స్పీడ్ న్యూస్
posted on Jul 22, 2023 @ 10:31AM
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
1. తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. ఇక శనివారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నభక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి బయటి వరకూ క్యూలైన్ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.
............................................................................................................................................................
కాంగ్రెస్ లో గ్రూపు తగాదాలపై బీఆర్ఎస్ అసత్య ప్రచారం
2. కాంగ్రెస్ లో గ్రూపు తగాదాలున్నాయంటూ బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు కౌంట్ డౌన్ ప్రారంభమయిందన్న పొంగులేటి ఎన్ని కాంక్రీట్ గోడలు కట్టినా కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని చెప్పారు.
.........................................................................................................................................................
మోకాలి నొప్పికి రాహుల్ ఆయుర్వేద చికిత్స
3. మోకాలి సమస్యతో బాధపడుతున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారు. గురువారం కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ అంత్యక్రియల్లో పాల్గొన్న తరువాత శుక్రవారం ఆయన మళపురం జిల్లా కొట్టకల్‌లోని ఆర్య వైద్యశాలను సందర్శించారు.
.............................................................................................................................................
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
4. ప్రకాశం జిల్లా కొనంకిలో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గరు మరణించారు. మరొకరు గాయపడ్డారు. పాల ట్యాంకర్‌ను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.
...............................................................................................................................................
ఏపీలో ఓటర్ల జాబితాలో అక్రమాలు: వెలగపూడి
5. ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తూ తెలుగుదేశం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో 40 వేల ఓట్లు తీసేశారని పేర్కొన్నారు. శాఖ కలెక్టర్, రిటర్నింగ్ అధికారితో పాటు బూత్ లెవెల్ ఆఫీసర్లపై ఆయన ఆ లేఖలో ఆరోపణలు చేశారు.
.......................................................................................................................................................
మహా, గుజరాత్ లకు రెడ్ అలర్ట్
6.దేశంలోని పలు రాష్ట్రాల్లో వచ్చే రానున్న ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ ఈ రోజు పేర్కొంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
.....................................................................................................................................................
సొంత ప్రభుత్వంపై విమర్శలు.. కేబినెట్ నుంచి బర్త్ రఫ్
7. రాజస్థాన్ లో మహిళలకు భద్రత కరవైందంటూ సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేసిన మంత్రి రాజేంద్ర గూడా ను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మంత్రి పదవి నుంచి తొలగించారు. మణిపూర్ హింసాకాండను రాష్ట్ర అసెంబ్లీలో లేవనెత్తే బదులు సొంత ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలని రాజేంద్రగూడ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
......................................................................................................................................................
వైసీపీ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్రం కరవు: తోట
8. వైసీపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ నిప్పులు కురిపించారు. వైసీపీ పాలనలో సామాన్య ప్రజలు స్వేచ్ఛగా బతకలేని పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు. ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీఆర్ఎస్ అవతరించిందన్నారు.
...................................................................................................................................................
మళ్లీ ప్రమాద స్థాయిని దాటిని యమనానది ప్రవాహం
9.యమునా నది నీటిమట్టం నిన్న మరోసారి 205.33 మీటర్ల ప్రమాద స్థాయిని దాటడంతో వరద ప్రభావిత లోతట్టు ప్రాంతాల్లో పునరావాస చర్యలను ఢిల్లీ యంత్రాంగం ముమ్మరం చేసింది. మరింత ఆలస్యమయ్యాయి. యమునా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నది పోటెత్తుతున్నది.
.....................................................................................................................................................
ఆర్ 5 జోన్లో ఇళ్ల నిర్మాణంపై కోర్టు తీర్పు రిజర్వ్
10. అమరావతి ఆర్ 5 జోన్లో ఇళ్ల నిర్మాణాలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ దాఖలైన అనుబంధ పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇరు వర్గాల వాదనలు ముగియటంతో తీర్పు రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ధర్మాసనం.