Read more!

సహాయానికి రెక్కలు ఇవ్వద్దు!!

 

మనిషికి ఉన్న గొప్ప గుణాలలో సాటి మనిషికి సహాయం చేయడం కూడా ఒకటి. నిజానికి ఇలాంటి సహాయగుణం అందరికీ ఉండదు కూడా. అడపాదడపా బయట వాళ్లకు సహాయం చేస్తూ ఉండే వాళ్ళు నా అనుకున్న వాళ్లు సమస్యల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ఇంకెంత ముందుంటారో మాటల్లో చెప్పక్కర్లేదు. అయితే  ఈ సహాయ గుణం మెండుగా ఉన్నవాళ్లు పెద్ద తప్పు చేస్తున్నారని ఎవరో కొందరికే అర్థమవుతుంది.

సహాయమా సోమరితనాన్ని పోషించడమా??

అసలు సహాయం అంటే ఎలా ఉండాలి?? సమస్యలకు పరిష్కారం చూపేలా ఉండాలా లేక పూర్తిగా సమస్య నుండి బయటపడేలా చేయాలా?? సమస్య నుండి బయట పడేస్తే ఆ సమస్య నుండి బయట పడినవాళ్ళు సంతోషంగా ఉంటారేమో కానీ ఆ సమస్య తాలూకూ ఇబ్బంది తెలియకుండా సమస్యను సమస్యగా అర్థం చేసుకోలేరు వాళ్ళు అన్నది ఒక ముఖ్య విషయం.

చెప్పుకోవడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇదే నిజం కూడా. సమస్యలలో ఉన్నపుడు ఆ సమస్యను భరించే సామర్థ్యాన్ని, లేదా దాన్ని అధిగమించే మార్గాన్ని చూపించాలి. అంతే కానీ ఒక కాలువ దాటడానికి ఇబ్బంది పడుతున్నపుడు ఇతవతల గట్టు నుండి అవతల గట్టుకు తీసుకెళ్లి కూర్చోబెడితే మధ్యలో ఉన్న ఆ కాలువ లోతు, దాని ప్రవాహ వేగం, దాన్ని తట్టుకుని దాటగలిగే నేర్పు ఇవన్నీ అర్థం కావు. సరిగ్గా ఇదే విషయమే సమస్యలలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలియజేయాలి.

అనుభవమే ఆప్తమార్గం!!

సమస్య వచ్చిందీ అని మొర పెట్టుకోగానే సహాయ గుణం కలిగిన వాళ్ళు పరిగెత్తికుంటూ వెళ్లి, అయ్యో పాపం అనుకుంటూ తమలో ఉన్న నేర్పు, చాకచక్యంతో ఆ సమస్యను చిటికెలో పరిష్కరిస్తే అవతలి వాళ్లకి ఆ సమస్య ఎలా అర్థమవుతుంది అనే విషయం అర్థం చేసుకున్నవాళ్ళు పరిష్కార మార్గాన్ని సూచిస్తారు. సలహాలు ఇస్తారు. ఫలితంగా సమస్యను నేరుగా భరిస్తూ పరిష్కరించుకునే అవకాశం బాధితులకు లభిస్తుంది. అదే సమస్య మరొక్కసారి ఎదురైనప్పుడు ఎవరి సహయమూ లేకుండా సమస్యను పరిష్కరించుకోగలుగుతారు. అదే అనుభవం నేర్పే పాఠం. అనుభవం ఇచ్చే ధైర్యం.

అత్యుత్సాహం అనర్థదాయకం!!

కొందరుంటారు. వాళ్లకు నేర్పు ఎక్కువగా ఉంటుంది. సమస్యలను అధిగమించే నైపుణ్యం ఉంటుంది. అయితే ఇతరులు సమస్యలలో ఉన్నపుడు అత్యుత్సాహంతో వాళ్ళ  ముందు తమ ప్రతిభను చూపెట్టాలనో, వాళ్ళను ఆకర్షించాలనో వాళ్ళ సమస్యను తమ సమస్యగా భావించి సులువుగా పరిష్కరిస్తారు. దీని ఫలితంగా జరిగేది ఒకటే ఆధారపడిపోయే గుణాన్ని ఎదుటి వ్యక్తిలో పెంచడం. ఇలా ఆధారపడే గుణం పెరిగిపోతూ ఉంటే ఒకానొక సందర్భంలో ఎంత చిన్న సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించుకోలేక సహాయం కోసం చుట్టూ చూసే స్తాయికి దిగజారిపోతారు. కాబట్టి సహాయం ఎప్పుడూ అత్యుత్సాహంతో చేయకూడదు.

ఎదుటి వారి సమస్యను దాని ప్రభావాన్ని బట్టి సలహా, సూచన, పరిష్కార మార్గం అన్నిటి తరువాత స్వయంగా తోడ్పాటు అందించడం వంటివి చేయాలి. అంతేకానీ ఎదుటి వారి సమస్యను మనది చేసుకుని వాటిని పరిష్కరిస్తూ ఉంటే మనం ఈ సమాజంలో చేతకాని వాళ్ళను తయారుచేస్తున్నట్టే లెక్క.

పై విషయాలు అన్ని గమనిస్తే ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఇదే రకమైన మార్గాలు అనుసరిస్తూ ఉంటారు. అంటే తమ పిల్లలను తామే చేతగానివాళ్లుగా తయారుచేస్తున్నారని అర్థం.  ఇలా మీ సహాయానికి రెక్కలు ఇచ్చి, పిల్లల రెక్కలు ఎదగనివ్వకుండా, వాటి సహాయంతో వాళ్ళు స్వయంగా ఎగరలేకుండా చేయకూడదు. చేశారంటే తల్లిదండ్రులు, పిల్లలు కూడా నష్టపోతారు సుమా!!

◆ వెంకటేష్ పువ్వాడ