అసదుద్దీన్ పై రాళ్ల దాడి.. మోడీ రాష్ట్రంలో శాంతి భద్రతలు అధ్వానం
posted on Nov 8, 2022 @ 4:07PM
అసదుద్దీన్ లక్ష్యంగా మరోసారి దాడి జరిగింది. ఈ సారి ఈ దాడి సూరత్ సమీపంలో సూరత్ సమీపంలో జరిగింది. గుజరాత్ లో ఎన్నికల ప్రచారంలో ఉన్న అసదుద్దీన్ ఒవైసీ అహ్మదాబాద్ నుంచి సూరత్ వెళుతుండగా ఈ దాడి జరిగింది. అసదుద్దీన్ ఒవైసీ ఆహ్మదాబాద్ నుంచి సూరత్ కు వందేభారత్ రైలులో ప్రయాణిస్తుండగా, సూరత్ కు పాతిక కిలోమీటర్ల దూరంలో ఆయన కూర్చుని ఉన్న బోగీ లక్ష్యంగా దుండగులు రాళ్ల దాడికి పాలప్పడ్డారు.
ఈ దాడిలో ఆయన ప్రయాణిస్తున్న బోగీ కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడిని ఎంఐఎం నేత వారిస్ పఠాన్ ధృవీకరిస్తూ ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్వీట్ చేశారు. కాగా అసదుద్దీన్ పై దాడి జరగడం ఇదే తొలి సారి కాదు. రెండేళ్ల కిందట ఆయనపై యూపీలో దాడి జరిగింది. యూపీలోని మీరట్ లో ఆయన ప్రయాణిస్తున్న కారుపై ఫిబ్రవరి 3, 2020న దుండగులు కాల్పులకు తెగబడ్డాడు. అప్పుడు కాల్పులు జరిగిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా తాజాగా ఆయన ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి జరిగింది.
ఈ దాడిని ఎంఐఎం ఖండించింది. ఇటువంటి దాడులతో తమను బయపెట్టలేరని ఎంఐఎం నేత వారిస్ పఠాన్ పేర్కొన్నారు. మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్ లో శాంతి భద్రతల పరిస్థితి అద్వానంగా ఉందనడానికి ఈ దాడే నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వచ్చే నెల రెండు విడతలలో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. గుజరాత్ లో ఎంఐఎం బరిలోకి దిగుతున్నది. రాష్ట్రంలో కనీసం పాతిక నియోజకవర్గాలలో తమ పార్టీ అభ్యర్థులు రంగంలో ఉంటారని అసదుద్దీన్ ఒవైసీ ఇప్పటికే ప్రకటించారు. ఆ ఏర్పాట్లలో భాగంగానే ఆయన అహ్మదాబాద్ నుంచి సూరత్ వెళుతుండగా ఈ దాడి జరిగింది.