వివేకా హత్యకు ముందే వైఎస్ కుటుంబంలో కోల్డ్ వార్?!
posted on Jul 22, 2023 @ 9:48AM
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత చిన్నాన్న, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి స్వయానా సోదరుడు, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు ఎన్నో మలుపులు తిరగాలో అన్నీ తిరుగుతున్నది. ఈ హత్య జరిగి ఐదేళ్లు కావస్తున్నా.. ఇదిగో వీళ్ళు ఈ హత్య చేసింది అని తేలలేదు. అయితే, విచారణ జరిగిన తీరు, సీబీఐ ఇచ్చిన వాంగ్మూలాలు, సొంత కుటుంబ సభ్యులే ఇచ్చిన స్టేట్మెంట్లు ఈ కేసులో నేరస్తులు ఎవరో బాహ్య ప్రపంచానికి ఎప్పుడో చెప్పేశాయి. ఇక మిగిలింది ఈ కిరాతకమైన హత్య కేసులో చట్టప్రకారం న్యాయస్థానాలే దోషులను శిక్షించాల్సి ఉంది. ఈ ప్రక్రియ కూడా ఎప్పటికప్పుడో ఇదిగో అదిగో అని వాయిదా పడుతూ వస్తుంది. కారణం ఏంటన్నది తెలియదు కానీ.. సీబీఐ ఈ కేసు విచారణను ఎప్పుడో ముగించాల్సి ఉండగా.. ఇప్పటికీ ఇంకా తేల్చడం లేదు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ తాను నమోదు చేసిన సాక్షుల వాంగ్మూలాలను గత నెల 30వ తేదీన కోర్టుకు సమర్పించింది. దాదాపు 145 పేజీల చార్జి షీట్ ను కోర్టు విచారణకు స్వీకరించడంతో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. వివేకా హత్య కేసులో సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల, ఆయన ఓఎస్డీ పి కృష్ణమోహన్ రెడ్డి, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ అజేయ కల్లం, వైసీపీ కీలక నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జగన్ అటెండర్ గోపరాజు నవీన్ కుమార్ కూడా ఈ సాక్షుల జాబితాలో ఉన్నట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది. అయితే, ఈ కేసులో సాక్షిగా గత ఏడాది అక్టోబర్ 7న వైఎస్ షర్మిల సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో 259వ సాక్షిగా షర్మిల వాంగ్మూలాన్ని సీబీఐ రికార్డు చేసింది. వాంగ్మూలంలో షర్మిల నా వద్ద ఆధారాలు లేవు కానీ.. రాజకీయ కోణంలోనే ఈ హత్య జరిగిందని.. ఈ హత్యకు కుటుంబ ఆర్ధిక అంశాలు కారణం కాదని.. ఆవినాష్ కుటుంబానికి.. వివేకా వ్యతిరేకంగా ఉండటమే హత్యకి కారణం కావచ్చని.. వారి దారికి వివేకా అడ్డువస్తున్నాడని హత్య చేసి ఉండవచ్చని షర్మిల పేర్కొన్నారు.
అంతే కాదు, కుటుంబంలో అందరం బాగున్నట్లు బయటకి కనిపించినా లోపల కోల్డ్ వార్ నడిచేదని షర్మిల సీబీఐకి ఇచ్చిన స్టేట్ మెంట్ లో పేర్కొన్నట్లు తెలుస్తుంది. దీనికి కారణం కూడా షర్మిల సీబీఐకి వివరించారని అంటున్నారు. హత్యకు కొన్ని నెలల ముందే వివేకా బెంగుళూరులో షర్మిల నివాసానికి వెళ్లగా.. కడప ఎంపీగా పోటీ చేయాలని ఉందని తన మనసులో మాట బయట పెట్టారని.. ఎంపీగా అవినాష్ రెడ్డి పోటీ చేయకూడదని వివేకా గట్టిగా కోరుకున్నారని.. అవినాష్ కు ఎంపీ టికెట్ రాకుండా జగన్మోహనరెడ్డిని ఒప్పిద్దామని బాబాయ్ తనతో చెప్పారని.. అలాగే జగన్ కు వ్యతిరేకంగా కూడా వెళ్లే ఉద్దేశం తనకు లేదని.. ఈ విషయంలో మీరు కూడా జగన్ కు చెప్పాలని తన చిన్నాన్న తనను కోరినట్లు షర్మిల వాంగ్మూలంలో పేర్కొన్నారు.
అయితే, ఆ తర్వాత కడప ఎంపీ టికెట్ విషయంపై చిన్నాన్న తమపై పలుమార్లు ఒత్తిడి తెచ్చారని.. కానీ ఆ సమయంలో తామేమీ చెప్పలేకపోయామని.. అప్పటికి ఇంకా టికెట్ల ఖరారు కూడా కాలేదని.. తీరా ఆ సమయానికి ఆయన్ను లేకుండా చేశారని షర్మిల పేర్కొన్నట్లు తెలుస్తున్నది. షర్మిల చెప్పిన దాని ప్రకారం చూస్తే వివేకా హత్యకేసులో వైసీపీ నేతలు చెప్పినట్లు ఆర్ధిక కారణాలు, ఆయన రెండో వివాహం, ఫ్యాక్షన్ పగలు లేనే లేవని స్ఫష్టమవుతుంది. ఒక్క కడప ఎంపీ టికెట్ చుట్టూనే ఈ హత్యకేసు తిరుగుతున్నది.
దీంతో పాటు హత్య జరిగిన సమయంలో జగన్ హైదరాబాద్ లోటస్ పాండ్ లో మ్యానిఫెస్టోపై చర్చిస్తుండగా అవినాష్ రెడ్డే ఈ విషయాన్ని వాళ్లకు చేరవేశారు. ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఏపీ విశ్రాంత సీఎస్ అజేయ కల్లం, వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జగన్ అటెండర్ గోపరాజు నవీన్ కుమార్‌లు ఇచ్చిన వాంగ్మూలంలో కూడా అవినాష్ చిన్నాన్న ఇక లేరనే విషయాన్ని మాత్రమే జగన్ కు చెప్పారని, బాత్ రూమ్, బెడ్ రూమ్ లో రక్తం ఉందనే విషయాన్ని మాత్రమే చెప్పారని పేర్కొన్నారు. హత్య జరిగిందని కానీ.. ఎవరో చేశారని కానీ అవినాష్ జగన్ తో చెప్పినట్లు ఎవరూ వాంగ్మూలంలో పేర్కొనలేదు. దీని ప్రకారం ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అనే విషయం స్పష్టమవుతుంది.