సభాహక్కుల కమిటీకి రఘురామ ఎపిసోడ్.. హోంశాఖ నివేదిక కోరిన స్పీకర్..
posted on May 21, 2021 @ 4:33PM
ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్, సీఐడీ కస్టడీలో భౌతిక దాడి ఆరోపణల కేసు ఢిల్లీ స్థాయిలో దద్దరిల్లుతోంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో రఘురామ కాలి గాయాలు, బెయిల్‌పై వాడివేడి వాదనలు జరిగాయి. అటు.. లోక్‌సభ స్పీకర్ సైతం రంగంలోకి దిగారు. రఘురామ కేసులో తదుపరి చర్యలకు సిద్దమయ్యారు. ఎంపీ రఘురామ కుటుంబసభ్యుల ఫిర్యాదుపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. రఘురామ కుటుంబీకుల ఫిర్యాదును సభాహక్కుల కమిటీకి స్పీకర్ పంపారు. రఘురామ అంశంపై వెంటనే నివేదిక ఇవ్వాలని హోంశాఖను కోరారు. ఫిర్యాదు కాపీని హోంశాఖకు లోక్‌సభ స్పీకర్ కార్యాలయం పంపింది.
అక్రమాస్తుల కేసులో సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ వేశారన్న కక్షతోనే రాజద్రోహం కేసు పెట్టారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమకు ప్రాణభయం ఉందని.. జోక్యం చేసుకుని న్యాయం చేయాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు.ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను ఎంపీ రఘురామ భార్య రమాదేవి, కుమారుడు భరత్, కుమార్తె ఇందిరా ప్రియదర్శిని కలిసారు. రాఘురామపై ఏపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని చెప్పారు. ఏపీ సీఐడీ చర్యలను, కోర్టు ధిక్కారాన్ని ఓం బిర్లాకు వివరించారు. పార్లమెంట్ సభ్యునిగా ఉన్న ఒక వ్యక్తిని అరెస్టు చేసేముందు స్పీకర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని, అయితే ఎలాంటి అనుమతి తీసుకోకుండా రఘురామను అరెస్టు చేశారని ఓం బిర్లాకు వివరించారు.
సీఐడీ కస్టడీలో ఉన్న ఎంపీని చిత్రహింసలకు గురిచేశారని రఘురామ కుటుంబసభ్యులు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. రాఘురామకు ప్రాణహాని ఉందని, ఈ విషయంలో స్పీకర్ జోక్యం చేసుకోవాలని కోరారు. రఘురామ కుటుంబసభ్యుల ఫిర్యాదుపై ఓం బిర్లా సానుకూలంగా స్పందించారు. చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటానని అప్పుడు వారికి హామీ ఇచ్చారు. తాజాగా.. రఘురామ కుటుంబీకుల ఫిర్యాదును సభాహక్కుల కమిటీకి స్పీకర్ పంపారు. రఘురామ అంశంపై వెంటనే నివేదిక ఇవ్వాలని హోంశాఖను కోరారు.