చెవిలో సాలీడు!
posted on Aug 29, 2022 @ 12:10PM
గుహలో పులి ఉంటుంది, కలుగులో ఎలక ఉంటుంది. బెంగళూరికి చెందిన లక్ష్మి అనే మహిళ చెవిలో ఏకంగా సాలీడు నివాసం ఉంది! ఒకరోజంతా తలపోటు చంపేసింది..ఆ బాధను భరించలేక 49 ఏళ్ల లక్ష్మీ అనే మహిళ పాటించని చిట్కా అంటూ ఏదీ లేదు. వాళ్ల నానమ్మ చెప్పిన వాటి నుంచి ఈమధ్య పక్కింటి పిన్నిగారు చెప్పిన వైద్య నిపుణత అంతా చెవిమీదే ప్రదర్శించింది. నొప్పి తగ్గకపోగా మరింత ఎక్కువ యింది. తీరా డాక్టర్ దగ్గరికి మర్నాడు వెళితే, ఒక సాలీడు గారు తీరిగ్గా ఒళ్లు విరుచుకుంటూ చెవి గుహ లోంచి బయటకి వచ్చింది!
చాలాసేపటి నుంచి తలపోటుగా ఉంటే అనాసిన్ వేసుకోమని అనేకమంది సలహాలిస్తుంటారు. తప్ప కుండా పాటించి విశ్రాంతి తీసుకోవడం పరిపాటి. కొద్దిసేపటికి తగ్గిందని పనుల్లోకి వెళ్లడం సర్వ సాధారణం. కానీ తలపోటు తగ్గకుండా అలానే వేధిస్తుంటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే. చెవిలో ఏదో శబ్దం వస్తోంది దాని వల్లే నొప్పి తగ్గడం లేదని తెలిస్తే పుల్లలతో పొడుచుకోవడం, నూనె చుక్కలు వేసు కోవడం వంటి వంటింటి చిట్కాలు పాటించేస్తుంటారు. కానీ అలా చేస్తేనే ప్రమాదం. చెవిలోకి ఏ ఈగో, దోమో వెళ్లి కాపురం చేస్తోందనే అనుమానం వచ్చినా అటువంటి చిట్కాలు మాత్రం పాటించడం సబబు కాదు.
చెవిలోకి నీళ్లు వెళ్లడం, చిన్న చితకా కీటకాలు తెలియకుండానే వెళ్లడం జరుగుతూంటాయి. అందుకే రోజు లో ఒక్కసారయినా చెవి శుభ్రం చేసుకోవడం మీదా శ్రద్ధపెట్టాలని డాక్టర్లు అంటూన్నారు. కానీ ఇలాం టి సూచనలు అంతగా పాటించకపోవడం వల్లనే లక్ష్మి డాక్టర్ దగ్గరికి వెళ్లవలసి వచ్చింది. డాక్టర్ ఆమె చెవిని పరీక్షించాడు. చెవిలో ఏదో కదులుతున్నట్టు అనిపించింది. దాని వల్లనే తలనొప్పి వచ్చింద నేది తెలు సుకుంది. డాక్టర్ ఆమె చెవిలోకి టార్చి వేసి పుల్లలాంటి పరికరాన్ని తీసుకుని మెల్ల గా చెవి మీద కొట్టారు. మరో అయిదు నిమిషాలకు ఊహించనివిధంగా ఒక సాలీడు.. చిన్నదే.. నెమ్మదిగా బయట పడింది. దాన్ని తీసి టేబుల్ మీద పడేసారు డాక్టర్.
లక్ష్మితో పాటు డాక్టర్‌కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇలాంటివి కొద్దిసేపు ఉన్నా ప్రమాదమే. అదృష్టమేమంటే సాలీడు వల్ల బెంగుళూరు మహిళకు ప్రాణహాని జరగలేదు. హమ్మయ్య పిల్లకి ఏమీ కాలేదనుకున్నారు బంధువులు. సాలీడుని చూసి, దాని రాకను గురించి తెలుసు కుని పిల్లలు ఇంకా నవ్వుకుంటున్నారు.