అమెలా.. నా చెల్లి
posted on Nov 8, 2022 @ 4:11PM
ఐదారేళ్ల వయసు పిల్లలు కొత్తవారు కనపడితే, పలకరిస్తే కాస్తంత భయపడతారు. పేరు అడిగినా తల్లిచాటుకి వెళ్లి గొణిగినట్టు చెప్తారు. చాలా కొద్దిమందే ధైర్యంగా మాట్లాడుతూంటారు. ఇంట్లో ఎవ్వరూ లేనపుడు లేదా తల్లి దగ్గరో అరిచి గోల చేసే పిల్లలు ఎప్పుడూ అంతే. స్కూల్లో వేసినా ఒకరిద్దరు మంచి స్నేహంగా ఉండేవరకూ బెరుగ్గానే ఉంటారు. కానీ అమాండా అలా కాదు.. చాలా మంది ముందు మైక్ పట్టుకుని చక్కగా మాట్లాడింది. అదీ తన చిట్టి చెల్లి అమెలా గురించి. అమాండా కి మొన్నీమధ్యనే ఈ చిట్టి చెల్లి పుట్టింది.
బంధువులు, స్నేహితులు వారి పిల్లలతో సహా వాళ్లింటికి వచ్చారు. చిన్నారిని అందరికీ పరిచయం చేయాల్సిన సమయం వచ్చింది. అమాందా తల్లిదండ్రులు చిన్నారిని ఒళ్లో కూచోబెట్టుకున్నారు. ఒక పెద్దాయన హఠాత్తుగా ఇపుడు అమాందా మాట్లాడుతుంది అన్నాడు. అంతే అందరూ ఆశ్చర్యపోయారు. బడికే భయపడి వెళుతోంది.. ఏం మాట్లాడుతుందబ్బా అనుకున్నారు.
చక్కగా బుట్టబొమ్మలా ముస్తాబయిన అమాందా మైకు అందుకుంది. అందరినీ చూసి అందరికీ నమస్కారం. మీరంతా మా యింటికి వచ్చినందుకు సంతోషం. నా చెల్లెలు ..అమెలా.. మొన్ననే పుట్టింది.. అది నా చెల్లెలు. నేను అక్కనయ్యాను.. నేనే ఇక ఇంటి పెద్దదాన్ని.. చెల్లి ఏడ్చినా అమ్మ కంటే నేనే పరుగున వెళతాను... అమెలా నన్ను గుర్తించి నవ్వింది...మేం అక్కాచెల్లెళ్లం..అండ్ ఫ్రెండ్స్ కూడా.
ఇంకేమీ చెప్పాలో తడుముకుంది.. వచ్చిన అతిథులందరూ లేచి చప్పట్లు కొట్టారు. అమాండా మైక్ పడేసి తల్లి , చెల్లి దగ్గరికి పరిగెట్టింది.
తెలిసినవారు వీడియో తీసారు. నెటిజన్లకు విందు చేస్తోంది. మరో పదేళ్ల తర్వాత అక్కాచెల్లెళ్లకు మరింత విందు అవుతుంది.