సోముకు ఉద్వాసనతో జీవీఎల్ ఆశలు గల్లంతు.. లింకేంటి?
posted on Jul 7, 2023 @ 3:10PM
ఏపీ బీజేపీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నాయకత్వాల మార్పుతో సమీకరణలు మారుతున్నాయి. సోము వీర్రాజు స్థానంలో అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరిని పార్టీ హైకమాండ్ నియమించిన సంగతి తెలిసిందే. సోము వీర్రాజును తప్పించి పురంధేశ్వరిని ఏపీ బీజేపీ చీఫ్ గా ఆ పార్టీ నియామకంతో ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ ఆశలు అడియాశలు అయ్యాయని కమలం శ్రేణులలో చర్చ మొదలైంది.
అదేంటి సోము వీర్రాజు ఉద్వాసనకూ, పురందేశ్వరి నియామకానికీ సోము వీర్రాజుకూ సంబంధం ఏమిటనుకుంటున్నారు. జీవీఎస్ బీజేపీ రాజ్యసభ సభ్యుడే అయినా ఆయన కు ఆ సభ్యత్వం ఏపీ నుంచి కాదు వేరే రాష్ట్రం నుంచి. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఆయన విశాఖ నుంచి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఆయన రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. సోము వీర్రాజుకు రాష్ట్ర బీజేపీ పగ్గాలు లభించడం వెనుక సోము వీర్రాజు ఉన్నారని కూడా పార్టీ శ్రేణులు చెబుతుంటారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్ సభ స్థానానికి పోటీ చేయాలని నిర్ణయించుకున్న జీవీఎల్ డిసైడయ్యారు. అందుకే అక్కడే ఇళ్లు కొనుగోలు చేశారని చెబుతున్నారు.
ఇక పురంధేశ్వరికి రాష్ట్ర బీజేపీ పగ్గాలను హై కమాండ్ అప్పగించడంతో విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేయాలన్న జీవీఎల్ ఆశలు గల్లంతైనట్లేనని అంటున్నారు. ఎందుకంటే పురంధేశ్వరి విశాఖ నుంచి 2009లో లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆ స్థానం మారిన తరువాత ఆమె వరుసగా రెండు సార్లు పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర పగ్గాలు అందుకున్న ఆమె తనకు అచ్చి వచ్చిన విశాఖ నుంచి పోటీ చేయడానికి లైన్ క్లియర్ అయిపోయినట్లే భావించవచ్చు.
2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. కేంద్ర మంత్రి కూడా అయ్యారు. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. భారతీయ జనతా పార్టీలో చేరారు. 2014లో పొత్తులో భాగంగా విశాఖ నుంచి బరిలో దిగాలని చూసినా హరిబాబు ఉండడంతో సాధ్యం కాలేదు. రాజంపేట నుంచి పోటీకి దిగినా నెగ్గలేదు. ఆ తరువాత 2019లో విశాఖ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసినా పరాజయం పాలయ్యారు. దీంతో ఆమె 2024లో విశాఖ నుంచి పోటీ చేసి విజయం సాధించాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో 2014 నాటి పొత్తులు మళ్లీ పొడుస్తాయని భావిస్తున్న తరుణంలో గెలుపు నల్లేరు మీద బండినడకేనని అంటున్నారు. అయితే నిన్న మొన్నటి వరకూ పురంధేశ్వరికి విశాఖ బీజేపీ టికెట్ కు మధ్య జీవీఎల్ నరసిహరావు ఉన్నారు.
ఎప్పుడైతే బీజేపీ పగ్గాలు సోము వీర్రాజు చేతుల నుంచి పురంధేశ్వరికి వచ్చాయో.. ఇక పార్టీ హై కమాండ్ సోము వీర్రాజు అభ్యర్థిత్వాన్ని కనీసం పరిగణనలోకి కూడా తీసుకునే అవకాశం ఉండదని అంటున్నారు. సోము వీర్రాజు వ్యవహారశైలిని గట్టిగా వ్యతిరేకించిన ఏపీ బీజేపీ నేతలలో పురంధేశ్వరి కూడా ఉన్నారు. జగన్ సర్కార్ తో రాష్ట్ర బీజేపీ అంటకాగుతున్నదన్న భావన జనబాహుల్యంలో కలిగేలా సోము వీర్రాజు వ్యవహరిస్తుంటే ఆయనకు జీవీఎల్ వంతపాడుతున్నారని కూడా పురందేశ్వరి విమర్శించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్రపగ్గాలు సోము వీర్రాజు నుంచి పురందేశ్వరికి బదలీ అయ్యాయి.
రాష్ట్ర బీజేపీ ప్రొ వైసీపీ అన్న ఇమేజ్ నుంచి బయటపడేందుకు ఈ మార్పు దోహదపడుతుందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సోము వీర్రాజుకు వంత పాడుతూ వచ్చిన జీవీఎల్ రెక్కలు కూడా అధిష్ఠానం కత్తిరించినట్లేనని పరిశీలకులు అంటున్నారు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందంగా అధిష్ఠానం సోము విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేసిన తరువాత జీవీఎల్ వైసీపీపై విమర్శల దాడి పెంచి జనసేన, తెలుగుదేశం పార్టీలను పన్నెత్తు మాట అనడం మానేశారు. కానీ అప్పటికే ఆలస్యమైంది.