జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడిలో గ్యాంగ్ రేప్.. రేవంత్ సంచలన ఆరోపణ.. విష్ణు ఖండన
posted on Aug 29, 2022 @ 12:04PM
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ రేప్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసారు. జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం గురించి మాట్లాడిన బిజెపి నాయకులు హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడిలొ గ్యాంగ్ రేప్ జరిగితే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఎఐంఎం నాయకుల పిల్లలు పెద్దమ్మతల్లి గుడి ప్రాంగణంలో గ్యాంగ్ రేప్ కు పాల్పడితే హిందూ మతానికి వారసులుగా చెప్పుకునే బిజెపి నరాయకులు పల్లెత్తు మాట అనలేదనీ, కంటే దుర్మార్గం వుంటుందా అని ప్రశ్నించారు. ఆ సమయంలో ఎలాంటి ఉప ఎన్నికలు లేవు కాబట్టి రాజకీయ లబ్ధి ఉండదు కనుకే బిజెపి నాయకులు ఈ రేప్ కేసు గురించి పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. రేవంత్ ఆరోపణలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరో సంచలనానికి వేదికయ్యాయి. పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సొంత పార్టీ నేత, దివంగత పీజేఆర్ కుమారుడు పి. విష్ణువర్ధన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటనలో రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను విష్ణువర్ధన్ రెడ్డి ఖండించారు. పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఆ దారుణం జరిగిందంటూ అసంబద్ధంగా మాట్లాడటం సరికాదని, పవిత్ర ఆలయంపై అసత్యాలు ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ ఏసీపీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రెండు రోజుల కిందట జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో సంచలన ఆరోపణలు చేశారు. పెద్దమ్మ గుడి ప్రాంగణంలోనే బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని ఆరోపించారు.
హై ప్రొఫైల్ కేసు అయినప్పటికీ ఈ విషయంలో బీజేపీ నేతలు మౌనం వహించడానికి కారణమేమిటని నిలదీశారు. అయితే ఈ విషయంలో బీజేపీ నేతల నుంచి ఎటువంటి స్పందనా రాకపోయినప్పటికీ రేవంత్ రెడ్డి సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయన ఆరోపణలు సత్యదూరమంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి ఏకంగా పోలీసులకే ఫిర్యాదు చేశారు.
జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయం ఛైర్మన్‌గా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి పెద్దమ్మ గుడిలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఆలయ పవిత్రతకు భంగం కలిగేలా ఇష్టారీతిన మాట్లాడితే సొంత పార్టీ వారినైనా సహించేది లేదని విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి.. పీసీసీ చీఫ్‌పై ఫిర్యాదు చేయడం కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేపుతోంది.