ఎంపీ రఘురామ రాజుకు బెయిల్
posted on May 21, 2021 @ 5:10PM
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు బెయిల్ వచ్చింది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.రఘురామ రాజుకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఎంపీ రఘురామకృష్ణ రాజు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో హోరాహారీగా వాదనలు జరిగాయి. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం... బెయిల్ కోసం రఘురామ సుప్రీంకోర్టుకు రావడం సరైనదేనని వ్యాఖ్యానించింది. సొంత పూచీకత్తు, ఇద్దరు జామీనుదారులతో, లక్ష రూపాయల షూరిటీ బాండ్లతో బెయిల్ తీసుకోవచ్చని పేర్కొంది. గుంటూరు సీఐడీ కోర్టులో వీటిని దాఖలు చేసి బెయిల్ తీసుకోవాలని సూచించింది. దర్యాప్తు అధికారి పిలిస్తే విచారణకు వెళ్లాలని రఘురామకు సూచించింది. విచారణ అధికారి 24 గంటల ముందు నోటీసు ఇచ్చి విచారణకు పిలవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయవాది సమక్షంలో విచారణ జరగాలని సూచించింది. మీడియాతో మాట్లాడవద్దని రఘురామ రాజుకు సూచించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. దర్యాప్తును ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. మీడియా, సోషల్ మీడియాలో ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది.
సుప్రీంకోర్టులో రఘురామ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. టార్చర్ పెట్టి మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారని రఘురామ తనతో చెప్పారని ఆయన అన్నారు. చాలా సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదయ్యిందని రోహత్గి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిలో సెక్షన్ 124ఏ చాలా ముఖ్యమైందని .. బెయిల్ రాకూడదనే ఉద్దేశంతోనే సెక్షన్ 124ఏ కింద నమోదు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సీఎంపై డజన్‌కు పైగా కేసులు ఉన్నాయన్నారు. రఘురామకృష్ణరాజు ఏపీలో అధికార పార్టీకి చెందిన ఎంపీ అని.. ప్రభుత్వానికి, సీఎంకు అనేక విషయాల్లో సూచనలు చేశారని రోహత్గి వాదించారు.
ఏపీ సీఐడీ తరపున వాదించారు దుష్యంత్ దవే. ఆర్మీ ఆస్పత్రి నివేదికతో తాము విభేదించడం లేదు. ఆర్మీ ఆస్పత్రి నివేదికలో గాయాలకు గల కారణాలు లేవు. గుజరాత్ సొసైటీ కేసు ఆధారంగా బెయిల్ పిటిషన్ కొట్టివేయాలి. హైకోర్టులో ఇంకా మెరిట్ ఆధారంగా నిర్ణయం తీసుకోలేదు. అలాంటప్పుడు దాన్ని సవాలు చేస్తూ సుప్రీంలో ఎలా పిటిషన్ దాఖలు చేస్తారు?.. ఆయన రెండు వర్గాలమధ్య రెచ్చగొట్టేలా మాట్లాడారని అన్నారు. సీఐడీ అధికారులు ఎంపీకి సంబంధించిన 45 వీడియోలు సేకరించి విచారణ చేశారు. కులం, మతం ఆధారంగా సమాజంలో అలజడి సృష్టించేందుకు రఘురామ ప్రయత్నించారు. ఇవన్నీ రాజద్రోహం కిందికే వస్తాయి’’ అని దవే కోర్టుకు వెల్లడించారు. రఘురామకృష్ణరాజు ఎంపీ అని ముకుల్ రోహత్గీ పదేపదే చెబుతున్నారనీ, చట్టం అందరికీ ఒక్కటేనని దవే అన్నారు. ఎంపీ అయినంత మాత్రాన ప్రజలను రెచ్చగొట్టేందుకు లైసెన్స్ ఇచ్చినట్లు కాదన్నారు. హైకోర్టు బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లమని చెప్పిందని, ఎంపీ అయినంత మాత్రాన బైపాస్‌లో నేరుగా సుప్రీం కోర్టుకు ఎలా వస్తారు? అని దవే కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.