టీచర్లు, వారి యూనియన్‌వారు అడగక పురపా లక పనులు చేసేవారు అడుగుతారా?
ఎన్నడూ లేనివిధంగా మంచి సంస్కరణలు చేపడుతున్నామని, క్లాసుకు విద్యార్ధులు ఉన్న సంఖ్యకు తగ్గట్టుగానే ఉపాధ్యాయులు ఉండడం అనాదిగా ఉన్నదని పెద్ద ఉపోద్ఘాతమే ఇస్తున్నారు మంత్రి వర్యు లు. పైగా ప్రభుత్వపాఠశాలలను గురించి ప్రశ్నించే బదులు ప్రైవేటు స్కూళ్లపట్ల మీ వ్యామోహం దేనికని ఎదురు ప్రశ్నలూ సంధించారు. కానీ అదే ప్రశ్న ప్రజల నుంచి వస్తే మాత్రం తప్పించుకునే మార్గాలు సవాలక్ష వెతుక్కుంటున్నది ప్రభుత్వం.
ప్రభుత్వం సైతం అమ్మ ఒడిని ప్రైవేట్ పాఠశాలలకు వర్తింపచేయడం ద్వారా ఏమి సందేశం ఇస్తోందని కూడా జనాల నుంచి సూటిగానే ప్రశ్నలు వస్తున్నాయి. అంటే ప్రైవేట్ లో చదువుకున్నా అభ్యంతరం లేదనే కదా. మరి అలాంటపుడు కేవలం టీచర్లనే టార్గెట్ చేస్తూ మంత్రి గారు విమర్శలు చేయడంతో సహేతుకత ఎంతవరకూ ఉంది అని కూడా విమర్శలు వస్తున్నాయి.
ఇక టీచర్లు అడిగింది తమ బిడ్డల గురించి కాదు అని మంత్రి గారే అంటున్నారు. ఆ బడుగుల బిడ్డల కోసమే ప్రభుత్వం పనిచేస్తోంది అన్నపుడు వారికి పాఠశాల విలీనం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను కూడా గుర్తించాలి కదా అన్న మాట వస్తోంది. మొత్తానికి చూస్తే బొత్స ఒక మాట అనడం కాదు కానీ ఇపుడు దాని మీద అనేకానేక ప్రశ్నలు వచ్చేశాయి. అన్నింటికీ తల ఆడిస్తూ అన్నీ విన్నాను, అన్నీ చేస్తాం, పరి స్థితులు తెలిసీ ప్రశ్నించడంలో అర్ధంలేదన్న ధోరణినే ప్రభుత్వం అవలంబిస్తోంది. రాను రాను కొరక రాని కొయ్యలా మారుతున్న ప్రభుత్వం పట్ల ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు. ఎంతో కీలకమైన విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేయడం జగన్ పాలనను విస్పష్టం చేస్తున్నది.