కరోనా ఆయుర్వేద ఆనందయ్యపై కేసు
posted on May 21, 2021 @ 6:19PM
నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఆయుర్వేదం కోవిడ్ మందు కోసం పలు ప్రాంతాల నుంచి వేలాది మంది జనం తరలివస్తున్నారు. పలు ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీ చేసి ఆక్సిజన్ పెట్టుకుని మరీ కోవిడ్ రోగులు ముత్తుకూరుకు వస్తున్నారు. దీంతో జనాలను కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కావడం లేదు. తోపులాటలు జరగడంతో లాఠీ చార్జ్ చేసి అదుపు చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఆయుర్వేద ఆనందయ్యపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. జనం ఎక్కువగా గుమిగూడారని ఆఫీస్‌కు పిలిపించి ఎస్పీ మాట్లాడారు.
కృష్ణపట్నం పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమ్రోగుతోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు అక్కడ ఉచితంగా మందు పంపిణీ చేస్తున్నారు. ఆనందయ్యకు ఆయుర్వేదంపై ఉన్న పట్టుతో అతను మందును కనిపెట్టారు. కరోనాకు మందు ఇస్తున్నారన్న విషయంతో జనం తండోపతండాలుగా అక్కడికి వస్తున్నారు. ఇటీవల లోకాయుక్త ఆదేశాలతో అధికారులు మందు పంపిణీని నిలిపివేశారు. అయితే మందుపై ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. దీంతో శుక్రవారం నుంచి మళ్లీ మందు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు.
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య తయారు చేసిన కరోనా నివారణ ఔషధంపై సీఎం జగన్ కూడా దృష్టి సారించి, శాస్త్రీయ అధ్యయనం అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో, నెల్లూరు జిల్లా యంత్రాంగం ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీని నిలిపివేసింది. దీనిపై నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు వివరణ ఇచ్చారు. మూలికా ఔషధం పంపిణీ ఆపివేశామని, ఈ ఔషధం తాలూకు శాంపిళ్లను డీఎంహెచ్ఓ, ఆయుష్ అధికారులు హైదరాబాదులోని ఓ ప్రయోగశాలకు పంపారని వెల్లడించారు. దీనిపై ఐసీఎంఆర్ శాస్త్రీయ పరిశోధన చేయాల్సి ఉందని, ఆ పరిశోధనలో వెల్లడయ్యే అంశాల ఆధారంగానే... ఆయుర్వేదం మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయిస్తామని తెలిపారు. అప్పటివరకు మందు పంపిణీకి అనుమతి లేదని స్పష్టం చేశారు.
ఆనందయ్య మందుకు రెండ్రోజుల్లో అనుమతులు వస్తాయని ఎమ్మెల్యే కాకాణి తెలిపారు. అనుమతులు వస్తే ఇతర రాష్ట్రాలకు కొరియర్ ఛార్జీలు భరించి.. తాము మందు పంపుతామని చెప్పారు.
ఇప్పటికే వేల మందికి ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ చేశారని, ఎక్కడా సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మందు అద్భుతంగా పనిచేస్తుందని కరోనా బాధితులు చెబుతున్నారన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కరోనా మందు కోసం ఎవరూ రావద్దని ఎమ్మెల్యే కాకాని అన్నారు. వేల మంది రావడం వల్ల పోలీసులు కూడా నియంత్రించలేని పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఈరోజు సాయంత్రానికి ఆయుష్ అనుమతులు కూడా వస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ప్రభుత్వ అనుమతులు, క్లీన్ చిట్ వస్తే ఇతర రాష్ట్రాల వారికి కొరియర్ చార్జీలు కూడా తామే భరించి మందులు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే కాకాని స్పష్టం చేశారు.
ఆనందయ్య మందు పంపిణీని ఆపేది మీరే..ప్రారంభిస్తున్నామని ప్రకటించేది మీరే..తిరిగి లాఠీచార్జీ చేసేది మీరేనా అని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.
సాఫీగా సాగిపోయే కార్యక్రమాన్ని గందరగోళం చేయకండని అధికారులు, ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. అసలు ఆయుర్వేదం మందు పంపిణీని ఎందుకు ఆపాల్సివచ్చిందని సోమిరెడ్డి ప్రశ్నించారు. తిరిగి ప్రారంభించేటప్పుడు ఒక్క పద్ధతి ప్రకారం ఎందుకు చేయలేకపోయారని నిలదీశారు. ఆనందయ్య రోజుకు ఎంత మందికి ఇవ్వగలరో ఆలోచించి టైమ్ స్లాట్ ప్రకారం కూపన్లు ఇచ్చే అంశం ఎందుకు పరిశీలించలేకపోయారని సోమిరెడ్డి మండిపడ్డారు. ప్రజల ప్రాణాలను కాపాడలనే మంచి ఉద్దేశంతో ఆనందయ్య ఉచితంగా చేపట్టిన కార్యక్రమాన్ని గందరగోళం చేసేశారని విమర్శించారు. పెద్దాసుపత్రి క్యాజువాలిటీ బ్యాక్ మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది..ఆస్పత్రిలో చేసే వైద్యం కన్నా ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేదం మందుపై ప్రజలకు నమ్మకం పెరిగిందని సోమిరెడ్డి తెలిపారు. నెల్లూరులో ఏసీ స్టేడియం లేదా వీఆర్సీ మైదానంలో, లేదంటే కృష్ణపట్నంలోనే ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.